Anantapur District
-
ఊరంతా దుస్తులే!
పామిడి: రాయలసీమ జిల్లాల్లోనే నాణ్యమైన వస్త్రాలకు ఖ్యాతి గాంచింది అనంతపురం జిల్లా పామిడి. 65 వేల మంది జనాభా ఉన్న పామిడిలో 85 శాతం మంది వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వీధికెళ్లినా వస్త్ర దుకాణాలే కనిపిస్తాయి. కేవలం టెక్స్టైల్లోనే కాకుండా రెడీమేడ్ దుస్తుల తయారీలోనూ రెండో ముంబయిగా ఖ్యాతిగాంచింది. గ్రామం ఆవిర్భావం నుంచే... శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన పామిడి గ్రామానికి పెద్ద చరిత్రనే ఉంది. పూర్వం పరుశురాముడి స్వైరవిహారం నుంచి తప్పించుకుని కుటుంబాలతో వలస వచ్చిన క్షత్రియులు పామిడి పెన్నానది ఒడ్డున సింగిరప్ప కొండపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం ప్రస్తుతమున్న గ్రామానికి తమ మకాం మార్చి జీవనోపాధి కింద దుస్తులకు రంగుల అద్దకం పనిని చేపట్టారు.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ పామిడిలో కుటీర పరిశ్రమగా రంగుల అద్దకం పని కొనసాగింది. ఈ నైపుణ్యం వారిని రాయల్ టైలర్స్గా, డ్రెస్ డిజైనర్లుగా ఎదగడానికి దోహదపడింది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస రావడంతో వీరిని భావసార క్షత్రియులుగా పిలిచేవారు. రెడీమేడ్కు పెట్టింది పేరు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం వరకూ పామిడి వాసులు ర్యాగ్స్ (ఒక సెం.మీ. వెడల్పు ఉన్న వస్త్రం)తో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్‌లు కుట్టి అతి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలో పరిశ్రమల నుంచి బేళ్ల కొద్దీ సరుకును దిగుమతి చేసుకునేవారు. చేతి నిండా పని దొరకడంతో ప్రతి ఇంట్లోనూ రెండు, మూడు కుట్టుమిషన్లపై ఉదయం నుంచి రాత్రి వరకూ డ్రెస్‌లు కుట్టేవారు. ప్రస్తుతం నైటీలు, నైట్ ప్యాంట్లను కుడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను కరువు రక్కసి పీడించిన రోజుల్లోనూ పామిడిలో ఉపాధికి ఢోకా ఉండేది కాదు. తర్వాతి కాలంలో మిల్లుల నుంచి కట్పీస్లు తెప్పించి కిలోల లెక్కన అమ్మడం మొదలు పెట్టారు. వీటితోనే ప్రస్తుతం నైట్ ప్యాంట్లు తయారవుతున్నాయి. జైపూర్ కాటన్‌తో నైటీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. నైటీలకు సంబంధించి 70కి పైగా, నైట్ ప్యాంట్లకు సంబంధించి 50 దాకా కుటీర పరిశ్రమలు ఇక్కడ వెలిశాయి. అన్ని కులాలకు చెందిన వారు ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యత ఎక్కువ వస్త్ర వ్యాపారంలో పామిడి వాసుల ప్రత్యేకతే వేరు. కేవలం వస్త్ర వ్యాపారం సాగించే వీధినే ప్రత్యేకంగా ఉంది. ఈ వీధిలో 130కు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఏ వస్త్రం నాణ్యత ఏపాటిదో కంటితో చూస్తే చెప్పే నైపుణ్యం ఇక్కడి వారి సొంతం. వస్త్ర పరిశ్రమలు విస్తారంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర నుంచి తమకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తూ వచ్చారు. నేరుగా పరిశ్రమల నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో వినియోగదారులకు చాలా తక్కువ ధరకే లభ్యమయ్యేవి. నాణ్యమైన వస్త్రాలను మాత్రమే విక్రయిస్తూ పామిడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఇక్కడి వస్త్రాలు కొనుగోలు చేసి ధరిస్తే ఏళ్ల తరబడి రంగు వెలిసిపోవని వినియోగదారుల నమ్మకం. దీంతో మూడు దశాబ్దాల వరకూ రాయలసీమ జిల్లాల్లో ఎవరింట శుభకార్యం జరిగినా పామిడికి చేరుకుని వస్త్రాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో పామిడి వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. మన్నిక భేష్ పామిడి వ్రస్తాల మన్నిక చాలా బాగుంటుంది. ధర కూడా తక్కువే. ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పనిసరిగా పామిడికి వస్తుంటారు. ఇక ఇళ్ల వద్ద చీరలు, ఇతర వస్త్రాలు విక్రయించాలనుకునే మహిళలు సైతం పామిడిలోనే కొనుగోలు చేస్తుండడం విశేషం. – డి.హొన్నూరుసాహెబ్, కల్లూరు నాణ్యతగా ఉంటాయిమా గ్రామం గొప్పతనం చెప్పడం కాదు కానీ, ఇక్కడ ఒక్కసారి వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు కావాలంటే పామిడికే వెళ్లాలని చెబుతుంటారు. ప్రస్తుతమున్న ధర ప్రకారం ఇతర ప్రాంతాల్లో రూ.900 చెల్లించి కొనుగోలు చేసిన ఓ ప్యాంట్ పీస్ నాణ్యతకు అదే ధరతో పామిడిలో కొనుగోలు చేసే ప్యాంట్ పీస్ నాణ్యతకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసిన వస్త్రాలు చాలా కాలం పాటు మన్నిక వస్తాయి. రంగు వెలిసిపోదు. దీంతో నాణ్యత కావాలనుకునే వారు పామిడికే వచ్చి వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. – పి.శివకుమార్, పామిడి -
అనంతపురం జిల్లా వెంకటాపురంలో టీడీపీ నేతల బరితెగింపు
-
టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నాయకుడి ప్రహారీ గోడ కూల్చివేత
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అనంతరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ప్రవారీ గోడను పట్టపగలే ధ్వంసం చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.అయితే, ఈ భూ వివాదంపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి టీడీపీ నేతలు ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. ఇక, ఇదంతా జరుగుతున్నా ఘటనా స్థలంలోనే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. దీంతో, పోలీసుల తీరు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కోమటికుంట్లలో హైటెన్షన్.. పెద్దారెడ్డిపై దాడులకు టీడీపీ స్కెచ్
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేతలతో జేసీ ప్లాన్ చేయించారు. కోమటికుంట్ల గ్రామానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. జేసీ వర్గీయుల అరాచకాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
అనంతపురం: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త హత్య చేశాడు. బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో ఘటన జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తి శెట్టి (50) పై వేటకొడళ్లతో దాడి చేశాడు.స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి చెల్లెలు పుష్పావతితో కలిసి ఉండేవాడు. రాత్రి ఆయన ఇంట్లో చెల్లెలితో కలిసి భోజనం చేస్తుండగా టీడీపీ కార్యకర్త వేటకొడవలితో చెయ్యి, వీపు, తలపై దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించి చెల్లెలు భయంతో బయటకు వచ్చి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.కొన ఊపిరితో ఉన్న క్రిష్ణమూర్తి శెట్టిని 108లో బళ్లారి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని కురువల్లికి చెందిన ఓ వ్యక్తితో భూమి తగాదాలతోనే ఈ హత్యాయత్నం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్‌ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
‘ఉమ్మడి అనంత’లో కుంభవృష్టి
అనంతపురం అగ్రికల్చర్/పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వాన జోరు మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో పలు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా నాలుగైదు గంటలపాటు భారీ వర్షం కురవడంతో చాలా మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతానికి వరద పోటెత్తడంతో దాదాపు 70 గొర్రెలు కొట్టుకుపోయాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చిత్రావతి, వంగపేరు, కుషావతి, జయమంగళి నదులతోపాటు పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు వందలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట మొత్తం నేలమట్టమయ్యింది. రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు రైతు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ., కంబదూరులో 65.4 మి.మీ., ఆత్మకూరులో 60 మి.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. కాగా.. రానున్న రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పండమేరు ఉగ్రరూపం... నీట మునిగిన పలు కాలనీలు ఎగువన భారీ వర్షాలు కురవడంతోపాటు కనగానపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో పండమేరు ఉధృతంగా ప్రవహించింది. పండమేరు వెంబడి ఉన్న అనంతపురం నగర శివారులోని గురుదాస్ కాలనీ, ఆటో కాలనీ, వనమిత్ర పార్క్ వెనుక కాలనీలు, రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, బృందావన కాలనీ, పరిటాల సునీతమ్మ కాలనీ, దండోరా కాలనీ, రాజరాజేశ్వరి కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదపై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. -
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
రామ రామ.. ఏమిటీ డ్రామా!
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అన్ని వేళ్లూ వారి వైపే.. హనకనహాళ్ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, అతను వైఎస్సార్సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్: ఎస్పీ జగదీష్అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హనకనహాళ్లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవేశించి.. రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధారాల సేకరించామని చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారన్నారు. దీంతో గ్రామస్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశంపై విచారిస్తామన్నారు. -
రామ రామ.. రథానికి నిప్పు
సాక్షి టాస్‌్కఫోర్స్: గుళ్లు, రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు.. గిట్టని వారిపై ఆ నింద వేస్తారు. వాళ్లే అపచారాలు చేస్తారు.. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తారు. ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంటగలుపుతారు.. ఎదుటి పక్షం వారికి నేరం అంటగడతారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది. నాటి గోదావరి పుష్కరాలు మొదలు.. నేటి తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాషీ్టకాలివి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేసి, ప్రజల్లో చులకనవుతున్న టీడీపీ పెద్దలను.. ఆ వివాదం నుంచి గట్టెక్కించడానికి ఆ పార్టీ నేతలు మరో ఘాతుకానికి తెరలేపారు.'ఇందుకు అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ రామాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. సుమారు మూడున్నర వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఏటా శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల వారిని ఊరేగించే రథానికి నిప్పు పెట్టించారు. ఈ నెపాన్ని ప్రత్యర్థులపై వేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలని విఫలయత్నం చేసినా, ఈ దుర్మార్గానికి పాల్పడింది టీడీపీ వారేనని గ్రామమంతా కోడై కూస్తుండటంతో తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.స్థానికుల కథనం మేరకు.. హనకనహళ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి, శ్రీరామాలయాలు ఊరి నడి»ొడ్డున పక్కపక్కనే ఉన్నాయి. ఈ ఊళ్లో ప్రజలు శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు సీతారాముల వారిని రథంపై ఊరేగిస్తారు. అనంతరం రథాన్ని ఆలయం పక్కనే ఉన్న షెడ్డులో ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు షెడ్డు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. రథంపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఎదురింటిలో ఉండే అనసూయమ్మ అదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు రావడంతో రథమున్న షెడ్లో నుంచి మంటలు రావడం గమనించింది. వెంటనే ఆమె.. తన మామ ఎర్రిస్వామికి విషయం చెప్పింది. ఆయన ఇరుగు పొరుగు వారిని నిద్ర లేపి మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం రథం కాలిపోయింది. అలజడి రేగడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలంతా ఆలయం వద్దకు తరలివచ్చారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఘటన స్థలానికి చేరుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పలువురు పోలీసు, దేవదాయ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, దుండగులిద్దరూ టీడీపీకి చెందిన వారని, ఉద్దేశ పూర్వకంగానే రథానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. ముమ్మాటికీ ఇది టీడీపీ పనే.. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరే కీలకమని భావిస్తున్నారు. అయితే వీరిద్దరినే అదుపులోకి తీసుకుంటే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని, మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా చూపుతూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో టీడీపీ వారిని తప్పించి అమాయకులను బలి చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరితో ఈ దుర్మార్గ పని చేయించిన వారెవరో కూడా స్పష్టం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాములోరి రథం దగ్ధం ఘటనలో బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. మంగళవారం ఉదయం వారు సంఘటన స్థలాన్ని సందర్శించి.. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, ఆర్డీఓ రాణీసుస్మితను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆలయాల వద్ద, ఆలయాల పరిసర ప్రాంతాల్లో రథాలున్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.సమగ్రంగా దర్యాప్తు చేయండి: సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్‌లో రాములోరి రథం దగ్ధం కావడంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు సీఎం సూచించారు. -
హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులకు రెండు జీవితకాల కఠిన కారాగార శిక్షలు (ఏకకాలంలో అమలవుతుంది) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి, అతని కుమారుడు భానుప్రకాష్‌రెడ్డి 2018, మార్చి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్‌పై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా, వారి గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్) అడ్డుకునేందుకు ప్రయత్నించారు.బైక్ నడుపుతున్న భానుప్రకాష్‌రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్లగా, బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్‌రెడ్డి, శివారెడ్డి కిందపడిపోయారు. బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్), సూర్యనారా యణ వేటకొడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్‌రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముళ్లు భాస్కర్, విజయ్, కుమారుడు (మైనర్) వేటకొడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకా ష్‌రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోనే పొలంలో ఉన్న అతని చిన్నాన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్‌రెడ్డి రావడంతో బాలకృష్ణ, అతని తమ్ముళ్లు, బంధువులు పారిపోయారు.తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. భానుప్రకాష్‌రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో బోయ సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్‌కుమార్, తలా రి సూర్యనారాయణ, మహేంద్రలకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష (ఏకకాలంలో అమలు) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్‌కుమార్‌లకు రూ.35వేలు చొప్పున, మిగిలిన ఐదుగురికి రూ.30 వేలు చొప్పున జరిమానా విధించారు. ఇద్ద రు మైనర్లపై జువైనల్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడినవారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఆరుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం. -
అనంతపురం : ఆకాశంలో అద్భుతం (ఫొటోలు)
-
అనంతపురం : దులీప్ ట్రోఫీ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం గ్యాలరీ (ఫొటోలు)
-
అనంతపురం జిల్లాలో సందడిగా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
అనంతపురంలో వినాయక నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
మరో టీడీపీ కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
సాక్షి, అనంతపురం జిల్లా: అధికారాన్ని అడ్డం పెట్టకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో టీడీపీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపులు బయటపడ్డాయి. ఉపాధి హామీ మహిళా కూలీలకు డబ్బుతో ఎర వేస్తున్న టీడీపీ నేత లైంగిక వేధింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.3 లక్షలు లోన్ ఇప్పిస్తా.. బయటకు రావడానికి వీలు అవుతుందా?. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. తన కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్ నాయుడు వేధింపులకు గురిచేశాడు. టీడీపీ నేతపై పోలీసులకు బాధితతురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా క్రీడాకారులు సాధన (ఫొటోలు)
-
మహిళలపై టీడీపీ నేత వేధింపులు
శింగనమల: అతనో టీడీపీ చోటా నేత. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా అనధికారికంగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మహిళా కూలీలపై కన్నేశాడు. తన పక్క మీదకు వస్తేనే బిల్లులు చేస్తానంటూ వేధించసాగాడు. చివరకు అర్ధరాత్రి.. అపరాత్రి అని కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యకర సంభాషణలు కొనసాగిస్తుండడంతో విసుగు చెందిన మహిళలు తమను కాపాడాలంటూ నేరుగా ఎస్పీని ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ను తప్పించి ఆ స్థానానికి తన పేరును టీడీపీ నాయకుడు శ్రీనివాసులు నాయుడు ప్రతిపాదించుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఆయనకు అందలేదు. అయినా ‘ప్రభుత్వం మాది, అంతా మేము చెప్పినట్లే నడుచుకోవాలి’ అనే ధోరణితో ఫీల్డ్ అసిస్టెంట్ తానేనంటూ చలామణి అవుతున్నాడు. తరచూ ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి మహిళా కూలీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.కొంత మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి రాత్రి సమయంలో ఫోన్లు చేస్తూ అసభ్యకర సంభాషణ సాగించాడు. తన పక్కమీదకు వస్తేనే బిల్లులు చేస్తానని, లేకపోతే ఎవరొచ్చి చెప్పినా వినేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విసుగు చెందిన మహిళలు వారం కిందట శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు.. శ్రీనివాసులు నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మిన్నుకుండి పోయారు. ఈ క్రమంలో అతని వేధింపులు తారస్థాయికి చేరాయి. దీంతో బాధితులు పలువురు సోమవారం అనంతపురంలో జిల్లా ఎస్పీ జగదీష్ ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఫోన్లో శ్రీనివాసులు నాయుడు మాట్లాడిన సంభాషణకు సంబంధించి వాయిస్ రికార్డులు వినిపించారు. అతని నుంచి తమకు రక్షణ కలి్పంచాలని వేడుకున్నారు. -
చంద్రబాబుకు జేసీ ఝలక్
అనంతపురం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక ఆక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారాయన. ఏకంగా తన వర్గానికి చెందిన వాళ్లే ఈ పని చేస్తున్నారని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తన వర్గానికి చెందిన సుమారు 25 మంది టీడీపీ నేతలే ఇసుక తరలిస్తున్నారని చెప్పారు జేసీ. అయితే.. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా ఆపాలని అన్నారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెప్పుకునే చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వడం కొసమెరుపు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. -
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం తాడిపత్రి సమీపంలో వంగనూరు వద్ద లారీ, కారు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తాడిపత్రికి చెందిన దంపతులు ప్రతాప్ రెడ్డి (25), ప్రమీల(22), మరో మహిళ వెంకటలక్ష్మి (45) మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల పోరుబాట
సాక్షి, అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో విద్యార్థులు పోరుబాట ప్రారంభించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ మహా ధర్నా జరిగింది.తల్లికి వందనం పథకం కింద ఒక్కొ విద్యార్థి కి 15 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేయడంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చింది.. వాటిని నీరుగార్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.