
గదగ్ జిల్లాలో డ్రిల్ టీచర్ ఆత్మహత్య
మాజీ ప్రియుని వేధింపులే కారణం
రాయచూరు రూరల్(కర్ణాటక): పాగల్ ప్రేమికుని వేధింపులకు ప్రతిభా కుసుమం రాలిపోయింది. పరువు పోతుందనే వ్యథతో ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గదగ్ జిల్లా అసుండి గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు బ్లాక్‌మెయిల్ చేస్తుండటంతో భయపడి గదగ్ తాలూకా అసుండి సైరా బాను నదాఫ్ (29) డెత్‌నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మే 8న సైరాబానుకు ఓ యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు.
పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. గతంలో ఆమెకు మైలారి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. మరొకరిని పెళ్లాడతావా అనే దుగ్ధతో మైలారి రగిలిపోయాడు. గతంలో తామివద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను, అలాగే ఆడియోలను వైరల్ చేస్తానంటూ సైరాబానును బెదిరించసాగాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుందని ఆమె బాధపడింది. తన చావుకు మైలారి కారణమని నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయింది.
ఆటల్లో ఆమె మేటి
సైరాబాను చిన్నచాటి నుంచి ఆటపాటల్లో మేటిగా ఉండేది. క్రీడాంశాల్లో ప్రతిభావంతురాలు. స్కూలు, కాలేజీ రోజుల్లో క్రీడాకారిణిగా ట్రోఫీలను సాధించింది. కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించింది. అదే నైపుణ్యంతో పీఈటీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్‌లో డ్రిల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. గదగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైలారిని అరెస్టుచేశారు.