అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్‌గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..
ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం.
మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్‌తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్‌లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్‌కి తగ్గ డిజైన్స్‌తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది.
జీవం పోసిన వైఎస్సాఆర్
వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్‌ఈలో దీన్నో క్లస్టర్‌గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్‌గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.
ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్‌ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.
దేశవిదేశాలకు బందరు బంగారు తీగ
మామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్‌ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్‌గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్‌కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.
నాణ్యతకూ మారుపేరు
మచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్‌కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.
∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘం
వారసత్వాన్ని కాపాడ్డానికి..
ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.
∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment