
రుయాలో చికిత్స పొందుతున్న చంద్రకళ
తిరుపతి (అలిపిరి): మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిందని కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేయడంతో చంద్రకళ అనే మహిళ శనివారం సాయంత్రం జీవకోన గాంధీనగర్‌లోని తల్లిదండ్రుల ఇంటిలో ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు ఆమెను రుయా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం ఆమె కోలుకుంటోంది. చంద్రకళ తండ్రి గౌరీశంకర్ మాట్లాడుతూ మదనపల్లెకు చెందిన గిరిబాబు, అతని భార్య నాగమణి కలిసి తన కూతు రు చంద్రకళపై లేనిపోని ఆరోపణలు చేశారని తెలిపారు.
తన కూతురు మదనపల్లెలో ఓ స్కూలుల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న సమయంలో గిరిబాబు లోబరుచుకునే ప్రయత్నం చేశాడని, తీవ్రంగా ప్రతిఘటించిన తన కూతురిపై రూ.7 లక్షలు దొంగతనం చేసిందంటూ తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. గుట్కా వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డ గిరిబాబుతో చంద్రకళ భర్త గురుప్రసాద్ కలిసి తన కూతురును వేధిస్తున్నారని వాపోయారు. వారి వేధింపుల కారణంగా ఇద్దరు పిల్లలున్న తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందన్నారు. కూతురు రాసిన సూసైడ్‌నోటుతో అలిపిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.