
తనకు తానే కాల్పులు జరుపుకున్న రిక్కీరై!
పోలీసులు విచారణలో నోరువిప్పిన
మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్
కర్ణాటక: పారిశ్రామికవేత్త రిక్కీరైపై జరిగిన కాల్పుల ఘటన మలుపు తిరిగింది. ఆయన తనంటత తానే కాల్పులు జరుపుకున్నారని కాల్పుల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులకు పాల్పడ్డారనే అనుమానంతో మన్నప్పవిఠల్‌ను బిడది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని రామనగర కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.
తమదైనశైలిలో విచారణ చేపట్టగా రిక్కీరై తనంతటతానే కాల్పులు జరుపుకున్నట్లు మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రిక్కీరై షూటౌట్ కాల్పుల ఘటనపై నాటకం ఆడినట్లు అనుమానం మరితం బలపడినట్లైంది. మాజీ డాన్ దివంగత ముత్తప్పరై చిన్నకుమారుడు పారిశ్రామికవేత్త రిక్కీ రైపై ఈనెల 18వ తేదీ రాత్రి 11.30 సమయంలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా బిడది వద్ద ఆయనపై ఫైరింగ్ జరిగింది.
రిక్కీరై ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం అతడిని బెంగళూరు హెచ్‌ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు షూటౌట్ జరిగిన స్థలంలో లభించిన బుల్లెట్, విఠల్ వద్ద ఉన్న గన్‌లోనిదని తేలింది. పోలీసులు ఇతడి గన్‌ను స్వాదీనం చేసుకుని ఎప్‌ఎస్‌ఎల్ ల్యాబోరేటరీకి పంపించారు. ముత్తప్పరై వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న విఠల్.. రిక్కీ రై వద్దనే పనిచేసేవాడు. ఆరోగ్యం సరిగాలేనందున ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంటివద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు.
ముత్తప్పరై చనిపోకముందు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రిక్కీ రై సైట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కారణంతో మన్నప్పవిఠల్ కోపంతో ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. రిక్కీరై గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు పేర్లు ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసులో ఉన్న పాత్ర ధ్రువీకరించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనబడకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ముత్తప్పరై మాజీ సహచరుడు, మొదటి ఆరోపి రాకేశ్‌మల్లి, మూడో ఆరోపి నితీశ్‌శెట్టిని విచారణ చేపట్టి పోలీసులు వదిలిపెట్టారు. రెండో ఆరోపి ముత్తప్పరై రెండో భార్య అనురాధ విదేశాల్లో ఉన్నారు.