
సాక్షి, లింగంపేట్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నల్లమడుగు సురేందర్ చేపట్టిన రాజీవ్ సందేశ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. లింగంపేట్ మండలంలో నల్లమడుగు సురేందర్ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఇందులో పాల్గొన్నారు. నిన్న రాత్రి పాదయాత్ర తాడ్వాయి మండలం ఏర్రా పహాడ్‌కు చేరుకున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించారు. కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థతులు తలెత్తాయి. గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment