
అపర్ణను పుట్టపర్తి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొత్తచెరువు వద్ద వాహనంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
కొత్తచెరువు/తనకల్లు: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఇరువురు గర్భిణిలు 108 వాహనాల్లోనే ప్రసవించారు. కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన గర్భిణి అపర్ణకు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో 108కి ఫోన్ చేయగా వెంటనే వచ్చింది. అపర్ణను పుట్టపర్తి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొత్తచెరువు వద్ద వాహనంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
అదేవిధంగా తనకల్లు మండల పరిధిలోని బాబేనాయక్‌తండాకు చెందిన రోజా శుక్రవారం 108 వాహనంలో పండంటి పాపకు జన్మనిచ్చింది. రోజాకు ఉదయం పురిటినొప్పులు అధికం కావడంతో కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టంగా మారే అవకాశం ఉందని వెంటనే అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో తరలిస్తుండగా బత్తలపల్లి సమీపంలోకి రాగానే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 ఈఎంటీ మౌలాలి, పైలెట్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.