pregnant women
-
లగ్న జననం!
ఒకప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే మావోడు ఏ ముహూర్తంలో పుట్టాడో చెప్పండి అని పండితులు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఇప్పుడు పుట్టకముందే జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి డెలివరీకి ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు. ముహూర్తం చూసుకుని శుభ ఘడియల్లో అమ్మ కడుపులోని బిడ్డను బయటకు తీస్తున్నారు. ఎక్కువ మంది రెండో బిడ్డ ప్రసవానికి ఈ లగ్నం పెడుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే, రెండో కాన్పు ఎలాగూ సిజేరియనే కదా అని నెలలు నిండక ముందే తేదీ నిర్ణయించేస్తున్నారు. రెండు మూడు రోజుల ముందు, మరి కొందరైతే వారం, పక్షం రోజుల ముందే బిడ్డను బయటకు తెచ్చేస్తున్నారు. ఈ ప్రసవం తరువాత తల్లికి బిడ్డకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. కాణిపాకం: సిజేరియన్ పేరు చెబితే ఒకప్పుడు గర్భిణులంతా భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా కత్తి వాడుతున్నారు. కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదు. సహజ కాన్పులో వేదన తప్ప కలిగే ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రమైన చిత్తూరుతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లు ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్లపై జిల్లావాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు సిజేరియన్ చేసుకోవాలని నిర్ణయించు కుంటున్నారు. వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. ఎలాగూ డబ్బులు వస్తాయి కదా అని వారికి అవగాహన కల్పించకుండా ఆపరేషన్ చేయడానికి సిద్ధమై పోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం వినిపించుకోకపోవడం విడ్డూరం. పండుగల్లో ప్రత్యేకం శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బిడ్డపైన ప్రభావం » బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. » అసహజ రీతిలో చేసే కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. » బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. ఇదీ వ్యాపారమే! ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.40వేల నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్ ఆపరేషన్‌కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును. ముహూర్తాల వెర్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ ఎప్పుడు చేస్తారంటే.. » గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు » గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం » గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్లు చేస్తారు. » తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు. అది భగవంతుడి నిర్ణయంపుట్టుక అనేది భగవంతుడు నిర్ణయించింది. ఆ సమ యంలోనే జననం జరగాలి. డెలివరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతు న్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకెళుతున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం మంచిరోజు చూసుకునే సిజేరియన్ చేసుకుంటున్నారు. – సుధాకర్ గురుక్కల్, అర్చకులు, చిత్తూరు కడుపు కోత మంచిది కాదు చాలా మంది ముహూ ర్తం పెట్టి సిజేరియన్‌కు సిద్ధమవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీని వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసర మైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – ప్రభావతి, డీసీహెచ్ఎస్, చిత్తూరు -
Paris Olympics 2024: అమ్మతనం ఆటకు అడ్డు కాలేదు
గర్భిణి స్త్రీలు ప్రతి విషయంలో ఆచితూచి ఉండాలి. అయితే కొన్ని సందర్భాలు సవాళ్లు విసురుతాయి. దేశం కోసం నిలబడమంటాయి. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళలు గర్భంతో పోటీల్లో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫెజ్ ఆరునెలల గర్భంతో, అజర్బైజాన్ ఆర్చర్ యయలాగుల్ రమజనోవా ఐదున్నర నెలల గర్భంతో ప్రత్యర్థులతో పోరాడారు. గెలుపు ఓటముల కంటే కూడా వాళ్లు పాల్గొనడమే పెద్ద గెలుపు. వీరు మాత్రమే కాదు, గర్భిణులుగా బరిలోకి దిగిన అథ్లెట్స్ గత ఒలింపిక్స్ లోనూ ఎంతోమంది ఉన్నారు.పదహారవ రౌండ్లో ఓటమి తరువాత తాను ఏడు నెలల గర్భిణిని అని ప్రకటించింది ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్. ఆమె ప్రకటన సంచలనం కలిగించింది. నిజానికి గర్భిణిగా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు, ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన తరువాత గర్భిణి అని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు....ఎలినార్ బర్కర్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ సైకిలింగ్ స్టార్ ఎలినార్ బర్కర్ మూడు నెలల గర్భిణి. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న ఎలినార్ ఆ తరువాతే తాను గర్భిణిని అనే విషయం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘రేసుకు కొద్దిరోజుల ముందు టోక్యోలో నేను గర్భవతినని తెలుసుకున్నాను. ఇది నేను ఊహించని విషయం. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యాను’ ఆరోజును గుర్తు చేసుకుంటుంది ఎలినార్. ఎలినార్ బార్కర్ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతుండేది. దీని వల్ల గర్భిణులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండడం ఆమె ఒత్తిడికి కారణం. కొద్దిరోజుల్లో ఆట, మరో వైపు కొండంత ఒత్తిడి. టీమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి సలహాలు తీసుకుంది. ధైర్యం తెచ్చుకుంది. మెడల్ గెలుచుకుంది.ఆంకీ వాన్ గ్రన్సె్వన్: డచ్ డ్రెస్సేజ్ ఛాంపియన్ ఆంకీ వాన్ గ్రన్సె్వన్ అయిదు నెలల గర్భిణిగా ఒలింపిక్స్ బరిలోకి దిగి స్వర్ణ పతకం సాధించింది.క్రిస్టీ మూర్: అయిదు నెలల గర్భిణిగా 2010 ఒలింపిక్స్ బరిలోకి అడుగు పెట్టింది కెనడియన్ కర్లర్ క్రిస్టీ మూర్. కాస్త వెనక్కి వెళితే...ఒకరోజు కర్లింగ్ టీమ్ నుంచి క్రిస్టీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఐయామ్ ప్రెగ్నెంట్’ అని చెప్పింది క్రిస్టీ. ‘ఆడడం మీకు కష్టమవుతుందా’ అవతలి గొంతు.ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఆ సమయంలో తన టీమ్మెట్ ఒకరు.... ‘నువ్వు ప్రెగ్నెంట్ మాత్రమే. చనిపోలేదు’ అన్నది. దీని అర్థం ‘నీలో పోరాడే సత్తా’ ఉంది అని. దీంతో మరో ఆలోచన చేయకుండా ఒలింపిక్ బరిలోకి దిగింది క్రిస్టీ మూర్.‘ఒలింపిక్స్‌లో పాల్గొనడం, మాతృత్వం... రెండూ అపురూపమే. పెద్ద సవాలు అని తెలిసినా ముందుకు వెళ్లాను’ ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది క్రిస్టీ మూర్.మరి కొందరి విషయానికి వస్తే....అమెరికన్ ఐస్–హాకీ ప్లేయర్ లీసా బ్రౌన్ మిల్లర్ 1998 వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంది, అక్కడికి వెళ్లాకే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. అమెరికన్ సాఫ్ట్‌బాల్ ప్లేయర్ మిషల్ గ్రెంజర్ మూడు నెలల గర్భిణిగా 1996 ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. జర్మన్ ఆర్చర్ కర్నోలియ ఏడు నెలల గర్భిణిగా 2004 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది... ఈ జాబితా ఇంకా ఉంది. వీరిలో స్వర్ణాలు గెలుచుకున్నవారు ఉన్నారు. గెలవకపోయినా సత్తా చాటిన వారు ఉన్నారు.‘వీడు కడుపులో ఉన్నప్పుడే నాతో పాటు ఒలింపిక్స్ ఆడాడు’ అని తమ బిడ్డల గురించి గర్వంగా చెబుతుంటారు ఆ అథ్లెట్ తల్లులు.ఆ సమయంలో...రక్తస్రావంలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్ప సాధారణంగా తేలికపాటి వ్యాయామాలను గర్భిణి అథ్లెట్లకు సూచిస్తాం. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో రొటీన్ ఎక్సర్సైజ్లు చేసినా ఫరవాలేదు. ఎక్కువగా చేయడానికి ప్రయత్నించవద్దు. మితంగా చేస్తే చాలు అని చెబుతుంటాం. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలనుకునేవారికి మాత్రం సాధ్యమైనంత వరకు వద్దనే చెబుతాం.– డా. ఆశా దలాల్, సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్స్ ఉమెన్ సెంటర్ డైరెక్టర్ -
‘ఈనాడు’ అవాస్తవ ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వసతి గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజుల ముందు చేరుకుంటారని.. వారికి రోజుకు రూ.300 ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. సాలూరు పరిసర ప్రాంతాల్లోని గర్భిణుల కోసం సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలందించేందుకు ఏఎన్ఎంలను నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మ లక్ష్మీపురంలోనూ ఓ వసతి గృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.3,75,000 అందించామని తెలిపింది. రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనని శిశు సురక్షా కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రిఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు రూ.29.09 కోట్లు విడుదల చేశామని తెలిపింది. దీంతోపాటు గర్భిణులకు 108 అంబులెన్స్‌లు, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. -
అమ్మకు ఆరోగ్య రక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు. నెలకు మూడుసార్లు గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీఎంఎస్ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్‌ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు. ఆగస్టులో 2.04 లక్షల మందికి.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్సీ), పోస్ట్‌నేటల్(పీఎన్సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు ఆన్లైన్లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ -
ఆర్సీహెచ్‌తో గర్భిణుల అభా ఐడీ మ్యాపింగ్
గర్భిణులు, బాలింతలు, పుట్టిన బిడ్డలకు అందించేవైద్య సేవలన్నింటినీ డిజిటలైజేషన్ చేయడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గర్భిణుల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (అభా)ను రీప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ (ఆర్సీహెచ్) పోర్టల్‌తో మ్యాపింగ్ చేస్తోంది. రాష్ట్రంలో 2022–23లో 8.71 లక్షలు, 2023–24లో ఇప్పటి వరకు 2.34 లక్షల మంది గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యారు. ప్రతి గర్భిణికి ప్రత్యేక రిజి్రస్టేషన్ ఐడీ ఉంటుంది. అభా నంబర్‌ను ఈ ఐడీతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల మంది గర్భిణుల అభా ఐడీలను ఆర్సీహెచ్‌తో అనుసంధానించారు. మరో 5.95 లక్షల మంది ఐడీల అనుసంధానం కొనసాగుతోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 శాతం గర్భిణుల మ్యాపింగ్ పూర్తయింది. తూర్పు గోదావరిలో 68.71 శాతం, అనకాపల్లిలో 59.25 శాతం మ్యాపింగ్ చేశారు. ఆర్సీహెచ్ పోర్టల్‌తో అభాను మ్యాపింగ్ చేస్తే గర్భం దాల్చిన నాటి నుంచి ఆ మహిళకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, టీకాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవన్నీ అభాలో నిక్షిప్తం అవుతాయి. ప్రసవానంతరం బాలింత వైద్య పరీక్షల వివరాలు కూడా ఇందులో నమోదవుతాయి. మరోవైపు చిన్నపిల్లలకు సార్వత్రిక టీకాల నమోదు కోసం కోవిన్ తరహాలో యూవిన్ పోర్టల్‌ను కేంద్ర వైద్య శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. ఈ యూవిన్ పోర్టల్‌కు తల్లి అభా ఐడీని మ్యాప్ చేయడం ద్వారా చిన్నారుల టీకా వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పుడైనా సార్వత్రిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. 79.95 శాతం మందికి అభా ఐడీ ప్రజలకు డిజిటల్ వైద్య సేవలపై వైద్య శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) అమలులో తొలి నుంచి రాష్ట్ర వైద్య శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి అభా ఐడీ సృష్టించాల్సి ఉంది. ఇప్పటివరకు 3.84 కోట్ల మందికి అంటే.. 79.95 శాతం మందికి వైద్య శాఖ ఐడీలు సృష్టించింది. ఎన్సీడీ–సీడీ నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరికీ అభా ఐడీ సృష్టిస్తున్నారు. దీంతో పాటు బీపీ, సుగర్, ఇతర వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. టీబీ, డయాలసిస్, సికిల్ సెల్ అనీమియా రోగులకు కేటాయించిన ప్రత్యేక ఐడీలను అభాతో అనుసంధానిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
ఒక్క ప్రసవం చేస్తే ఒట్టు... రెండు పీహెచ్‌సీలు ఉన్నా జరగని కాన్పులు
బషీరాబాద్: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ప్రసవాలు మాత్రం చేయడం లేదు. తాండూరు జిల్లా ఆస్పత్రికి 25కి.మీ. దూరంలో మండలం ఉండడంతో ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే సంకల్పంతో బషీరాబాద్, నవల్గా గ్రామాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్‌లో 24 గంటల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడి సిబ్బంది ఉదయం10కి వచ్చి సాయంత్రం 5గంటలకు ఇళ్లకు వెళ్లి పోతున్నారు. రాత్రి వేళ గర్భిణులు వచ్చినా, యాక్సిడెంట్ కేసులు, పాము కాటు కేసు బాధితులను తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇన్ పేషెంట్లు వస్తే సాయంత్రం వరకు వైద్యం చేసి రాత్రికి ఇంటికి పంపుతున్నారు. లేబర్ రూమ్ సరిగ్గా లేకపోవడంతో మూడు నెలలుగా ప్రసవాలు నిలిచిపోయాయి. కొంతమంది గర్భిణులు తాండూరు పీహెచ్సీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్నారు. నవల్గ్గాలో మరీ దారుణం నవల్గ్గా పీహెచ్సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పీహెచ్సీ పరిధిలో మూడు గ్రామాలు ఉండగా ఒక్క కాన్పు కూడా జరగలేదు. అడపాదడపా వచ్చే రోగులకు ఓపీ చూసి సాయంత్రం కాగానే ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైన ప్రమాదం జరిగితే తాండూరు వెళుతున్నారు కానీ, పీహెచ్‌సీకి రావడం లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. బషీరాబాద్ మెడికల్ అధికారిగా పనిచేస్తున్న వైద్యుడు గోపాల్ ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నాడు. స్కానింగ్‌కు ప్రైవేటు సెంటర్లకు మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు లేకపోవడంతో గర్భిణులు తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఒకే కేంద్రం ఉండడంతో అక్కడ స్కానింగ్‌కు సమయం పడుతోంది. దీంతో గర్భిణులు బయట కేంద్రాల బాట పడుతున్నారు. పీహెచ్‌సీల్లో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు బషీరాబాద్ పీహెచ్సీలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అయితే ఇక్కడి సిబ్బంది ఆరేడు గంటలు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసవాల కోసం వచ్చినా, ప్రమాదాలు జరిగినా తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రాత్రి వేళ ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గతంలో పాము కాటుకు గురైన యువకుడు ఆస్పత్రికి వస్తే ఇంజక్షన్ ఇచ్చేవారు లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి మృతి చెందాడు. – లక్ష్మణ్, యువజన సంఘం నాయకుడు, బషీరాబాద్ -
డాక్టరైన మహిళా కండక్టర్
బనశంకరి: కేఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ డాక్టర్‌గా మారి సురక్షితంగా కాన్పు చేసింది. చిక్కమగళూరు డిపోకు చెందిన కేఎస్ ఆర్టీసీ బస్సు సోమవారం బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తోంది. బెంగళూరు నుంచి బేలూరుకు ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి ప్రసవ వేదన ఆరంభమైంది. బస్సు వెళ్లే మార్గంలో అటు ఇటు 16 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఆసుపత్రి లేదు. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ ఎస్.వసంతమ్మ బస్సును నిలిపి ప్రయాణికులను కిందికి దింపివేశారు. ఆమె గర్భిణికి కాన్పు చేయగా ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.మహిళ నిరుపేద కావడంతో చేతిలో ఖర్చులకు కూడా డబ్బులు లేవు, ఆమె పరిస్థితిని గమనించి కండక్టర్, డ్రైవరు ప్రయాణికులు కలిసి రూ.1,500 సేకరించి బాలింతకు అందజేశారు. తరువాత అంబులెన్స్ ద్వారా శాంతిగ్రామ ఆసుపత్రిలో చేర్చారు. మహిళా కండక్టర్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
గర్భిణులకు అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్
సాక్షి, అమరావతి: గర్భిణులు, తల్లీ బిడ్డల సంరక్షణకు ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఈ పరీక్ష దోహద పడుతుంది. ఖరీదైన ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ లోపాలున్న వారికి టిఫా స్కాన్ మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ (గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు (మెంటల్ డిజెబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వంటి సమస్యలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి లోపాలన్నింటినీ టిఫా స్కాన్‌తో గుర్తించే అవకాశం ఉంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉంది? జరాయువు/మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉంది? ఉమ్మ నీరు స్థితి, శిశువులో ఇతరత్రా లోపాలను దీని ద్వారా గుర్తించి, వెంటనే సరిదిద్దడానికి వీలుంటుంది. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ/సిజేరియన్ ప్రసవం అవసరం అవుతుందా అన్నది కూడా అంచనా వేయవచ్చు. 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తారు. ఇప్పటికే పలు రకాలుగా అండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తల్లీ బిడ్డల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేంత వరకు అండగా ఉంటోంది. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా గ్రామాల్లోనే గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు చేయిస్తోంది. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 అంబులెన్స్‌ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు చేరుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డెలివరీ సేవలు పొందిన మహిళలకు ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారిలో గర్భిణులు రెండో స్థానంలో ఉన్నారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణులు ప్రసవం సేవలు పొందారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం గర్భిణులను వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తూ టిఫా స్కాన్‌ను ఉచితంగా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేశాం. హై రిస్క్ గర్భిణులను డెలివరీ డేట్‌కు ముందే ఆస్పత్రికి తరలిస్తున్నాం. తద్వారా వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందించి తల్లి, బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రసవానికి అవకాశం ఉంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శిక్షణ పూర్తయింది గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ చేయడానికి వీలుగా ప్రొసీజర్లను ఆన్లైన్లో పొందుపరిచాం. ఏ విధంగా ఆన్లైన్లో నమోదు చేయాలనే విషయంపై నెట్వర్క్ ఆస్పత్రుల మెడికోలు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా ఇచ్చింది. అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిలో వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది. నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్‌లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్లైన్లో షేర్‌చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ని చూస్తూ.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది. మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ సమర్పించింది. (చదవండి: మిస్టరీగా కొత్త వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో ముగ్గురు మృతి!) -
జట్టీ కట్టి.. 5 కి.మీ. మోసుకొచ్చి..
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి. మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..
రష్యాలో గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వెళ్లిపోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా మంది గర్భిణీ మహిళలు తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వారంతా అర్జెంటీనా పౌరసత్వం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించాలని భావిస్తున్నారట. అదీకూడా ఈ యుద్ధ సమయంలోనే సుమారు 5 వేల మంది దాక రష్యన్ గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వచ్చారని, వారంతా అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనాకు వస్తున్న రష్యా మహిళల సంఖ్య పెరిగిందని కూడా చెప్పారు. కేవలం ఒక్క గురువారం సుమారు 33 మంది మహిళలు అర్జెంటీనాకు వచ్చినట్లు తెలిపారు. ఐతే వారిలో ముగ్గురు వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత రష్యన్ మహిళలు తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వస్తున్నాం అని చెబుతున్నట్లు సమాచారం. అర్జెంటీనా రష్యా కంటే ఎక్కువ స్వేచ్ఛగా ఉండటంతో మాస్కో మహిళలంతా తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలిని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, కానీ రష్యా వీసా కలిగి ఉంటే కేవలం 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అర్జెంటీనా పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు మహిళల తరుఫు న్యాయవాది తప్పుడు పర్యాటకులు అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అదీగాక ఒక రష్యాన్ వెబ్సైట్ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకుంటే తల్లులకు వివిధ ప్యాకేజీలు అందిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు పేర్కొన్నారు. ఇదోక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్సైట్ రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలో స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
కదులుతోన్న రైలులో గర్భిణి ప్రసవం
విజయనగరం టౌన్: బిహార్ రాష్ట్రం ఆనందపూర్‌కి చెందిన బిందుకుమారి అనే గర్భిణి ‘అలెప్పీ–ధనబాద్ రైలు (13352)లో కేరళ నుంచి ధనబాద్‌కు పుట్టింటికి వెళ్తోంది. విశాఖ దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికుల సాయంతో కదులుతోన్న రైలులోనే విజయనగరం సమీపంలో వాష్ రూంలో మగబిడ్డను ప్రసవించింది. విజయనగరం రైల్వే స్టేషన్లో మెడికల్, ఆర్పీఎఫ్, కమర్షియల్, ఆపరేటింగ్ ఉద్యోగులు, సిబ్బంది జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమె వద్దకు చేరుకున్నారు. రైల్వే వైద్యురాలు జ్యోతిప్రియ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కేఎస్ రత్నం, హెచ్‌సీ వి.అరుణ, కానిస్టేబుల్ ఎ.నాయుడు, సీటీఐ రెడ్డి, అప్పలరాజు, టీపీ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
Telangana: గర్భిణీ పోలీసు అభ్యర్థులకు గుడ్‌న్యూస్! నేరుగా మెయిన్స్‌కు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో గర్భవతులు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా నేరుగా తుది రాత పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే వారంతా తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొని అర్హత సాధిస్తామంటూ.. టీఎస్ఎల్పీఆర్బీకి రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు. అండర్‌టేకింగ్ ఇవ్వని వారిని తుది పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు పూర్తైన వెంటనే తుది రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వెంటనే తుది రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, మరో 8 నుంచి 9 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. పెరిగిన ‘అర్హత’శాతం: ఫిజికల్ ఈవెంట్స్‌లో ఇప్పటివరకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో 54 శాతం మంది వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్టు బోర్డు పేర్కొంది. గత రిక్రూట్మెంట్ సందర్భంగా నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్‌లో 52 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. గతంతో పోలిస్తే ఫిజికల్ ఈవెంట్స్‌ను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని శ్రీనివాసరావు తెలిపారు. గతంలో పురుషులకు ఐదు ఫిజికల్ ఈవెంట్స్, మహిళలకు మూడు ఉండగా..ఈసారి అందరికీ మూడు (రన్నింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్)మాత్రమే ఉన్నాయి. గతంలో పురుషులకు ఛాతీ కొలతలను సైతం తీసేవారు. ఈసారి కేవలం ఎత్తు కొలత డిజిటల్ మీటర్ల ద్వారా తీస్తున్నారు. 70% మందికి పరీక్షలు పూర్తి ఈ నెల 8 నుంచి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గత 18 పనిదినాల్లో 70 శాతం మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఈవెంట్స్ పూర్తి కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్ల గొండ, సిద్దిపేటల్లో ఇంకా కొనసాగుతోంది. -
సురక్షిత మాతృత్వం.. ఖర్చు లేని కాన్పు
మాతృత్వం అనేది ఓ వరం. ప్రసవ ఘట్టం మహిళకు పునర్జన్మ వంటింది. దీనిని కొందరు స్వార్థపరులు తమ సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సురక్షిత మాతృత్వాన్ని ఉచితంగా ప్రసాదించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకు అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచింది. ప్రధానంగా ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలపై ప్రధాన దృష్టి సారించింది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని వైద్యశాలలు, ఏరియా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించడంతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి నమ్మకం ఏర్పడింది. గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డాక్టర్లు లేక మందుల కొరతతో ప్రజలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించారు. తాజాగా పరిస్థితి మారింది. నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం ఏర్పడింది. జిల్లాలో మొత్తం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 12 వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో మార్కాపురంలో జిల్లా వైద్యశాల, ఒంగోలులో మాతాశిశు వైద్యశాల ఉన్నాయి. కనిగిరి, దర్శి, పొదిలి, చీమకుర్తి, పామూరు, దోర్నాల, కంభం, కొండపి ఉండగా గిద్దలూరు, యర్రగొండపాలెంలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 9 కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఇవన్నీ వైద్య విధాన పరిషత్ కో ఆర్డినేటర్ పరిధిలో ఉండగా, డీఎంహెచ్ఓ పరిధిలో 64 పీహెచ్‌సీలు ఉన్నాయి. జిల్లాలో బేస్తవారిపేటలో అత్యధికంగా నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో కాన్పులు చేస్తున్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు రావడంతో ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్యశాలలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు సర్జన్లతో పాటు అనస్థీషియన్ (మత్తు డాక్టరు), నిపుణులైన నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. నెలకు సుమారు 180 నుంచి 200 మ«ధ్య కాన్పులు జరుగుతున్నాయి. ఆధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం, బ్లడ్ బ్యాంక్, ఐసీయూ బెడ్లు, అందుబాటులో ఉండడంతో సమీప మండలాల్లోని గ్రామాల గర్భిణులు కాన్పుల నిమిత్తం జిల్లా వైద్యశాలలకు వస్తున్నారు. మొత్తంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 2,500 వరకు ప్రసవాలు జరిగాయి. ప్రోత్సాహకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్నిస్తోంది. పీహెచ్‌సీల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద రూ.4 వేలు, జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి ఇస్తోంది. మొత్తంగా రూ.ఐదు వేలు ఇస్తుండగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే రూ.4600 ఇస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తోంది. సురక్షితంగా ఇంటికి... ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ప్రసవం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతాశిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. మంచి వైద్య సేవలు అందాయి కాన్పు కోసం జిల్లా వైద్యశాలకు వచ్చాను. డాక్టర్లు, నర్స్‌లు మంచి వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు చేశారు. పాప పుట్టింది. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. మంచి మందులు ఇచ్చారు. డాక్టర్లకు ధన్యవాదాలు. – నాగలక్ష్మి, రాగసముద్రం, తర్లుపాడు మండలం మంచి సేవలందిస్తున్నాం జిల్లా వైద్యశాలలో గైనకాలజిస్టులు, సర్జన్లు, మంచి సేవా భావం కలిగిన వైద్య సిబ్బంది ఉన్నారు. నార్మల్ డెలివరీలు చేస్తారు. తక్షణ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. హైరిస్క్ పేషెంట్లకు కూడా మా డాక్టర్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రోగులకు భరోసా ఇస్తాం. మందుల కొరత లేదు. – డాక్టర్ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం -
తల్లికి ‘సంపూర్ణ’ పోషణ.. ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 పోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం
కళ్యాణదుర్గం (అనంతపురం): తల్లి గర్భం నుంచే శిశువు ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా సాధారణ బియ్యానికి అదనంగా ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు జోడించి ఇవ్వడం వల్ల శిశువు, ఎదిగే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యాధులతో పోరాడేందుకు తగిన శక్తినిచ్చే పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాల అందిస్తోంది. ప్రతి నెలా క్రమం తప్పని పోషకాలు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం, 1 కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలను వైఎస్ జగన్ సర్కార్ అందజేస్తోంది. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 2 కిలోల ఫోర్టిపైడ్ బియ్యం, అర కేజీ కందిపప్పు, 150 మి.మీల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతి నెలా అంగన్వాడీ కార్యకర్త నేరుగా లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. (చదవండి: బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!) పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. బియ్యంలో ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. సూక్ష్మ పోషకాల స్థాయిని మరింత పెంచేందుకు ఆ బియాన్ని పొడి చేసి ఆ పొడిలో ఐరన్, ఫొలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 వంటి ఖనిజాలు అదనంగా చేర్చి మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్థకమైన బియ్యం) అని పిలుస్తారు. చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కీలకమైన సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధికమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు అనుగుణంగా.. ఫోర్టిఫైడ్ బియ్యం రంగు, రుచి, రూపంలో సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం రక్తహీనతను అధిగమించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జింక్, విటమిన్ ఏ, విటమిన్ బీ 12, ఫొలిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందజేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసుల మేరకు జగన్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. (చదవండి: అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు) రక్తహీనతను తగ్గిస్తుంది ఫోర్టిపైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చిన్నారులకు సంపూర్ణ పోషకాలను అందజేసినట్లవుతుంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ బియ్యాన్ని డ్రై రేషన్ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నాం. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గర్భిణుల్లో పౌష్టికలోపాల్ని తగ్గించి ఆరోగ్యవ ంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందుబాటులో కి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకు ని బతుకమ్మ కానుకగా ఈ కిట్లను లబ్ధిదా రులకు అందిస్తున్నట్లు తెలిపారు. శనివారం కోఠిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రో గ్రాం మేనేజ్మెంట్ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్తహీనత అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కా మారెడ్డి, కుమ్రుంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామన్నా రు. తొలుత 1.5లక్షల మందికి ఈ కిట్లు అందజేస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు కిట్లు.. ఒక్కో కిట్ ధర రూ.2వేల వరకు ఉంటుందని, ఇందులో నెయ్యి, ఖజూర్, హార్లిక్స్ తదితర పౌష్టిక పదార్థాలుంటాయని మంత్రి హరీశ్ తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్లు ఇస్తామని, గర్భం దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెల్లకోసారి ఈ కిట్ లబ్ధిదారుకు అందుతుందన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో మందులను మూడు నెలల ముందస్తు కోటాగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఇందులోభాగంగా ఈ–ఔషధీ, వైద్య పరిక రాల నిర్వహణకు ఈ–ఉపకరణ్ పోర్టళ్లను మంత్రి ఆవిష్కరించారు. మందుల కొనుగో లుకు సీఎం కేసీఆర్ రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించారని, ఇందులో రూ.100 కోట్లను ఆస్పత్రుల సూపరింటెండెంట్ల దగ్గర అందుబాటులో ఉంచామని వివరించారు. -
అమ్మకు పోషకాల కానుక..
సాక్షి, హైదరాబాద్: గర్భిణీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్‌ను అందజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కిట్‌లో సమకూర్చే పోషకాహార పదార్థాలను అందజేసే ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు ఖరారయ్యాక న్యూ ట్రీషన్ కిట్లను మహిళలకు పంపిణీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్ మిక్స్ పౌడర్ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక అల్బెండజోల్ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్ ఇవ్వాలా లేక కేసీఆర్ కిట్ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్‌ను కూడా తెప్పించి పరిశీలించారు. ముందుగా తొమ్మిది జిల్లాల్లో అమలు.. కేసీఆర్ కిట్ లాగానే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ వర్గాలు తెలిపాయి. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా జూన్ 2, 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందారు. ఈ పథకం అమలుకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. -
సురక్షితంగా.. సౌకర్యవంతంగా...
గత నెల ఒకటో తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్‌కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కి.మీ మేర ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో బాలింత అమీనా ఆమె బిడ్డను వైద్యశాఖ క్షేమంగా ఇంటికి తరలించింది. సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల రూపంలో అండగా నిలుస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మెరుగు పరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించింది. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది. రోజుకు 700 మంది.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలే అందుబాటులో ఉండేవి. డిశ్చార్జ్ సమయంలో బాలింతలకు వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో సేవలను విస్తరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మంది బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,252 మంది బాలింతలు ఈ సేవలను వినియోగించుకున్నారు. తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటోంది. ఫిర్యాదుల స్వీకారం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను వైద్య శాఖ స్వీకరిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత నెల నుంచి ఫిర్యాదుల స్వీకారం ప్రారంభించగా..ఇప్పటికి 18 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని సకాలంలో వైద్య శాఖ పరిష్కరించింది. కాగా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో వచ్చిన మార్పులు ఇలా ఏప్రిల్‌కు ముందు వరకు.. ► 279 వాహనాలు ► ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం ► ఏసీ సౌకర్యం ఉండదు ► ట్రిప్‌కు ఇద్దరు బాలింతల తరలింపు ఏప్రిల్ నెల నుంచి.. ► 500 వాహనాలు ► విశాలమైన మారుతీ ఈకో వాహనం ► ఏసీ సౌకర్యం ఉంటుంది ► ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తొమ్మిదో తేదీ కేజీహెచ్‌లో ప్రసవించాను.ఆస్పత్రి నుంచి మా గ్రామం 200 కి.మీ దూరం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి చేర్చారు. – సి.గంగోత్రి, గుమ్మలక్ష్మిపురం, విజయనగరం జిల్లా -
గర్భిణులకు ముందస్తు వైద్య సేవలు
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ ముందస్తు జాగ్రత్తగా వినూత్న నిర్ణయం తీసుకుంది. నిండు గర్భిణులు వానల, వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ప్రసవానికి ఇంకా వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలిస్తోంది. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపుగా 10వేల మంది గర్భిణులను తరలించి ముందస్తు సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రత్యేక వాహనం తో పాటు అన్నీ సిద్ధం చేసినట్టు కూ యాప్ వేదికగా వివరాలు వెల్లడించారు. Koo App గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. View attached media content - TRS Party (@trspartyonline) 14 July 2022 -
బర్త్ కంపానియన్.. భర్త సమక్షంలో పురుడు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం పెద్దాస్పత్రిలో ఓ గర్భిణీకి భర్త సమక్షంలో ‘బర్త్ కంపానియన్’విధానంలో కాన్పు చేశారు వైద్యులు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో హెచ్‌వోడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి, గాయత్రి, స్టాఫ్‌నర్స్ అరుణ నూతన విధానంలో శ్రీలత(23) అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ సమయంలో ఆమె భర్తను లేబర్‌రూం లోనికి పిలిపించారు. ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో గర్భిణీలో భయం, ఒత్తిడి, ఆందోళన ఉంటుందని, ఆ కారణంగా నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదని వైద్యసిబ్బంది తెలిపారు. అందుకే భర్తగానీ, మనసుకు దగ్గరైనవారుగానీ ఆమె చెయ్యి పట్టుకోవడం, తల నిమరడం వంటివి చేయడం ద్వారా ఆక్సిటోసిన్ త్వరగా విడుదలై నొప్పులు ఎక్కువగా వచ్చి త్వరగా సుఖప్రసవం అవుతుందని వివరించారు. ఈ విధానంలో శిశువు బొడ్డుతాడును తండ్రితో కత్తిరించడం ద్వారా అతడు గొప్ప అనుభూతిని పొందడమే కాకుండా భార్య ప్రసవవేదనను దగ్గరుండి చూస్తే, ఆమెపై మరింత గౌరవం పెరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాన్పుగదిలోకి గర్భిణులు తమ భర్త, అమ్మ, అత్త, చెల్లి.. ఇలా ఇష్టమైనవారిలో ఒకరిని అనుమతిస్తామని చెబుతున్నారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉండగా, మనదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఆచరిస్తున్నారు. -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్‌కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
వైద్యులూ.. వెల్డన్
కోల్‌సిటీ(రామగుండం)/ఆసిఫాబాద్ అర్బన్: కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు కాన్పులు చేసి విధి నిర్వహణపట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన గోదావరిఖని, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందించారు. మంథని మండలం వెంకటాపూర్, అంతర్గాం మండలం మర్రిపల్లికి చెందిన ఇద్దరు గర్భిణులకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకరి తర్వాత మరొకరికి వైద్యులు కాన్పులు చేశారు. రిస్క్ కేస్ అయినప్పటికీ గైనకాలజిస్టు డాక్టర్ కల్యాణి, అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, స్టాఫ్‌నర్స్ రుద్రమ పీపీఈ కిట్లు ధరించి ఆ గర్భిణులకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ చేశారు. ఇద్దరికీ ఆడశిశువులే జన్మించారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన జాడి సింధూజకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా సిబ్బంది అంబులెన్‌లో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో సూపరింటెండెంట్ స్వామి సూచనల మేరకు డాక్టర్ నవీద్, స్టాఫ్ నర్సులు ప్రీత, సుదీవన పీపీ కిట్లు ధరించి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు చేశారు. సుఖ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లా ఆస్పత్రికి వెళ్లినా అంతే..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లికి చెందిన గర్భిణికి కాళ్లు, ఒంటినొప్పులు ఎక్కువగా ఉండటంతో గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో గర్భిణికి పీపీఈ కిట్ వేసి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన గర్భిణులకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో సహా ఎక్కడికక్కడే కాన్పులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. ఈనెల 25న అచ్చంపేట ఆస్పత్రిలో ఘటన నేపథ్యంలో.. జిల్లా ఆస్పత్రి నుంచి గర్భిణి తరలింపు విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం వివరణ కోరగా.. ఆస్పత్రి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌తో పాటు రక్తం తక్కువగా ఉండటంతో హైరిస్కు కేసుగా భావించి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి సురక్షితంగా తరలించామని చెప్పారు. -
గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!
మహిళకు తల్లి కావడం ఓ పెద్ద వరం అంటారు. ప్రెగ్నెన్సీతో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ తల్లి అయిన ప్రతి స్త్రీ తన గర్భధారణను ఆనందిస్తుంది. కానీ అందరు స్త్రీలు అదృష్టవంతులు కాదు. ప్రపంచంలోని చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక తాజాగా ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు. సదరు మహిళ కాలేయంలో ఎక్టోపిక్ గర్భం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫెలోపియన్ ట్యూబ్లలో గుడ్డు తప్పు దిశలో ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. దీని కారణంగా గర్భం సరిగ్గా జరగదు. ఇది కడుపులో చాలాసార్లు కనిపిస్తుంది, కానీ మొదటిసారిగా ఇది కాలేయంలో కనిపించింది. అది గమనించిన వైద్యులు వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేయగా తన ప్రాణం రక్షించబడింది. కానీ పిండం మాత్రం అప్పటికే కాలేయంలో చనిపోయింది. అటువంటి పరిస్థితిలో వైద్యులు కాలేయం నుండి చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు. కెనడియన్ శిశు వైద్యుడు డాక్టర్ మైఖేల్ తన టిక్‌టాక్ ఖాతాలో వీడియో ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. ఇక ఇలాంటి సంఘటనే 2012లో ఓ మహిళ కాలేయంలో 18 వారాల పిండం కనిపించింది. దీంతో తనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స సమయంలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. -
ఆపరేషన్ తారుమారు.. మాకే ఎందుకు కడుపు‘కోత’?
సాక్షి, వీణవంక(కరీంనగర్): తమ కుటుంబంలోకి కవల పిల్లలు రాబోతున్నారని తెలిసి, ఇంటిల్లిపాది ఆనందపడ్డారు.. కుటుంబసభ్యులు ఆ గర్భిణికి పౌష్టికాహారం అందిస్తూ కంటికిరెప్పలా చూసుకున్నారు.. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9 నెలల తర్వాత జరగాల్సిన ఆపరేషన్ 7వ నెలలో జరగడంతో పాప మృతిచెందింది.. బాబు అతి తక్కువ బరువుతో పుట్టి, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడు.. దీంతో బాధిత కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు కడుపుకోత మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారిని ‘సాక్షి’ పలకరించగా కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాలిలా ఉన్నాయి.. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తంరెడ్డి–మాలతిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. మాలతి గర్భం దాల్చడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. తర్వాత స్కానింగ్‌లో కవల పిల్ల లు అని వైద్యులు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమెకు ఆహారం మొదలు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో మాలతికి 7వ నెలలో జూన్ 16న కడుపునొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు 21 వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. చదవండి: టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు: ఈటల రాజేందర్ అదేరోజు మరో గర్భిణికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంతో మాలతి పొట్ట కోశారు. బాధితురాలు తాను ఆపరేషన్ కోసం రాలేదని మొత్తుకుంది. దీంతో అలర్ట్ అయిన వైద్యులు కేస్‌షీట్లు పరిశీలించారు. వేరొకరికి చేయాల్సిన ఆపరేషన్ ఈమెకు చేశామని తెలుసుకొని వెంటనే కుట్లు వేసి, తమ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు జూన్ 25న డీఎంహెచ్‌వోకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం మాలతి పరిస్థితి విషమంగా ఉండటంతో అదే నెల 26న ఆపరేషన్ చేయగా పాప మృతిచెందింది. బాబు కేవలం 1,300 గ్రాముల బరువుతో పుట్టాడు. కలెక్టర్‌కు ఫిర్యాదుతో విచారణ మాలతికి ఆపరేషన్ తారుమారు ఘటనపై వైద్యాధికారులు స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసి, చేతులు దులుపుకున్నారు. అయితే తగిన న్యాయం జరగకపోవడంతో బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కానీ విచారణ చేపడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మాలతి భర్త నరోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పుడు బాబుకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. కానీ వైద్యాధికారులు ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారికి అనారోగ్య సమస్యలు కవలల్లో ఒకరు మృతి చెందగా బాబు పుట్టినప్పటి నుంచి రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని బాధిత కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మాలతి కుటుంబానికి కడుపుకోత మిగిలిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో మహిళకు జరగకూడదు వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాప చనిపోయింది. పుట్టిన బాబు ఆరోగ్యంగా లేడు. అధికారులు నీలోఫర్‌లో చూపిస్తామని చెప్పారు. ఇంతవరకు చూపించలేదు. మాతా శిశు కేంద్రంలో మంగళవారం విచారణ జరిపారని తెలిసింది. మాకు సమాచారం లేదు. నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదు. – మాలతి, బాధితురాలు