yellareddy
-
నేటి తరానికి ఆదర్శమూర్తి లలితమ్మ
దేశం కోసం యుద్ధంలో పోరాడే సైనికుడిని రణభూమికి పంపించే తల్లి ఎంత గొప్పదో.. అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజాసేవ చేసే రాజకీయాల్లోకి పంపించడం కూడా అంతే గొప్పది. కొడుకు రాజకీయాల్లోకి వెళ్తానంటే అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. కానీ.. తన కుమారులందరినీ ప్రజాసేవకు అంకితం చేసింది ఆ మాతృమూర్తి. ప్రజాభిమానం కలలు కంటే వచ్చేది కాదని.. బతికినన్ని రోజులు జనాన్ని ఇంటివాళ్లుగా భావించాలని చెబుతూ వారిని ప్రజాప్రతినిధులుగా మార్చింది. ఉగ్గుపాలతోనే కొడుకులకు ప్రజాసేవ నేర్పించిన ఆ తల్లి.. ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దేవుడు ఆత్మకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. కానీ అమ్మ ఆత్మకూ, శరీరానికీ బాధ్యత వహిస్తుంది. అందుకే.. తన పిల్లలపై జీవితాంతం నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. తన పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడి సిరిసంపదలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. మాతృమూర్తులంతా ఒకేలా ఆలోచించరు. కేవలం తాము.. తమ కుటుంబం అని కాకుండా.. దేశం కోసం పరితపించే తల్లులు ఎందరో ఉన్నారు. వారి వల్లే ఎంతోమంది సైనికులుగా సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనం నిర్భయంగా జీవించేలా ధైర్యాన్నిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మ పేరు ఎల్లారెడ్డిగారి లలితమ్మ. ఈ తల్లి కూడా తన పిల్లలను దేశ సేవకే అంకితం చేయాలని భావించారు. తండ్రి వారసత్వంగా కొడుకులందరినీ ప్రజాసేవలో తరలించేలా చేశారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా తన ఐదుగురు కొడుకులను ప్రజాప్రతినిధులుగా మార్చిన ఆమె... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ బోర్డు మెంబర్‌ను ఇచ్చారు. బతికున్నంత కాలం కుమారులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన లలితమ్మ.. 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మంలం కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో కర్నూలు జిల్లాలోని బద్నాల గ్రామానికి చెందిన లలితమ్మకు 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె. తొలి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న భీమిరెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకే భీమారెడ్డి కన్నుమూశారు. ఆ తర్వాత కుమారులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన లలితమ్మ.. వారికి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ప్రజాభిమానం అనేది కలలు కంటే వచ్చేది కాదని.. ఎప్పటికీ ప్రజలను ఇంటివాళ్లుగానే భావించాలని తొలి నుంచీ వారికి చెప్పుకుంటూ వచ్చారు. ప్రజాసేవలో అనుసరించాల్సిన విధానాలతోపాటు ఎన్నికల వ్యూహాలపై కుమారులకు సలహాలు ఇచ్చేవారు. అమ్మ మాట ప్రకారమే నడుచుకున్న లలితమ్మ కొడుకులు ఇప్పుడు ఉన్నత స్థానంలో నిలిచి ప్రజాసేవలో తరిస్తున్నారు. భీమిరెడ్డి-లలితమ్మ కుమారుల్లో జయరామిరెడ్డి ఇప్పటికే మృతిచెందగా.. కూతురు వరలక్ష్మి గుంతకల్లులో నివాసముంటున్నారు. ఇక మొదటి కొడుకు సీతారామిరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తుండగా.. శివరామిరెడ్డి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక వెంకట్రామిరెడ్డి గుంతకల్లు, సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని, బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేలుగా ప్రజా సేవ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరవేయడమే కాదు.. తమకున్నంతలో చేయూతనిచ్చి ఆదుకోవాలని లలితమ్మ చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తారు ఆమె కుమారులు. అందుకే పేదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, కొత్త బట్టలు అందించడం, ఆర్థిక స్థోమత లేని వారిని చదివించడం వంటి సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తండ్రి, కుమారులతో కలిపి ఒకే ఇంటి నుంచి ఏకంగా ఆరుగురు రాష్ట్రానికి సేవలందించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తండ్రి చనిపోయినా.. ఆ లోటు లేకుండా పిల్లలను పెంచి పెద్దచేసి వారిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన లలితమ్మ.. నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు. మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్‌ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలోని గెస్ట్ హౌజ్ లో మందు పార్టీ
-
రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది: రేవంత్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌పై రైతులంతా తిరుగుబాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మనఊరు మనపోరు’ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో ప్రతిరైతు సంతోషంగా ఉంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న కేసీఆర్.. రైతులకు ఆ మాత్రం చేయలేరా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. పంజాబ్, హర్యానా రైతులకంటే నిజామాబాద్ రైతులు చైతన్యవంతులని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించారని గుర్తు చేశారు. గెలిపిస్తే పసుపు బోర్డ్ తెస్తామని హామీ ఇచ్చి మరచిన ఎంపీని కూడా ఓడించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
చిరుతను చూసినా బెదరలేదు.. గాయాలైనా పోరాటం..
సాక్షి, కామారెడ్డి: చిరుత పులి దాడిలో ఓ యువకుడు గాయపడిన ఘట న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో చోటుచేసు కుంది. గ్రామంలోని నాయికోటి మల్లేశ్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో చిరుత పులి దాడి చేసింది. గొర్రెల అరుపులకు నిద్రలేచిన మల్లేశ్ చిరుతను అదరగొట్టి అక్కడి నుంచి తరిమేశాడు. అప్పటికే మందలోని ఒక గొర్రెను చిరుత హతమార్చింది. అనంతరం మల్లేశ్ బహిర్భూమికి వెళ్లిరాగా మళ్లీ గొర్రెల మందపై చిరుత దాడి చేస్తూ కనిపించింది. దీంతో చిరుతను తరిమేసేందుకు ప్రయత్నించిన మల్లేశ్‌పైకి వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన మల్లేశ్ పక్కనే ఉన్న సైకిల్ పాత టైరును తన మెడకు అడ్డుగా పెట్టుకుని చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీంతో అతడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే మల్లేశ్ అరుపులు వినిపించడంతో అతని తండ్రి భూమయ్య, భార్య సావిత్రి బయటకు వచ్చి లైట్లు వేసి గట్టిగా అరిచారు. దీంతో భయపడిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. మల్లేశ్‌ను 108లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలను తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత దాడిలో గాయపడిన మల్లేశ్‌కు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా
సాక్షి, సిద్దిపేట: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో రామలింగారెడ్డి భార్య, కుమారుడు, ఇద్దరు పిల్లలకు పాజిటివ్ ఉన్నట్లు మంగళవారం తేలింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రామలింగారెడ్డి మరణం నుంచి సంతాప సభ వరకు తమతో కలసి ఉన్నవారు. తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు పాజిటివ్ సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
జిత్తులమారి నక్క
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కుందేలు, తాబేలు ఎంతో స్నేహంతో అన్యోన్యంగా ఉండేవి. అదే అడవిలో ఒక జిత్తుల మారి నక్క కూడా ఉండేది. కుందేలు, తాబేలు అన్యోన్యంగా ఉండటాన్ని చూసి సహించలేకపోయేది. వాటి మధ్య ఎలాగైనా తగవు పెట్టి ఇద్దరినీ విడదీయాలని నిశ్చయించుకుంది. ఒకరోజు నక్క తాబేలు దగ్గరకు వెళ్లి ‘‘తాబేలన్నా! తాబేలన్నా! నీ గురించి ఆ కుందేలు ఎన్నెన్ని మాటలు అందనుకున్నావ్? నీది అసహ్యమైన రూపమట! నీ నడక చూస్తేనే కంపరమేస్తుందట!’’ అని కుందేలు మీద నానా చాడీలు చెప్పింది. అక్కడి నుంచి నక్క తాపీగా కుందేలు దగ్గరకు వెళ్లి ‘‘కుందేలన్నా! కుందేలన్నా! ఆ తాబేలు నిన్ను నానా మాటలు అంది తెలుసా? అది తిండిపోతు. నాకంటే వేగంగా పరుగుతీస్తానని తలపొగరు..’’ అంటూ ఇలా తాబేలు మీద పితూరీలు చెప్పింది. తాబేలు, కుందేలు యథావిధిగా కలుసుకున్నారు. ఒకరిపై మరొకరికి నక్క చాడీలు చెప్పినా ఇద్దరూ పరస్పరం అనుమానించుకోలేదు. కాసేపు మౌనంగా ఉన్నారు. చివరకు కుందేలు మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘నిజంగా నేను నీ గురించి ఏమీ అనలేదు’’ అంటే తాబేలు కూడా ‘‘ఔను మిత్రమా! నేను కూడా నీ గురించి ఏమీ అనలేదు’’ అంది. కుందేలుకు నక్క ఎత్తుగడ అర్థమైంది. దానికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని ఆలోచనలో పడింది. పథకం తట్టగానే తాబేలుతో ఇలా చెప్పింది: ‘‘మిత్రమా! నక్క రేపు నా దగ్గరకు వస్తుంది. నువ్వు చాటు నుంచి దాని మాటలను ఆలకించు. దాని బండారం బయటపడుతుంది.’’ తాబేలు ‘‘సరే మిత్రమా!’’ అంది. మరుసటి రోజున నక్క హుషారుగా ఊళ వేసుకుంటూ కుందేలు దగ్గరకు వచ్చింది. ‘‘చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విశేషం’’ అని పలకరించింది కుందేలు. ‘‘ఆ... ఏముందన్నా.. నీ గురించే ఆలోచిస్తున్నాను. నేను చెబితే నమ్మవుగాని, నువ్వంటే ఆ తాబేలుకు అస్సలు ఇష్టం లేదు. దానికి పొగరెక్కువ. ఒక కర్ర తీసుకుని రేపు దాన్ని బాగా మోదుదామనుకున్నా అని ఆ తాబేలు చెప్పిందన్నా..’’ అని నక్క అంటుండగా, అప్పటి వరకు దాపునే పొంచి ఉన్న తాబేలు బయటకు వచ్చి ‘‘ఓరి దుర్మార్గుడా! ఎంత మాట అన్నావురా! నా స్నేహితుడిని నేను కర్రతో మోదుతానన్నానా?’’ అని నిలదీసే సరికి నక్క నివ్వెరపోయింది. ‘‘మా ఇద్దరి మధ్య తగవు పెట్టాలని, మా స్నేహాన్ని విడదీయాలని చూస్తావా?’’ అంది కుందేలు కోపంగా.. ఇద్దరు మిత్రులూ ఏకమై నిలదీయడంతో నక్క తోక ముడిచి తలదించుకుంది. ‘‘ఈ అడవిలో మేము అన్యోన్యంగా ఉంటున్నాం. వెళ్లు... మా మధ్యకు ఎప్పుడూ రాకు. అందుకే నిన్ను జిత్తులమారి అంటారు. ఛీ ఛీ.. నీదీ ఒక పుట్టుకేనా?’’ అని కుందేలు నక్కకు చీవాట్లు పెట్టింది. తన పన్నాగం పారకపోయే సరికి నక్క అక్కడి నుంచి తోకముడిచి పలాయనం చిత్తగించింది. -
ఒక్క ఊరు.. రెండు కమిటీలు
అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ముదురుతున్నాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. రెండు వర్గాలు వేరువేరుగా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా.. గ్రామ కమిటీలను సైతం వేరువేరుగా ఎన్నుకుంటుండడం గమనార్హం. సాక్షి, కామారెడ్డి: ఉత్తునూరు.. ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలంలోని గ్రామం. తెలంగాణ ఉద్యమం నుంచి అక్కడ టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. గతంలో టీఆర్ఎస్లో ఉన్నవారు ఒక వర్గంగా, కొత్తగా చేరిన వారు మరో వర్గంగా విడిపోయి ఎవరికి వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు నుంచి మొదలుకొంటే గ్రామ కమిటీల ఎన్నిక వరకూ ఎవరికి వారే కార్యక్రమాలను చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉత్తునూరులో ఇప్పుడు టీఆర్ఎస్ గ్రామ శాఖకు రెండు కమిటీలు ఏర్పాటయ్యా యి. ఒక్క ఉత్తునూరులోనే కాదు నియోజక వర్గం అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. ఎమ్మెల్యే వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా టీఆర్ఎస్ రెండుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే గతేడా ది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై వ్యతిరేకత రావడం, పలుమార్లు ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్‌పై సానుభూతి వెల్లువెత్తడంతో టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కనుసన్నల్లోనే పాలన సాగేది. అయితే కొన్నాళ్లకే ఎమ్మెల్యే జాజాల సురేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఎల్లారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో రాజకీయ ఘర్షనలు జరిగేవి. అయితే సురేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత పరిస్థితులు తలకిందులయ్యాయి. టీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు ఒక వర్గంగా, ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు మరో వర్గంగా చీలిపోయారు. నియోజక వర్గ టీఆర్ఎస్ బాధ్యతలు ఎమ్మెల్యే సురేందర్‌కు అప్పగించడంతో అన్నింటా ఆయన అనుచర వర్గానిదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం వారు ఆవేదనకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత దక్కింది. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. కొన్ని మండలాల్లో పాత క్యాడర్ స్వతంత్రంగా బరిలో దిగి విజయం సాధించింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, రామారెడ్డి మండలాల జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గాంధారి, తాడ్వాయి, రాజంపేట, సదాశివనగర్ మండలాలలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి కొనసాగిన వారికి టికెట్లు దక్కకపోవడంతోనే పార్టీ ఓటమి చెందిందని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆరోపించగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చారని, అందు వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి ఇరు వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. సంస్థాగత ఎన్నికల్లో.. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు ఒకవర్గంగా, ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్లో చేరిన వారు మరో వర్గంగా విడిపోయారు. పాత తరంలో కొందరు మాత్రమే ఎమ్మెల్యే వెంట నడుస్తుండగా, మెజారిటీ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్గంలోనే కొనసాగుతున్నారు. దీంతో గ్రామ, మండల కమిటీల నియామకం విషయంలో ఇరు వర్గాలు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు వర్గాలు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గ్రామ కమిటీల ఎన్నికల తరువాత మండల కమిటీలను ఎన్నుకోనున్నారు. ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. -
పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!
సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణం లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డికి చెందిన చిలక రాజమౌళి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో రాజమౌళి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కుమార్తె స్వప్న (20)కు పెళ్లి చేయడం లేదు. ఈ విషయమై తల్లితో గొడవ పడిన స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మృతురాలి సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత భర్తను హతమార్చిన ప్రియుడు
సాక్షి, నిజామాబాద్ : తాడ్వాయి మండలంలోని సోమారం గ్రామానికి చెందిన పిట్ల గోపాల్(32)అనే వ్యక్తి సిద్దిపేట జిల్లాలోని గౌరారం పోలీసు స్టేషన్ పరిధిలోని నాచారంలో హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోపాల్, సంపంగి రవి వడ్డెర పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంతేగాకుండ వీరిద్దరు కలసి చిన్నచిన్న దొంగతనాలు కూడా చేసేవారు. కాగా గత కొన్ని రోజుల నుంచి గోపాల్ భార్యతో రవి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ నెల 22న వీరిద్దరు ఇంటి నుంచి కామారెడ్డి వైపు వెళ్లారు. సిద్దిపేట శివారులో బండలను పగుల కొట్టాలని బేరం కుదుర్చకుందామని గోపాల్‌కు నచ్చచెప్పి రవి కామారెడ్డి నుంచి సిద్దిపేట జిల్లాలోని నాచారం చేరుకున్నారు. వారి వెంట తీసుకెళ్లిన మద్యం తాగారు. ఈ క్రమంలో గోపాల్‌కు మద్యం ఎక్కువ అయింది. ఇదే అదునుగా చూసుకొని రవి పెద్ద బండరాయితో గోపాల్ తలపై కొట్టాడు. దీంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నెల 25న తన భర్త తప్పి పోయాడని గోపాల్ భార్య ఎల్లవ్వ తాడ్వాయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. రవి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు నాచారంలోని ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి రవికి సంబంధించిన ఇల్లును దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సోమారం గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. -
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): ఉమ్మడి నిజామా బాద్‌లో ఎల్లారెడ్డి అ సెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలు పొందిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఉన్నత పదవులు నిర్వర్తించారు. 1962లో ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం మొదట కామారెడ్డితో కలిసి ఉమ్మడి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఈ స్థానం ఎస్సీకి రిజర్వు చేయబడింది. 1962లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి టి.ఎన్.సదాలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి పోటీచేసి గెలుపొందిన టి.ఎన్.సదాలక్ష్మి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం 1967, 1972లలో జరిగిన వరుస ఎన్నికల్లో ప్రస్తుత మాజీమంత్రి గీతారెడ్డి తల్లి జెట్టి ఈశ్వరీబాయి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బరిలోకి దిగిన ఈశ్వరీబాయి 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ రోజుల్లోనే ఈశ్వరీబాయి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి(ఎస్టీఎస్) పార్టీని ఆమె స్థాపించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీఎస్ తరపున ఈశ్వరీబాయి, కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఈశ్వరీబాయి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనాటి రాష్ట్రశాసనసభ ప్రతిపక్ష నాయకులలో ప్రముఖ నాయకులైన తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, జి.శివయ్యగార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. 1978లో ఎస్సీ రిజర్వ్డ్ 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్‌కు మారడంతో నియోజకవర్గ పరిధిలోని లింగంపేట మండలం అయిలాపూర్‌కు చెందిన తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన అప్పటి ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి కేబినెట్లలో చక్కెర పరిశ్రమశాఖ మంత్రిగా, రోడ్లుృభవనాలశాఖ మంత్రిగా కొనసాగారు. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం బాలాగౌడ్ నిజామాబాద్ పార్లమెంట్‌స్థానం నుంచి రెండుసార్లు పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగా రు. నేరెళ్ల హ్యాట్రిక్ 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గాంధారి వాస్తవ్యులు నేరేళ్ల ఆం జనేయులు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994, 1999ల లో వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీచేసిన నేరేళ్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వరుసగా మూ డుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన నేతగా పేరొందారు. వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన నేరేళ్ల ఆంజనేయులు 1998లో ప్రభుత్వవిప్‌గా కొనసాగారు. 2001లో రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఇ లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్న త పదవులను అధిరోహించి జిల్లాలో ఎల్లారెడ్డి ప్రత్యేకతను చాటారు. -
టీఆర్ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు
సాక్షి, కామారెడ్డి : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణతో స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో తహసీల్దార్ రంజిత్ కుమార్ ఆయనపై ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఈ 171కింద కేసు నమోదైంది. అసలేం జరిగింది... టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షలు ఇస్తానంటూ రవీందర్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నివేదిక పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షలు ఇస్తానంటూ వాగ్దానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సురేందర్ తదితరులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీడియో ఫుటేజీని జతచేశారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట
సాక్షి, లింగంపేట్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నల్లమడుగు సురేందర్ చేపట్టిన రాజీవ్ సందేశ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. లింగంపేట్ మండలంలో నల్లమడుగు సురేందర్ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఇందులో పాల్గొన్నారు. నిన్న రాత్రి పాదయాత్ర తాడ్వాయి మండలం ఏర్రా పహాడ్‌కు చేరుకున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించారు. కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థతులు తలెత్తాయి. గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
ప్రాణం తీసిన సరదా..
= ట్రాక్టర్ బోల్తా పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి బుక్కపట్నం : సరదాగా ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురై సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృత్యువాత పడ్డాడు. గూనిపల్లికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు యర్రగూడి (మొర్రెప్పగారి) ఎల్లారెడ్డి(25) ముంబైలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. ఈ యువ ఇంజినీర్ దీపావళి పండుగ కోసం గత శనివారం స్వగ్రామానికి వచ్చాడ. మంగâýæవారం సరదాగా ట్రాక్టర్‌ను నడుపుతూ ఊరు దగ్గర్లో ఉన్న పాత బావిలోకి పల్టీలు కొట్టాడు.దీంతో ట్రాక్టర్ ఎల్లారెడ్డిపై పడటంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే 108 వాహనంలో పుట్టపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. -
ఎల్లారెడ్డిలో దారుణ హత్య
ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో మల్లాయిపల్లిలో పోచయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. పోచయ్యకు అతని తమ్ముడు బాలయ్యతో కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. హత్య జరిగిన తర్వాత బాలయ్య కనిపించకపోవటంతో ఈ హత్య అతడే చేసి ఉంటాడని పోచయ్య కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రమాదవశాత్తూ 105 మేకలు మృతి
ఎల్లారెడ్డి : నిజామాబాద్ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, పెద్ద నారాయణ ఇలా ఓ పన్నెండు మంది తమ మేకలను మేత కోసం గురువారం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా... ఎల్లారెడ్డి మండలం జంకంపల్లి వద్ద చెరువు కట్టపై నుంచి మేకలు, గొర్రెలు జారి లోతైన ప్రదేశంలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 105 వరకు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. అయితే, మేతకు తీసుకొచ్చినవి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కొన్ని జారిపడిపోయిన విషయాన్ని వాటి యజమానులు గమనించలేదు. శుక్రవారం ఉదయం కొన్ని తగ్గినట్టు గుర్తించి వెనక్కి వెళ్లి చూడగా... చెరువు గట్టు పక్కన మృతి చెంది ఉండడం కనిపించింది. -
పీర్ల ఉరేగింపులో అపశృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్ది మండలం మాచాపూర్‌లో మంగళవారం పీర్ల ఉరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. మొహర్రం పండగం సందర్భంగా పీర్లు విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతం సంభవించి ఒకరు మరణించారు. మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి పోలీసులు తెలుసుకున్నారు. -
కొత్తకొత్తగా..
నవ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో జిల్లానుంచి తొమ్మిది మంది టీఆర్ఎస్ సభ్యు లే ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇందులో నలుగురు మొదటి పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. నూతన రాష్ట్రంలో సమావేశమయ్యే తొలి అసెంబ్లీ సమావేశా ల్లో పాల్గొనే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేసీఆర్ కొలువులో చోటు సంపాదించుకున్న పోచారం శ్రీని వాస్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్ నాలుగుసార్లు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మూడుసార్లు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి జిల్లాకు చెందిన నలుగురు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నా రు. బాల్కొండ నుంచి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ నుంచి జీవన్‌రెడ్డి, బోధన్ నుంచి షకీల్, నిజామాబాద్ అర్బన్ స్థానంనుంచి గణేశ్‌గుప్తా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరు సోమవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణాలతోనే సరి.. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలు సో మవారం నుంచి ఐదు రోజుల పాటు సాగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపిక, బీఏసీలు నిర్వహించనున్నారు. ఈసారి చర్చలు, సమస్యల ప్రస్తావనకు అవకాశం లేదని, తదుపరి సమావేశాల్లోనే మాట్లాడే అవకాశం రావొచ్చని ఓ ఎమ్మెల్యే తెలిపారు. ఆ సమావేశాల్లో జిల్లా సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. దీంతో సభ్యులకు మాట్లాడే అవకాశం రావాలంటే మలి విడత సమావేశాల వరకు ఆగాల్సిందే. ఈ సందర్భంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్న పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయాలిలా ఉన్నాయి. -
బాలికల హాస్టల్లో విచారణ
ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగిన అవకతవకలపై బుధవారం ‘సాక్షి’ టాబ్లాయిడ్లో ప్రచురించిన ‘హాస్టల్లో.. అర్ధాకలి’తో వార్తకు అధికారులు స్పందించారు. మ ద్నూర్ ఏఎస్డబ్ల్యూఓ వెంకట్రాములును బుధవారం విచారణ నిమిత్తమై ఎల్లారెడ్డికి పంపించారు. ఆయన హాస్టల్ విద్యార్థులందరితో మాట్లాడి, వివరాలను సేకరించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యా ర్థి నాయకులు విద్యాసాగర్,అరుణ్,మహేశ్ వినతిపత్రం అందచేశారు. -
హాస్టల్లో అర్ధాకలితో..
ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో 70 మంది విద్యార్థులున్నారు. అయితే వారి కి సరిపోయేంత భోజనాన్ని మాత్రం వడ్డించడంలేదు. నాలుగు కిలోల రవ్వతో ఉప్మా తయారు చేసి 70 మం ది విద్యార్థులకు వడ్డిస్తున్నారు. నాలుగు లీటర్ల పాల తోనే సరిపెడుతున్నారు. వారానికోసారి మాత్రమే గుడ్డు ఇస్తున్నారు. అన్నం కూడా సరిపోయేంత పెట్టడం లేదు. రాగి జావా, స్నాక్స్, సేమియా, పల్లిపట్టీలు విద్యార్థులకు ఇవ్వడం లేదు. మెనూ ప్రకారం కూరగాయలు కూడా వడ్డించడం లేదు. బియ్యంతో పాటు ఆయిల్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను వార్డెన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వసతి గృహంలో వైద్య సేవలు కూడా అందడం లేదు. ఏదైనా సమస్య తలెత్తితే ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటున్నారు. సోమవారం రాత్రి విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తహశీల్దార్ మంగళవారం హాస్టల్లో విచారణ చేపట్టారు. ఆయనకు విద్యార్థులు పై విషయాలు తెలిపారు. టీవీకి సంబంధించిన డిష్ బిల్లు కూడా తమతోనే కట్టిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం బియ్యం బస్తాను తెప్పిం చి, బాత్రూమ్లో వేయించారన్నారు. వార్డెన్ హాస్టల్ లోంచి రోజూ సరుకులను కామారెడ్డికి తీసుకెళ్తారని ఆరోపించారు. స్టోర్ రూమ్ బయట సరుకులు.. తహశీల్దార్ హాస్టల్లోని స్టోర్ రూమ్‌ను తెరిపించి స్టాకు వివరాలు పరిశీలించారు. విద్యార్థుల గదుల్లో 50 కిలోల బియ్యం సంచి కనిపించింది. బాత్రూమ్లోనూ బియ్యం బస్తా లభించింది. వార్డెన్ విజయలక్ష్మిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. నిత్యావసర వస్తువులు సైతం స్టోర్ రూమ్‌లో కాకుండా బయట లభించడంతో వాటిని సీజ్ చేశారు. విచారణ హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదు. ఈ విషయమై విద్యార్థి సంఘాల నాయకులు సైతం వార్డెన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఏ విషయం అడిగినా వార్డెన్ సరైన సమాధానం ఇవ్వరని తహశీల్దార్‌తో పేర్కొన్నారు. -
రబీ సాగుకు 150 టీఎంసీల నీరు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్ఎస్పీ) ద్వారా ర బీ సాగుకు మూడు ప్రాంతాలకు 50 చొప్పున మొత్తం 150 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు ఎన్ఎస్పీ సీఈ ఎల్లారెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. నీటి విడుదల మొదలైందని, మార్చి చివరి వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. సాగర్ కుడి కాల్వ పరిధిలో 5.40లక్షల ఎకరాలకు, ఎడమ కాల్వ పరిధిలో 9.30లక్షల ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్టు వివరించారు. నీటిని వారబందీ ప్రకారం విడుదల చేస్తామన్నారు. క్రిష్ణా డెల్టా ప్రాంత పరిధిలోని భూములకు 50 టీఎంసీలు విడుదల చేస్తామన్నారు. టేకులపల్లి సర్కిల్ పరిధిలోని రెండో జోన్లో ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే నీరిస్తామన్నారు. రబీ రైతులు ఆరు తడి పంటలు మాత్రమే సాగు చేయాలని కోరారు. రూ.1100కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు పూర్తి సాగర్ కాల్వల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.4444 కోట్లు మంజూరైనట్టు సీఈ చెప్పారు. ఇప్పటివరకు రూ.1100కోట్ల విలువైన పనులు పూర్తయినట్టు చెప్పారు. నీటి సరఫరా లేని రోజుల్లోనే పనులు చేయాలన్న నిబంధన కారణంగా సాగర్ కాల్వల ఆధునికీకరణ ఆలస్యమవుతోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1100 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారంగా నీటి విడుదలను మార్చి 31 నాటికి నిలిపేసి, వెంటనే పనులు చేపడతామని అన్నారు. నీటి మీటర్లతో ఇబ్బంది ఉండదు ఆధునికీకరణ పనుల సమయంలోనే నీటి మీటర్లను కూడా ఏర్పాటు చేస్తామని, వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఈ అన్నారు. నీటి సక్రమ వినియోగం, లోటుపాట్ల నివారణ కోసమే వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, శిస్తు వసూలు లెక్కల కోసం కాదని వివరించారు. మున్ముందు నీటి సమస్యలు తీవ్రమ య్యే పరిస్థితుందని; అందుకే నీటి పొదుపుపై రైతులకు, ఇంజనీర్లకు ఇప్పటి నుంచే అవగాహ న కల్పించనున్నట్టు చెప్పారు. కాల్వలకు అవసరమైన చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపడితే అవి (కాల్వలు) బాగుపడతాయన్నారు. అవగాహన లేనందునే భూముల దురాక్రమణ తమ శాఖాధికారులకు నీటి పర్యవేక్షణతోనే సమయం సరిపోతోందని, ఈ కారణంగా ఎన్ఎస్పీ భూములపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదని, అందుకే వాటిని రక్షించలేకపోతున్నారని సీఈ అన్నారు. ఎన్ఎస్పీ, రెవెన్యూ శాఖలు సమన్వయంగా వ్యవహరించినప్పుడే ఈ (ఎన్ఎస్పీ) భూముల దురాక్రమణను అడ్డుకోగలమని అన్నారు. టేకులపల్లి సర్కిల్ పరిధిలో కొన్ని నిరుపయోగ భూములను ఇప్పటికే రెవెన్యూ శాఖకు అప్పగించినట్టు చెప్పారు. నిధుల స్వాహాపై విచారణ కమిటీని కోరాం... ఖమ్మం ఎన్నెస్పీ మానిటరింగ్ డివిజన్ కార్యాలయంలో సుమారు రూ.60లక్షల పైగా నిధుల స్వాహాకు సంబంధించి తమ శాఖతోపాటు పీఏఓ (ప్రభుత్వ చెల్లింపుల) శాఖ అధికారుల హస్తం ఉందని అన్నారు. దీనిపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. రెండు శాఖల్లోని అన్నిరకాల రికార్డులు పరిశీలిస్తే మొత్తం ఎంత దుర్వినియోగమైందీ తెలుస్తుందన్నారు. మూడోజోన్ను రెండోజోన్‌లో కలిపేందుకు సర్వే పూర్తి కల్లూరు: సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోగల రెండు, మూడు జోన్లలోని ఆయకట్టును రెండోజోన్‌లో కలిపేందుకు సర్వే పూర్తయిందని ఎన్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి చెప్పారు. జోన్ మార్పిడి సర్వే పనులను పరిశీలించేందుకు గురువారం ఇక్కడకు వచ్చిన ఆయన.. కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగర్ మూడోజోన్లోని 17వేల ఎకరాలను రెండోజోన్‌లో కలిపితే మొత్తం ఒకేసారి ఖరీఫ్‌కు సాగు నీరు అందించేందుకు వీలవుతుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం చేపట్టిన సర్వే రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు. మధిర బ్రాంచ్ కెనాల్ పరిధిలోని నిధానపురం మేజర్ వద్దనున్న కట్టలేరు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి జమలాపురం మేజర్‌కు అనుసంధానించనున్నట్టు తెలిపారు. రబీ సీజన్లో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించందన్నారు. ఖరీఫ్‌లో పత్తి, మిర్చి, పసుపు తదితర వాణిజ్య పంటల కోసం ఫిబ్రవరి నెలాఖరు వరకు నాలుగు దఫాలుగా సాగు నీరు ఇస్తామన్నారు. మున్నేరు వరకు రబీ సాగుకు 12 రోజులు ఆన్, 8 రోజులు ఆఫ్ సిస్టమ్ ద్వారా సాగునీటి సరఫరా అవుతుందన్నారు. మున్నేరు దిగువన 10 రోజుల ఆఫ్, 10 రోజులు ఆన్ పద్ధతి ద్వారా నీటి సరఫరా ఉంటుందన్నారు. -
నేడు సాగర్ కాల్వలకు నీటి విడుదల
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వకింద రబీ సాగుకు నేటినుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి తెలిపారు. నీటి విడుదలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా కుడి, ఎడమ కాల్వలకు, కృష్ణా డెల్టాకు 50 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించినట్టు చెప్పారు. ఈ రబీలో కుడి, ఎడమ కాల్వలు, డెల్టా కింద సుమారు 15.67లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఇందులో ఎడమ కాల్వ కింద 4లక్షల 31వేల 300 ఎకరాలని తెలిపారు. ఆ నీటిని ఐదు విడతలుగా విభజించి స్థానిక ఎన్ఎస్పీ అధికారులు ప్రణాళికాబద్ధంగా మేజర్ కాల్వలకు విడుదల చేస్తారన్నారు. తొలి విడతగా ఈ నెల 20వ తేదీన, 22న రెండో విడత, ఫిబ్రవరి 10న మూడో విడత, మార్చి ఒకటిన నాల్గోవిడత, మార్చి20న ఐదో దఫాగా సాగునీరు విడుదల చేస్తామని వివరించారు. మార్చి 31వ తేదీ తర్వాత నీరు విడుదల చేయడం సాధ్యపడదని తెలిపారు. ఈ లోపు రైతులు పంటలు సాగుచేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 567.60అడుగుల నీరుంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 8580 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా రాగా, 20,200 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అందులో కుడికాల్వ ద్వారా 8875 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5000 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, శ్రీశైలం రివర్స్ పంపింగ్ ద్వారా 5,125 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.