భేదభావాలు చూపనిది, షరతులు లేనిది ఈ సృష్టిలో స్నేహం ఒక్కటే! దీన్ని మించిన మాధుర్యం లేదు ఈ లోకంలో! అలాంటి దోస్తీని దొన్ను చెక్కీతో మరింత తీపి చేసుకుంటారు ఉత్కళాంధ్రులు! ఆ మిఠాయి ధనుర్మాసానికి ప్రత్యేకం! శతాబ్దాలనాటిదీ సంప్రదాయం!
ఆ స్వీట్ స్టోరీ ..
మద్దిలి కేశవరావు, ఇచ్ఛాపురం రూరల్ సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజున ఉత్కళాంధ్రులు నెలగంటును వేస్తారు. ధనుర్మాసం తొలిరోజు నుంచి మకర సంక్రాంతి వరకు పేలాలు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు, ఖర్జూరం వేసి వివిధ ఆకృతుల్లో తయారుచేసిన ‘దొన్ను చెక్కీ’ని ప్రతిరోజూ వైష్ణవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ మిఠాయిని ‘ధనుర్మువ్వా’ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదన్నది ఇక్కడి ఆచారం.
ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్న చెలిమిని ఇక్కడ దోస్తీ, నేస్తాలు, మోఖర, సొంగాతి, మిత్తరికం వంటి పేర్లతో పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పరస్పరం సొంత పేర్లతో పిలుచుకునే అవకాశం ఉండదు. అలాంటి అనుబంధాలకు గుర్తుగా ఈ మువ్వా చెక్కీలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో దుస్తులు, కాయగూరలనూ ఇస్తుంటారు. అంతేకాదు ఈ చెక్కీతోనే సంక్రాంతికి కొత్త అల్లుడిని అత్తారింటికి ఆహ్వానిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు ఈ స్వీట్‌తో మర్యాదపూర్వకంగా అల్లుడిని, కూతురిని తమ ఇంటికి తీసుకొస్తారు. ఈ ఆచార సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తాయి.
నెలల తరబడి పాడవకుండా ఉండే ఈ మువ్వా చెక్కీలను ఎక్కువగా బరంపురంలో తయారుచేస్తుంటారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పర్లాకిమిడి వంటి ప్రాంతాల్లోనూ తయారు చేస్తున్నప్పటికి బరంపురం చెక్కీకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారయ్యే చెక్కీలను అటు బెంగళూరు, ఇటు కోల్‌కత్తా వరకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న మనవారికీ పంపిస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే దొరికే ఈ దొన్ను చెక్కీలు కేజీ, అరకేజీ, పావు కేజీల్లో రూ.40 నుంచి రూ.350 వరకు దొరుకుతాయి. ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కీ రూ.450 వరకు ధర పలుకుతోంది.
ధనుర్మాసంలో మువ్వా చెక్కీని విష్ణుమూర్తికి ఆరగింపునివ్వడం ఇక్కడి సంప్రదాయం. బెల్లం, పంచదారలో పేలాలతో పాటు పలురకాల పదార్థాలను కలిపి తయారు చేసిన
ఈ చెక్కీని శీతాకాలంలో తింటే ఆరోగ్యం!
∙ నారాయణ పాఢీ, పురోహితుడు, ఇచ్ఛాపురం
Comments
Please login to add a commentAdd a comment