
నగ్నఫొటోలతో బాలికను బ్లాక్ మెయిల్ చేసిన పూణె వాసి
టెలిగ్రామ్‌లో చాటింగ్.. అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడి
పోలీసుల దర్యాప్తు.. పోక్సో కేసు నమోదు..
ఫిలింనగర్: ఆన్‌లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్‌లైన్ చాటింగ్‌లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు.
ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్‌లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.
అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్‌డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది.
నగ్న ఫొటోలతో బెదిరింపులు..
వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు.
అర్ధరాత్రి అత్యాచారం..
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్‌డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment