
అనగనగా ఒక అడవి.
ఆ అడవిలో కుందేలు, తాబేలు ఎంతో స్నేహంతో అన్యోన్యంగా ఉండేవి.
అదే అడవిలో ఒక జిత్తుల మారి నక్క కూడా ఉండేది. కుందేలు, తాబేలు అన్యోన్యంగా ఉండటాన్ని చూసి సహించలేకపోయేది. వాటి మధ్య ఎలాగైనా తగవు పెట్టి ఇద్దరినీ విడదీయాలని నిశ్చయించుకుంది.
ఒకరోజు నక్క తాబేలు దగ్గరకు వెళ్లి ‘‘తాబేలన్నా! తాబేలన్నా! నీ గురించి ఆ కుందేలు ఎన్నెన్ని మాటలు అందనుకున్నావ్? నీది అసహ్యమైన రూపమట! నీ నడక చూస్తేనే కంపరమేస్తుందట!’’ అని కుందేలు మీద నానా చాడీలు చెప్పింది.
అక్కడి నుంచి నక్క తాపీగా కుందేలు దగ్గరకు వెళ్లి ‘‘కుందేలన్నా! కుందేలన్నా! ఆ తాబేలు నిన్ను నానా మాటలు అంది తెలుసా? అది తిండిపోతు. నాకంటే వేగంగా పరుగుతీస్తానని తలపొగరు..’’ అంటూ ఇలా తాబేలు మీద పితూరీలు చెప్పింది.
తాబేలు, కుందేలు యథావిధిగా కలుసుకున్నారు. ఒకరిపై మరొకరికి నక్క చాడీలు చెప్పినా ఇద్దరూ పరస్పరం అనుమానించుకోలేదు. కాసేపు మౌనంగా ఉన్నారు.
చివరకు కుందేలు మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘నిజంగా నేను నీ గురించి ఏమీ అనలేదు’’ అంటే తాబేలు కూడా ‘‘ఔను మిత్రమా! నేను కూడా నీ గురించి ఏమీ అనలేదు’’ అంది.
కుందేలుకు నక్క ఎత్తుగడ అర్థమైంది. దానికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని ఆలోచనలో పడింది. పథకం తట్టగానే తాబేలుతో ఇలా చెప్పింది: ‘‘మిత్రమా! నక్క రేపు నా దగ్గరకు వస్తుంది. నువ్వు చాటు నుంచి దాని మాటలను ఆలకించు. దాని బండారం బయటపడుతుంది.’’
తాబేలు ‘‘సరే మిత్రమా!’’ అంది.
మరుసటి రోజున నక్క హుషారుగా ఊళ వేసుకుంటూ కుందేలు దగ్గరకు వచ్చింది.
‘‘చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విశేషం’’ అని పలకరించింది కుందేలు.
‘‘ఆ... ఏముందన్నా.. నీ గురించే ఆలోచిస్తున్నాను. నేను చెబితే నమ్మవుగాని, నువ్వంటే ఆ తాబేలుకు అస్సలు ఇష్టం లేదు. దానికి పొగరెక్కువ. ఒక కర్ర తీసుకుని రేపు దాన్ని బాగా మోదుదామనుకున్నా అని ఆ తాబేలు చెప్పిందన్నా..’’ అని నక్క అంటుండగా, అప్పటి వరకు దాపునే పొంచి ఉన్న తాబేలు బయటకు వచ్చి ‘‘ఓరి దుర్మార్గుడా! ఎంత మాట అన్నావురా! నా స్నేహితుడిని నేను కర్రతో మోదుతానన్నానా?’’ అని నిలదీసే సరికి నక్క నివ్వెరపోయింది.
‘‘మా ఇద్దరి మధ్య తగవు పెట్టాలని, మా స్నేహాన్ని విడదీయాలని చూస్తావా?’’ అంది కుందేలు కోపంగా..
ఇద్దరు మిత్రులూ ఏకమై నిలదీయడంతో నక్క తోక ముడిచి తలదించుకుంది.
‘‘ఈ అడవిలో మేము అన్యోన్యంగా ఉంటున్నాం. వెళ్లు... మా మధ్యకు ఎప్పుడూ రాకు. అందుకే నిన్ను జిత్తులమారి అంటారు. ఛీ ఛీ.. నీదీ ఒక పుట్టుకేనా?’’ అని కుందేలు నక్కకు చీవాట్లు పెట్టింది.
తన పన్నాగం పారకపోయే సరికి నక్క అక్కడి నుంచి తోకముడిచి పలాయనం చిత్తగించింది.
Comments
Please login to add a commentAdd a comment