'ముత్తప్ప ముందు దావూద్ ఎంత!'
'గాడ్ ఫాదర్ ఆఫ్ బెంగళూరు' గా పేరుపొందిన ముత్తప్ప రాయ్ నేరజీవితంలోని నాటకీయతతో పోల్చుకుంటే ప్రపంచ ప్రఖ్యాత డాన్లు పాబ్లో ఎస్కోబర్, దావూద్ ఇబ్రహీమ్, అత్ కపొనే లాంటి వాళ్ల జీవితాల్లోని నాటకీయత ఎందుకూ పనికిరానిది' అంటూ తన తాజా చిత్రం 'రాయ్' ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోనే కాక దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో దందాలు చేసి, క్రైమ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, హిందీల్లో రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు.
ముత్తప్ప రాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1న 'రాయ్' ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని, స్వయంగా ముత్తప్పరాయే దాన్ని విడుదల చేస్తారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. మొదట 'అప్ప'గా అనుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సుదీప్ ను ఎంపికచేశారు. అయితే అనివార్యకారణాలవల్ల సుదీప్ స్థానంలో వివేక్ ఒబెరాయ్ ని రాయ్ పాత్రకోసం ఫైనలైజ్ చేశామని, బెంగళూరు, మంగళూరు, ముంబై, దుబాయ్, లండన్ తదితర దేశాల్లో షూటింగ్ చేస్తామని వర్మ తెలిపారు. సీఆర్ మనోహర్ ఈ సినిమాకు నిర్మాత.
బెంగళూరుకు చెందిన ముత్తప్ప రాయ్ యువకుడిగా ఉన్నప్పుడు నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి, డాన్ గా ఎదిగాడు. తనపై హత్యాయత్నం జరగటంతో దుబాయ్ పారిపోయిన రాయ్.. అక్కడ దావూద్ తో కలిసి నేరాలు కొనసాగించారు. 2002లో అనూహ్యంగా ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోయిన ముత్తప్ప 2008లో జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యాడు! 'జయ కర్ణాటక' ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అటు హోటల్ వ్యాపారాల్లోనూ రాణిస్తూ ఉత్తమ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్ చిత్రమే 'రాయ్'.