నేటి తరానికి ఆదర్శమూర్తి లలితమ్మ | Special Story On Yellareddy Lalithamma | Sakshi
Sakshi News home page

నేటి తరానికి ఆదర్శమూర్తి లలితమ్మ

Published Thu, Mar 14 2024 9:46 PM | Last Updated on Thu, Mar 14 2024 9:48 PM

Special Story On Yellareddy Lalithamma - Sakshi

దేశం కోసం యుద్ధంలో పోరాడే సైనికుడిని రణభూమికి పంపించే తల్లి ఎంత గొప్పదో.. అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజాసేవ చేసే రాజకీయాల్లోకి పంపించడం కూడా అంతే గొప్పది. కొడుకు రాజకీయాల్లోకి వెళ్తానంటే అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. కానీ.. తన కుమారులందరినీ ప్రజాసేవకు అంకితం చేసింది ఆ మాతృమూర్తి. ప్రజాభిమానం కలలు కంటే వచ్చేది కాదని.. బతికినన్ని రోజులు జనాన్ని ఇంటివాళ్లుగా భావించాలని చెబుతూ వారిని ప్రజాప్రతినిధులుగా మార్చింది. ఉగ్గుపాలతోనే కొడుకులకు ప్రజాసేవ నేర్పించిన ఆ తల్లి.. ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయింది.

దేవుడు ఆత్మకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. కానీ అమ్మ ఆత్మకూ, శరీరానికీ బాధ్యత వహిస్తుంది. అందుకే.. తన పిల్లలపై జీవితాంతం నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. తన పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడి సిరిసంపదలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. మాతృమూర్తులంతా ఒకేలా ఆలోచించరు. కేవలం తాము.. తమ కుటుంబం అని కాకుండా.. దేశం కోసం పరితపించే తల్లులు ఎందరో ఉన్నారు. వారి వల్లే ఎంతోమంది సైనికులుగా సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనం నిర్భయంగా జీవించేలా ధైర్యాన్నిస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మ పేరు ఎల్లారెడ్డిగారి లలితమ్మ. ఈ తల్లి కూడా తన పిల్లలను దేశ సేవకే అంకితం చేయాలని భావించారు. తండ్రి వారసత్వంగా కొడుకులందరినీ ప్రజాసేవలో తరలించేలా చేశారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా తన ఐదుగురు కొడుకులను ప్రజాప్రతినిధులుగా మార్చిన ఆమె... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ బోర్డు మెంబర్‌ను ఇచ్చారు. బతికున్నంత కాలం కుమారులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన లలితమ్మ.. 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మంలం కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో కర్నూలు జిల్లాలోని బద్నాల గ్రామానికి చెందిన లలితమ్మకు 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె. తొలి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న భీమిరెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకే భీమారెడ్డి కన్నుమూశారు.

ఆ తర్వాత కుమారులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన లలితమ్మ.. వారికి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ప్రజాభిమానం అనేది కలలు కంటే వచ్చేది కాదని.. ఎప్పటికీ ప్రజలను ఇంటివాళ్లుగానే భావించాలని తొలి నుంచీ వారికి చెప్పుకుంటూ వచ్చారు. ప్రజాసేవలో అనుసరించాల్సిన విధానాలతోపాటు ఎన్నికల వ్యూహాలపై కుమారులకు సలహాలు ఇచ్చేవారు. అమ్మ మాట ప్రకారమే నడుచుకున్న లలితమ్మ కొడుకులు ఇప్పుడు ఉన్నత స్థానంలో నిలిచి ప్రజాసేవలో తరిస్తున్నారు.

భీమిరెడ్డి-లలితమ్మ కుమారుల్లో జయరామిరెడ్డి ఇప్పటికే మృతిచెందగా.. కూతురు వరలక్ష్మి గుంతకల్లులో నివాసముంటున్నారు. ఇక మొదటి కొడుకు సీతారామిరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తుండగా.. శివరామిరెడ్డి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక వెంకట్రామిరెడ్డి గుంతకల్లు, సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని, బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేలుగా ప్రజా సేవ చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరవేయడమే కాదు.. తమకున్నంతలో చేయూతనిచ్చి ఆదుకోవాలని లలితమ్మ చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తారు ఆమె కుమారులు. అందుకే పేదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, కొత్త బట్టలు అందించడం, ఆర్థిక స్థోమత లేని వారిని చదివించడం వంటి సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

తండ్రి, కుమారులతో కలిపి ఒకే ఇంటి నుంచి ఏకంగా ఆరుగురు రాష్ట్రానికి సేవలందించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తండ్రి చనిపోయినా.. ఆ లోటు లేకుండా పిల్లలను పెంచి పెద్దచేసి వారిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన లలితమ్మ.. నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement