
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే చెప్పే వైద్యులు.. పరిమితంగా తాగాలంటూ మరోవైపు సూచించడం ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏడాదిలో నమోదు అయ్యే మరణాల్లో 4.7 శాతం మరణాలు మద్యానికి సంబంధించినవే ఉంటున్నాయట. ఏడాదికి సుమారు 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే..
కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్‌లో ఘోరం జరిగింది. స్నేహితులతో రూ.10 వేల కోసం పందెం కాసిన ఓ యువకుడు 5 ఫుల్ బాటిళ్ల లిక్కర్‌ను.. అదీ నీరు కలపకుండా(కచ్చాగా) గడగడా తాగేశాడు. ఆపై తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితులతో సిట్టింగ్ వేసిన టైంలో తాను ఐదు సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని కార్తీక్ (21) అనే యువకుడు సవాల్ విసిరాడు. దానికి స్పందించిన స్నేహితులు.. అలా తాగితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కాశారు. దీంతో.. కార్తీక్ ఐదు బాటిళ్ల మద్యాన్ని నీరు కలపకుండా గడగడా తాగేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే అతడిని ములబాగిల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాన్‌గలి పోలీసులు కార్తీక్ స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.