
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?..
విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు.