కాలం మారినా కళ తగ్గలేదు | Special Story On Machilipatnam Kalamkari | Sakshi
Sakshi News home page

కాలం మారినా కళ తగ్గలేదు

Sep 22 2024 9:16 AM | Updated on Sep 22 2024 9:16 AM

Special Story On Machilipatnam Kalamkari

కలంకారీ.. ఆధునిక ఫ్యాషన్‌లోనూ మెరుస్తున్న ప్రాచీన కళ!
ఖండాంతరాలకూ ఎగుమతి అవుతూ ఏటా కోట్ల టర్నోవర్‌ను 
సాధిస్తున్న ఈ అద్దకానికి కాణాచి మన (ఆం.ప్ర) కృష్ణా జిల్లా! 
పన్నెండేళ్ల కిందట జీఐ (భౌగోళిక సూచిక) ట్యాగ్‌నూ అందుకున్న ఈ కళపై ప్రత్యేక కథనం..  

 

 

వస్త్ర ప్రపంచంలో వన్నె తగ్గని కలంకారీ మొగలుల కాలంలో ఆదరణ పొంది, బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. రసాయనాలకు తావులేకుండా సహజసిద్ధమైన రంగులతో తయారవుతున్న ఈ అద్దకం మచిలీపట్నం కలంకారీగా వాసికెక్కింది. 1960లో పెడన వరకు విస్తరించింది. కలంకారీలో ఈ ఊరిది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వందల దుకాణాలున్నాయి. పెడనతోపాటు గూడూరు, పోలవరం, కప్పదొడ్డి తదితర గ్రామాల్లోనూ ఈ కళే ప్రధాన జీవనోపాధిగా మారి ఓ పరిశ్రమగా విరాజిల్లుతోంది. దీనిపై ఆధారపడి దాదాపు పదివేల మందికి పైగా కార్మికులు జీవిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సోకులను సంతరించుకుంటున్న ఫ్యాషన్‌ ప్రపంచం తన కేటలాగ్‌ నుంచి కలంకారీని మాత్రం రీప్లేస్‌ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు దానికున్న క్రేజ్‌ ఎలాంటిదో! 

ఇలా ప్రింట్‌ అవుతుంది..
కలంకారీ అద్దకం కోసం ముందుగా ఒక కొర్రగుడ్డను (గోధుమ వర్ణంలోని వస్త్రం) తీసుకుని దాన్ని ఒకరోజంతా నీటిలో నానబెడతారు. తర్వాత ఆ గుడ్డకు కరక్కాయ గుజ్జు పట్టించి, రోజంతా ఉంచుతారు. అనంతరం దాని మీద బ్లాక్‌ ప్రింట్‌ (పలు రంగుల్లోని డిజైన్‌ అచ్చులు) వేసి, 24 గంటల తర్వాత ఆ గుడ్డను తీస్తారు. దాన్ని పారుతున్న కాలువ నీటిలో శుభ్రం చేస్తారు. దాంతో బ్లాక్‌ ప్రింట్‌ వేసిన తర్వాత గుడ్డకు అంటిన రంగులు పోతాయి. అప్పుడు దాన్ని రాగి బానలో 45 నిమిషాల పాటు ఉడకబెడతారు. దీనివల్ల గుడ్డ మీద డిజైన్‌ మరింత చిక్కగా, వెలిసిపోకుండా తయారవుతుంది. ఇలా ఈ ప్రక్రియలో ఒక బెడ్‌షీట్‌ తయారు కావాలంటే వారం పడుతుంది. కానీ స్క్రీన్‌ ప్రింట్‌లో ( రసాయన రంగులు ఉపయోగించి చేసిన రెడీమేడ్‌ అచ్చులు) అయితే ఒక కార్మికుడు రోజుకు 6 బెడ్‌షీట్లను తయారుచేయగలడు. ఇలా అన్ని రకాల ఉత్పత్తులతో జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.50 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది.

డిజైన్లు ఇలా..
ఈ కళలో పలు పౌరాణిక కథథలను, పూల తీగలను, అమ్మాయిల నృత్య భంగిమలను డిజైన్లుగా చిత్రీకరించి, తర్వాత వాటికి వెజిటబుల్‌ డైస్‌తో రంగులు అద్దుతారు. ఇది ఆంగ్లేయుల కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రేలియా, దుబాయ్‌ తదితర దేశాల్లో కలంకారీకున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. ఆయా ప్రాంతాల నుంచి చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్, బెడ్‌షీట్లు, కుషన్‌ కవర్లకు ఆర్డర్లు వస్తుంటాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం కలంకారీ దుస్తులు వినియోగించారంటే దీని ప్రత్యేకత ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
∙ఎస్‌.పి. యూసుఫ్, 
సాక్షి, మచిలీపట్నం. 
ఫొటోలు: చక్రపాణి, విజయవాడ

పిచ్చుక వీరసుబ్బయ్యతో మొదలు..
పెడనలో కలంకారీ వస్త్రాల తయారీని  తొలిసారిగా పిచ్చుక వీరసుబ్బయ్య ప్రారంభించారు. నేటికీ ఆయన వంశస్థులు ఇందులో కొనసాగుతున్నారు. ప్రకృతిసిద్ధమైన రంగులతో ఈ కళకు జీవం పోస్తున్నారు.

మూడుతరాలుగా ఇందులోనే.. 
పెడనలో కలంకారీని మా నాన్న పిచ్చుక వీరసుబ్బయ్య మొదలుపెట్టారు. ఇక్కడ తయారైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి కావాలన్నది మా నాన్న కోరిక. ఈ కళ మా ఇంట్లో వారసత్వంగా కొనసాగుతోంది. ప్రస్తుతం నేను, మా అబ్బాయి పిచ్చుక వరుణ్‌కుమార్‌ ఇద్దరం ఇదే రంగంలో ఉన్నాం. మా అబ్బాయి బీటెక్‌ పూర్తి చేశాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్వతహాగా ఇంకో పది డిజైన్లు తయారు చేశాడు. వీటికి విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది.
– పిచ్చుక శ్రీనివాస్, పెడన.

16 ఏళ్లుగా.. 
ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. పెళ్లికి ముందు నుంచే అంటే 16 ఏళ్లుగా ఈ అద్దకం చేస్తున్నాను. చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్, చున్నీలు,  బెడ్‌షీట్లపై కలంకారీ ప్రింట్‌ వేస్తాను. యజమానులు సూచించిన, డిమాండ్‌లో ఉన్న డిజైన్లను చేతితో అచ్చు వేస్తాను.
– ఈడే వెంకటలక్ష్మి, పెడన.

ప్రభుత్వం ఆదుకోవాలి  
ఫ్యాషన్‌ మార్కెట్‌లో కలంకారీకి ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు. అయితే పెరిగిన ముడి సరుకుల ధరలతో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నాం. తగిన కూలీ లేక చాలా మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు. ఈ పరిశ్రమ కొనసాగాలంటే దీనిని ప్రభుత్వం ఆదుకోవాలి.
– యర్ర టార్జ¯Œ  రావు, వస్త్ర వ్యాపారీ, పెడన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement