
నిండు గర్భిణి ఆత్మహత్య
సింధనూరు వద్ద ఘోరం
కర్ణాటక: ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్న ఓ యువతి.. నిండు గర్భిణిగా ఉండి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం రాయచూరు జిల్లా సింధనూరు గ్రామీణలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బూదిహాల్‌కు చెందిన యువకుడు నాగరాజు బ్రతుకుతెరువు కోసం బెంగళూరులో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేసే దుకాణ యజమాని కూతురు, చామరాజనగర జిల్లా కొళ్లేగాళకు చెందిన పల్లవి అలియాస్ అనుపమతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది.
కట్న వేధింపులు పెరిగి
సుమారు ఏడాది కిందట గంగావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పల్లవి తొమ్మిది నెలల గర్భిణి. పల్లవి అగ్రవర్ణురాలు కాగా, నాగరాజ్‌ది మరో కులం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు, కట్న వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ కోసం అందరినీ వదులుకుని వస్తే జీవితం తలకిందులైందని పల్లవి ఆక్రోశించింది. గురువారం బూదిహాల్‌లో భర్త ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ తలవార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవలు జరగకుండా బూదిహాళలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త నాగరాజ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశామని సిఐ వీరారెడ్డి తెలిపారు.