kalamkari clothes
-
కాలం మారినా కళ తగ్గలేదు
వస్త్ర ప్రపంచంలో వన్నె తగ్గని కలంకారీ మొగలుల కాలంలో ఆదరణ పొంది, బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. రసాయనాలకు తావులేకుండా సహజసిద్ధమైన రంగులతో తయారవుతున్న ఈ అద్దకం మచిలీపట్నం కలంకారీగా వాసికెక్కింది. 1960లో పెడన వరకు విస్తరించింది. కలంకారీలో ఈ ఊరిది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వందల దుకాణాలున్నాయి. పెడనతోపాటు గూడూరు, పోలవరం, కప్పదొడ్డి తదితర గ్రామాల్లోనూ ఈ కళే ప్రధాన జీవనోపాధిగా మారి ఓ పరిశ్రమగా విరాజిల్లుతోంది. దీనిపై ఆధారపడి దాదాపు పదివేల మందికి పైగా కార్మికులు జీవిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సోకులను సంతరించుకుంటున్న ఫ్యాషన్ ప్రపంచం తన కేటలాగ్ నుంచి కలంకారీని మాత్రం రీప్లేస్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు దానికున్న క్రేజ్ ఎలాంటిదో! ఇలా ప్రింట్ అవుతుంది..కలంకారీ అద్దకం కోసం ముందుగా ఒక కొర్రగుడ్డను (గోధుమ వర్ణంలోని వస్త్రం) తీసుకుని దాన్ని ఒకరోజంతా నీటిలో నానబెడతారు. తర్వాత ఆ గుడ్డకు కరక్కాయ గుజ్జు పట్టించి, రోజంతా ఉంచుతారు. అనంతరం దాని మీద బ్లాక్ ప్రింట్ (పలు రంగుల్లోని డిజైన్ అచ్చులు) వేసి, 24 గంటల తర్వాత ఆ గుడ్డను తీస్తారు. దాన్ని పారుతున్న కాలువ నీటిలో శుభ్రం చేస్తారు. దాంతో బ్లాక్ ప్రింట్ వేసిన తర్వాత గుడ్డకు అంటిన రంగులు పోతాయి. అప్పుడు దాన్ని రాగి బానలో 45 నిమిషాల పాటు ఉడకబెడతారు. దీనివల్ల గుడ్డ మీద డిజైన్ మరింత చిక్కగా, వెలిసిపోకుండా తయారవుతుంది. ఇలా ఈ ప్రక్రియలో ఒక బెడ్‌షీట్ తయారు కావాలంటే వారం పడుతుంది. కానీ స్క్రీన్ ప్రింట్లో ( రసాయన రంగులు ఉపయోగించి చేసిన రెడీమేడ్ అచ్చులు) అయితే ఒక కార్మికుడు రోజుకు 6 బెడ్షీట్లను తయారుచేయగలడు. ఇలా అన్ని రకాల ఉత్పత్తులతో జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.50 కోట్ల టర్నోవర్ జరుగుతోంది.డిజైన్లు ఇలా..ఈ కళలో పలు పౌరాణిక కథథలను, పూల తీగలను, అమ్మాయిల నృత్య భంగిమలను డిజైన్లుగా చిత్రీకరించి, తర్వాత వాటికి వెజిటబుల్ డైస్‌తో రంగులు అద్దుతారు. ఇది ఆంగ్లేయుల కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో కలంకారీకున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. ఆయా ప్రాంతాల నుంచి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, కుషన్ కవర్లకు ఆర్డర్లు వస్తుంటాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం కలంకారీ దుస్తులు వినియోగించారంటే దీని ప్రత్యేకత ఎలాంటిదో తెలుసుకోవచ్చు.∙ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. ఫొటోలు: చక్రపాణి, విజయవాడపిచ్చుక వీరసుబ్బయ్యతో మొదలు..పెడనలో కలంకారీ వస్త్రాల తయారీని తొలిసారిగా పిచ్చుక వీరసుబ్బయ్య ప్రారంభించారు. నేటికీ ఆయన వంశస్థులు ఇందులో కొనసాగుతున్నారు. ప్రకృతిసిద్ధమైన రంగులతో ఈ కళకు జీవం పోస్తున్నారు.మూడుతరాలుగా ఇందులోనే.. పెడనలో కలంకారీని మా నాన్న పిచ్చుక వీరసుబ్బయ్య మొదలుపెట్టారు. ఇక్కడ తయారైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి కావాలన్నది మా నాన్న కోరిక. ఈ కళ మా ఇంట్లో వారసత్వంగా కొనసాగుతోంది. ప్రస్తుతం నేను, మా అబ్బాయి పిచ్చుక వరుణ్‌కుమార్ ఇద్దరం ఇదే రంగంలో ఉన్నాం. మా అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్వతహాగా ఇంకో పది డిజైన్లు తయారు చేశాడు. వీటికి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.– పిచ్చుక శ్రీనివాస్, పెడన.16 ఏళ్లుగా.. ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. పెళ్లికి ముందు నుంచే అంటే 16 ఏళ్లుగా ఈ అద్దకం చేస్తున్నాను. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చున్నీలు, బెడ్షీట్లపై కలంకారీ ప్రింట్ వేస్తాను. యజమానులు సూచించిన, డిమాండ్‌లో ఉన్న డిజైన్లను చేతితో అచ్చు వేస్తాను.– ఈడే వెంకటలక్ష్మి, పెడన.ప్రభుత్వం ఆదుకోవాలి ఫ్యాషన్ మార్కెట్లో కలంకారీకి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. అయితే పెరిగిన ముడి సరుకుల ధరలతో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నాం. తగిన కూలీ లేక చాలా మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు. ఈ పరిశ్రమ కొనసాగాలంటే దీనిని ప్రభుత్వం ఆదుకోవాలి.– యర్ర టార్జ¯Œ రావు, వస్త్ర వ్యాపారీ, పెడన. -
అయోధ్య బాలరామునికి పెడన కలంకారి వస్త్రాలు
పెడన: అయోధ్య బాలరాముని ఆలయానికి కృష్ణా జిల్లా పెడన నుంచి సహజ సిద్ధ కలంకారి వస్త్రాలను పంపించగా వాటిని మంగళవారం అలంకరించినట్లు పెడన కోరమండల్ కలంకారి వస్త్ర సంస్థ యాజమాని పిచ్చుక వరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. అయోద్య బాలరాముని ఆలయానికి చెందిన డిజైనర్ సహజ సిద్ధ కలంకారి వస్త్రాలు కావాలని కోరడంతో ఇటీవల ఆల్ ఆవర్, ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన ఎరుపు వస్త్రాన్ని పంపించామన్నారు. 10.5 మీటర్ల వస్త్రాన్ని స్వామి వారికి అలంకరించి ఆలయ వర్గాలు ఫొటోలు పంపించారని తెలిపారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్ కలర్, శనివారం నీలం, ఆదివారం పింకు రంగులలోని వస్త్రాలను కావాలని సూచించారని, ప్రస్తుతం ఎరుపు రంగు వస్త్రాన్ని డిజైన్ చేసి పంపించామన్నారు. మిగిలిన రంగులలో వస్త్రాలను కూడా త్వరలోనే పంపుతామన్నారు. డాక్టర్ వైఎస్సార్ లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు కుమారుడినయిన తనకు ఈ అవకాశం రావడం స్వామి అనుగ్రహమని వరుణ్ కుమార్ తెలిపారు. -
Fashion: ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ.. కలంకారీ ప్రింట్లున్న బ్లౌజ్ సరైన ఎంపిక!
అమ్మవారి అలంకరణ రోజుకొక హంగుగా దర్శనమిస్తుంది. అమ్మవారి రూపంగా భావించే మహిళలూ ఈ వేడుకల్లో తమ ఆహార్యమూ అదిరిపోవాలనుకుంటారు. దాండియా ఆటపాటల్లో పాల్గొనడానికి ప్రతిరోజూ ప్రత్యేకమైన దుస్తుల ఎంపిక తప్పనిసరి అనుకుంటారు. అయితే, డ్రెస్ ఎంపిక కుదరడం లేదు అనుకున్నవారికి మనవైన కలంకారీ ప్రింట్లు ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నిరకాల చీర కట్టుకు సరైన ఎంపిక అవుతుంది. రూపాన్ని కళగా మార్చేస్తుంది. ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ ఏ మెటీరియల్ అయినా.. రంగులు భిన్నమైనా.. ఒక్క కలంకారీ బ్లౌజ్ తీరైన కళను తీసుకువస్తుంది. దీనికి సిల్వర్ జ్యువెలరీ సరైన ఎంపిక అవుతుంది. సాధారణ మోడల్ లేదా మోడర్న్ కట్, లాంగ్ జాకెట్ అయినా.. డిజైన్ల ఎంపికలో కలంకారీకి సాటి లేదన్నది ఈ వేడుకలో కనిపిస్తుంటుంది. కళగా ఉండాలనుకునేవారు కలంకారీ ధరిస్తే చాలు నవరాత్రుల్లో నవ్యంగా వెలిగిపోతారు. -
Narayanpet Sarees: కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కలు.. రంగురంగుల చీరలు!
తెలంగాణలో నారాయణపేట పేరు వినగానే అక్కడి చేనేత చీరలు కళ్లముందు నిలుస్తాయి. వాటి ఘనత గురించి కాసేపయినా మాట్లాడుకోకుండా ఉండలేం. మగువల మనసులను అకట్టుకునే విధంగా నేతకారులు మగ్గాల పై పట్టు, కాటన్ చీరలను నేయడంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇక నుంచి నారాయణపేట చేనేతలకే కాదు, తమ ప్రాంత చిత్రకళా వైభవాన్ని చెప్పుకునేలా కృషి చేస్తూ తమ కలలకు కళానైపుణ్యాన్ని జత చేస్తున్నారు ఇక్కడి మహిళలు. భారతీయ హస్తకళలో కలంకారీ చిత్రకళ ప్రాచీనమైనది. ఇప్పటి వరకు ఈ కళ గురించి ప్రస్తావన వస్తే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, శ్రీకాళ హస్తి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ప్రపంచ మార్కెట్లో కలంకారీ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నారాయణపేటలో మహిళలు శిక్షణ పొందుతున్నారు. వస్త్రాలపై కలంకారీ పెయింటింగ్‌తో పాటు బ్లాక్ ప్రింటింగ్ కూడా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. మహిళల ప్రతిభ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవారు నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నాబార్డు సహకారంతో, డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలంకారీలో 60 మంది మహిళలకు 80 రోజుల పాటు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణ ఇస్తోంది. బ్లాక్ ప్రింటింగ్‌పై 30 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. రంగులు అద్దుతున్నారిలా... వెదురు పుల్లలకు దూది చుట్టి బ్రష్‌లా చేసుకొని.. చింతపుల్లలను కాల్చి, నల్లబెల్లం వాడుతూ, పాలు, పటిక పొడి కలిపిన ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టి, జాడించి, సబ్బునీళ్లలో ఉతికి ఆరబెడతారు. తొలిసారి చిత్రణ పూర్తయ్యాక పారుతున్న నీళ్లలో ఆరవేసినట్టుగా ఆ వస్త్రాన్ని పట్టుకుంటారు. మొదటి దశలో ఎరుపు, నలుపు రంగులను వాడుతారు. ఆ తర్వాత డిజైన్‌కు సంబంధించిన రంగులన్నీ ఉపయోగిస్తారు. అన్నీ సహజమైన రంగులే! కలంకారీ డిజైన్‌లో ప్రధానంగా వాడే నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కోసం తుమ్మజిగురు, కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కల ద్వారా తీసిన సహజమైన రంగులను వాడుతున్నారు. ఆకట్టుకుంటున్న వస్త్రాలు యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్న ఈ ప్రక్రియతో కలంకారీ పెయింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతామని మహిళలు, యువతులు చెబుతున్నారు. దుపట్టాలు, చీరలు, టేబుల్ క్లాత్స్, బ్యాగ్స్ పై ఈ పెయింటింగ్‌తో అందమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులు సర్టిఫికేట్లను అందుకోవడంతో పాటు ఈ కళలో నిమగ్నమయ్యారు. నారాయణపేట చేనేతలకు ప్రసిద్ది. ఇక్కడి చేనేత కార్మిక మహిళలు, యువతులు చదువుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవాలనే లక్ష్యంతో కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌పై శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాంత మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్ చీరలు మార్కెట్లోకి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతిని సాధించనున్నారు. – దాసరి హరిచందన, జిల్లా కలెక్టర్, నారాయణపేట ఉపాధికి ఊతం నేను మెహిందీ డిజైనర్‌ని. డ్రాయింగ్‌తో పాటు చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తుంటాను. దీంతో కలంకారీ చిత్రణ నేర్చుకోవడం నాకు చాలా సులభమైంది. ఇప్పటికే కలంకారీ కాటన్, పట్టు చీరల వ్యాపారం చేస్తున్నాను. ఈ డిజైన్ చీరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్వయంగా డిజైన్ చేసి నారాయణపేట చీరలంటే మరింత ఆదరణ పొందేందుకు కృషి చేస్తున్నాను. – అశ్విని కళ్యాణి, నారాయణపేట మంచి భవిష్యత్తు నేను డిగ్రీ చేస్తున్నాను. వస్త్రాలపై డిజైనింగ్‌కు అంతటా మంచి ఆదరణ ఉండటంతో చదువుతో పాటు కలంకారీ పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. ఇది నా భవిష్యత్తును మరింత కళగా మార్చుతుందని ఈ పెయింటింగ్‌లో మెళకువలు తెలుసుకున్నాక అర్ధమైంది.– వైష్ణవి ప్రత్యేకమైన డిజైన్ నేను పీజీ పూర్తిచేశాను. వస్త్రాలపై రకరకాల డిజైన్లు వేయడం కొన్నేళ్లుగా చేస్తున్నాను. నా ‘కళ’కు ఇప్పుడీ కలంకారీ శిక్షణ తోడవడంతో మెరుగైన ఫలితాలు పొందుతానన్న పూర్తి నమ్మకం వచ్చేసింది. ఇక్కడి నుంచి ప్రపంచమార్కెట్లోకి మరింత విస్తృతంగా వెళ్లగలం. – లత, నారాయణపేట శిక్షణ ఇస్తున్నా! నేను బీఎస్సీ చదివాను. బ్లాక్ పెయింటింగ్ నేర్చుకున్నా. కాటన్, పట్టు వస్త్రాలపై అద్దకం డిజైన్లు మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నాను. స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి శిక్షణ ఇచ్చేవిధంగా సిద్ధమైనందుకు ఆనందంగా ఉంది. – శ్వేత, నారాయణపేట – కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, నారాయణపేట, సాక్షి చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
Half Saree: వేడుక వేళ సంప్రదాయ కళ
మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ కొంచెం వెనకంజ వేసినా.. పండగలు, వ్రతాలు, పెళ్లిళ్లు అంటూ ఇప్పుడిప్పుడే సందడి మొదలయ్యింది. వేడుకల వేళ వైవిధ్యంగా వెలిగిపోవాలంటే లంగా ఓణీ జోడీ కట్టాల్సిందే. ఆధునికపు హంగులు కోరుకునే నవతరమైనా సంప్రదాయ కట్టుతో మెరిసిపోవాల్సిందే! వేడుకల్లో మనదైన మార్క్ కనిపించాలంటే కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు. ప్లెయిన్ లెహంగా మీద లైట్‌వెయిట్ పట్టు శారీని ఓణీలా కట్టుకోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం వంటి రంగుల ఎంపిక, టెంపుల్ జ్యువెలరీతో చక్కని సంప్రదాయ కళ తీసుకురావచ్చు. కంచిబార్డర్ను హాఫ్‌వైట్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ జత చేసిన లెహంగా, అంచులు ఎంబ్రాయిడరీ చేసిన ఓణీ, మగ్గం వర్క్ బ్లౌజ్.. ఈ పర్పుల్ కాంబినేషన్ వేడుకకు వన్నెతెస్తుంది. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి కంచిబార్డర్ జత చేసి, అదే రంగు మగ్గం వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ దుపట్టా వేయడంతో మంచి కళ వచ్చేసింది. వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్లెయిన్ హాఫ్‌వైట్ రాసిల్క్ మెటీరియల్పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డిజైన్ చేసిన లెహంగా. మగ్గం వర్క్ చేసిన రెడ్ కలర్ ట్యునిక్, నెటెడ్ దుపట్టాతో సంప్రదాయ కట్టుతోనే ఆధునికపు హంగులు తీసుకురావచ్చు. సంప్రదాయ డ్రెస్సులోనే ఆధునికంగా కనిపించాలనుకుంటే ఫిష్‌కట్ లెహంగాలు సెట్అవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, జర్దోసీ వర్క్ చేసిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్, నెటెడ్ ఓణీ ముచ్చటైన కాంబినేషన్‌గా ఆకట్టుకుంటుంది. - రజితారాజ్ రావుల డిజైనర్, హైదరాబాద్ -
Summer Collection: ఇండియన్ కలంకారీ
చీర మొదటిసారి కట్టుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ లుక్స్ అప్డేట్ చేసుకోవాలనుకునే మగువలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వేడుకలకు హాజరయ్యే అతివలు ఇలా కలంకారీ శారీ, క్రాప్‌టాప్ ధరించి కొత్తగా మెరిసిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి పెన్‌కలంకారీ కళకు ప్రసిద్ధి. కాటన్ చీరల మీద వేసే కలంకారీ డిజైన్‌లో పూర్తిగా సేంద్రీయ రంగులు వాడుతుంటారు. ఏ కాలమైనా మేనికి హాయినివ్వడంతో పాటు, ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించడం కలంకారీ ప్రత్యేకత. ఈ స్పెషల్ శారీకీ ఇంకొన్ని స్టైలిష్ హంగులు అద్దితే మోస్ట్ బ్యూటిఫుల్ అనకుండా ఉండలేరు. మిడీస్, స్కర్ట్స్ మీదకు వాడే క్రాప్‌టాప్స్.. షర్ట్ స్టైల్ లాంగ్ బ్లౌజులను ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా, బొద్దుగా ఉన్నవారు కూడా ఈ స్టైల్‌ని ఎంచక్కా ఫాలో అవ్వచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ స్టైల్ కాబట్టి బంగారు ఆభరణాలకన్నా ఫంకీ జ్యువెలరీ మరింత వన్నె తీసుకొస్తుంది. టెర్రకోట, జర్మన్ సిల్వర్, ఫ్యాబ్రిక్.. ముఖ్యంగా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. మేకప్‌తో పెద్దగా పనిలేదు. హెవీగా మేకోవర్ అంతకన్నా అవసరం లేదు. సింపుల్ అండ్ స్టైలిష్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. ఈ వేసవి వేడుకలను మరింత హాయిగా ఎంజాయ్ చేయచ్చు. హేమంత్ సిరీ ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్ మరిన్ని డిజైన్లు.. Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్కేర్.. Fashion: చేనేతలతో సీజన్ వేర్ చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది? -
చేనేత పరవళ్లు
కుటీర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండేది చేనేత పరిశ్రమలే... నూలు నుంచి రాట్నం మీదుగా మగ్గం ద్వారా అద్భుతమైన డిజైన్లను.. నాణ్యమైన వస్త్రాలను అందించటంలో చేనేత కార్మికులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అగ్గిపెట్టెలో పట్టేంత ఆరడుగుల చీరను నేయగలిగిన సిద్ధహస్తులు తెలుగురాష్ట్రాల్లోని చేనేత కార్మికులు. కృష్ణానదీ తీరాన ఉన్న చేనేత పరిశ్రమలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పూర్వ వైభవాన్ని ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాయి. తెలుగురాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. కృష్ణానదీతీరాన ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న పెడన కలంకారీ కళ, తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లోని గద్వాల్, నారాయణపేట వంటి ప్రాంతాలు చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు. మంగళగిరి చేనేత గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగన్నది. ఇక్కడ ప్రత్యేక పద్ధ్దతులతో పత్తి నుంచి వస్త్రాలను చేయటం తరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. పత్తిలోని గింజలను తొలగించి వాటిలోని మలినాలను చేప దంతాల ద్వారా శుభ్రం చేసి ఏకుతారు. అలా ఏకిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం ఉపయోగించి పత్తి నుంచి దారం తీస్తారు. దారాల్లో గంజిని ఉపయోగించి గట్టిదనం వచ్చేంత వరకు సరిచేసి, మగ్గంతో వస్త్రాలను నేయటంలో ఇక్కడి వారు సిద్ధ్దహస్తులు. 1980 కాలంలో మంగళగిరి చేనేతకు స్వర్ణయుగం అని చెప్పాలి. అప్పటి నుంచి 2000వ సంవత్సరం వరకు మంగళగిరి చేనేతకు ఢోకా లేకుండా పోయింది. అనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అప్పట్లో ఇతర ప్రాంతాల నుంచి శుభకార్యాల కోసం ఇక్కడికి వచ్చి మరీ దుస్తులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ కామర్స్, ప్రత్యేక వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా ఇక్కడి వ్యాపారులు ఆన్లైన్లో వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ‘పోచంపల్లి ’ తెలంగాణలో చేనేతలకు పురిటిగడ్డగా పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలోని నల్లగొండలో భూదాన్‌పోచంపల్లిగా పేరొందిన పోచంపల్లి చేనేతకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది. 1965కి ముందు ఈ గ్రామంలో గాజులు, పూసలను తయారు చేసి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు.. కాలక్రమేణా ఈ వృత్తి అంతరించటంతో ఇక్కడ ఉన్న పద్మశాలీలు కొందరు రుమాళ్లను, కాటన్ చీరలను నేయడం ప్రారంభించారు. 1974లో పోచంపల్లికి చెందిన కొంతమంది నేతకారులు తమిళనాడులోని తంజావూరులో పట్టు వస్త్రాల నేతలో శిక్షణ పొందారు. తర్వాతి కాలంలో పోచంపల్లి నేతలు పటోలా డిజైన్ చీరల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందాయి. పోచంపల్లి వస్త్రాల నేతల్లో 11 డిజైన్లు పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయి. గద్వాల చీరలు ఈ చీరలు కాస్తంత బరువుగా ఉంటాయి. ఇవి కాటన్, సిల్క్ కాంబినేషన్‌తో తయారవు తాయి. బంగారం, వెండి పూతలతో చీర అంచులను అందంగా నేయడం ఇక్కడి నేతగాళ్లకు కొట్టిన పిండి. ఈ చీరలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు, తిరుపతి వెంకన్న స్వామికి ఇక్కడి నుంచి ప్రతి ఏడాదీ పట్టు వస్త్రాలు వెళ్తుంటాయి. నారాయణపేట పట్టుచీరలు చీరంతా ఒకే రంగులో ఉండి, అంచు మాత్రం బంగారు రంగులో ఉంటుంది. దాన్ని బట్టి చీరను చూడగానే, అది నారాయణపేట చీరే అని గుర్తుపట్టొచ్చు. అలాగే ఈ చీరలకు అడ్డం, నిలువులో చిన్న నుంచి పెద్ద సైజు గీతలు ఉంటాయి. ఈ చీరలకు పూర్తి నేచురల్ కలర్స్‌నే వాడతారు. మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం ఈ చీరలను కట్టినవారే. ఇక్కడి నేతగాళ్లు నేసిన కాటన్ చీరలు కూడా బాగా ప్రసిద్ధి పొందాయి. పెడన కలంకారి కలంకారి వన్నె తగ్గని సంస్కృతిగా, దేశంలోని మచిలీపట్నం కలంకారిగా పేరు.. 15వ శతాబ్దంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల పాలన కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్ విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నా యంటే ఈ అద్దకం విధానం గొప్పతనంతో పాటు వినియోగిస్తున్న సహజ రంగులే అందుకు కారణం. బ్రిటిష్ కాలంలో మచిలీపట్నంలోనే కలంకారి పరిశ్రమలు ఉండేవి. తరువాత కాలంలో బ్రిటిష్‌వారి విధానాలతో మూతపడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం కమలాభాయ్ చటోపాధ్యాయ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కలంకారీకి పునరుత్తేజం వచ్చింది. అయితే అప్పటికే ఈ పరిశ్రమ మచిలీపట్నం నుంచి పెడనకు వెళ్లిపోయింది. అయినప్పటికీ మచిలీపట్నం కలంకారీగానే పేటెంట్ పొందటంలో విదేశాల్లో పేరు పొందింది. యూరప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా ఖండాల్లోనూ ఈ దుస్తులకు మంచి డిమాండ్ ఉంది. కలంకారీ విధానం మచిలీపట్నం కలంకారీ కళలో అచ్చు వేయాల్సిన అద్దకం మూసలను పెద్ద చెక్కముక్కలతో తయారు చేస్తారు. దీనికి కూరగాయలతో తయారు చేసిన సహజ రంగులను చీరలు, ఇతర దుస్తులపై అద్దకం రంగులు వేస్తారు. ఈ చిత్రాల్లో పురాణగాథల నుంచి నేటి ట్రెండీ థీమ్స్ వరకు వివిధ ఆకృతులను చిత్రిస్తారు. ఒక డిజైన్ చేయటానికి చాలా రోజులు పడుతుంది. అద్దకం మరియు చేతితో అచ్చు వేయడం అనే ప్రక్రియ చాలా విసృ్తతమైనది. పూర్తిగా ఒక వస్త్రంపై కలంకారీ చేయటానికి అనేక దశలు ఉన్నాయి. అనేక రకాలుగా ప్రింటింగ్ స్టైల్స్ కన్నా కలంకారీ వస్త్రానికి మంచి డిమాండ్ ఉంది. వస్త్రం యొక్క నాణ్యతను బట్టి దానిపై వేయవలసిన రంగులు కూడా వివిధ రకాలుగా మారుస్తారు. ప్రతి దశలోనూ దానికి పట్టి ఉంచే రంగులను శుభ్రం చేసి దానిపై పట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కలంకారీలో ముఖ్యంగా నాలుగు రంగులు వినియోగిస్తారు. ఎరుపు రంగును భారతీయ మేదర చెట్టు నుంచి తీస్తారు. అలాగే పసుపు రంగును దానిమ్మ గింజల నుంచి లేదా మామిడి చెట్టు బెరడు నుంచి తీస్తారు. నీలం రంగును ఇండిగో (నీలిమందు చెట్టు) నుంచి, నలుపు రంగును మైరో బాలన్ పండు నుంచి తీస్తారు. నాణ్యత పెంపు కలంకారీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు సహజ సిద్ధ్దమైన రంగులతో లినెన్ వస్త్రంపై చెక్క అచ్చులు (బ్లాక్స్) అద్దకంతో డిజైన్లు ముద్రించేవారు. కోల్‌కత్తాకు చెందిన ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ గ్రూపులోని జయశ్రీ టెక్స్టైల్స్ (జేఎస్టీ) కలంకారీ వస్త్రాలను మరింత నాణ్యతతో వేగంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. జియోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిస్ట్రీ (జీఐఆర్) పెడన గ్రామంలోని వె జిటబుల్ డై హ్యాండ్ బ్లాంక్ కలంకారీ ప్రింటర్స్ వెల్ఫేర్ అసొసియేషన్ సభ్యులు చెన్నై నుంచి కలంకారీ పరిశ్రమకు ‘జియాగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ’(జీఐఆర్)ను పొందారు. దీని ఫలితంగా మచిలీపట్నం కలంకారీగా గుర్తింపు పొందింది. పెడన గ్రామం మచిలీపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెడన పట్టణం, దాని అనుబంధ గ్రామాలైన పోలవరం, కప్పలదొడ్డిలో మాత్రమే కలంకారీ అద్దకాలు రూపొందుతాయి. - రత్నబాబు మోత్రపు సాక్షి, విజయవాడ వన్నె తగ్గని కళ ఎన్ని రకాల యంత్రాలు, పరికరాలు వచ్చిన చేనేత రంగంలో మాత్రం కలంకారిదే అధిక ప్రాధాన్యత. మా నాన్నగారి నుంచి మాక వారసత్వంగా వచ్చింది. 1950 నుంచి మా కుటుంబం కలంకారిపైనే జీవనాధారంగా ఉంది. ఇప్పటి వరకు పలు కార్పోరేట్ సంస్థలకు దుస్తులను, దుప్పట్లను, కర్టెన్లను పంపిణీ చేస్తున్నాం. హస్తకళ ఉన్నంతకాలం కలంకారి ఉంటుంది. - నాగేంద్ర, కలంకారి కళాకారుడు