Telangana Politics
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
నా ఇంటిపై ఏసీబీ దాడులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని, తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన.సోమవారం ఉదయం తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులను నిలదీశారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే.. అందుకే లాయర్‌తో వచ్చా. నాతో పాటు లాయర్ వస్తే వాళ్లకేంటి(పోలీసులకు) ఇబ్బంది ఏంటి. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో జరిగిందే నా విషయంలో జరగబోతోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదు.. నిజాయితీగా ఉన్నా. అందుకే చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా.రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఎందుకీ డ్రామాలు(కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది). అయినా నేను కేసులకు భయపడను. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతాం’’ అని కేటీఆర్ అన్నారు. -
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
హైదరాబాద్, సాక్షి: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, నటుడు అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి.. పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు భంగపాటే ఎదురైంది. సోమవారం ఉదయం గాంధీభవన్‌కు చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లోనూ పని చేశారు. ప్రస్తు కాంగ్రెస్ నుంచి నాగార్జున సాగర్ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి 2011 మార్చి 6వ తేదీన వివాహం జరిపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది.ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో హైడ్రామా -
Allu Arjun Controversy: రాజకీయ రగడ
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణ ‘రాజకీయ చిచ్చు’ రాజేసింది. నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ఆదివారం రాళ్ల దాడికి దిగగా.. ఘటనను ఖండిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అల్లు అర్జున్ తీరును అధికార కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎవరేమన్నారంటే..సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. .. అల్లు అర్జున్‌కు ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు రద్దు చేస్తున్నామని.. టికెట్ ధరల పెంపునకు అను మతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్, పేద ఆరి్టస్టులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే సంధ్య థియేటర్ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ చెప్పారు. కానీ ఆయన రియల్ హీరోలా కాకుండా.. రీల్ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఎంపీ కిరణ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్జున్ ఏదో స్క్రిప్టు తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. అసలాయనేం చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకుని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు.. అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు. వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారశైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణం ఐసీయూలో ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్న విషయం అరవింద్‌కు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమరి్థంచుకోకుండా సరిదిద్దుకోవాల ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎలీ్పలో ఆయ న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అల్లు అర్జున్ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: 'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తారా? : బీఆర్ఎస్ నేత శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను వదిలేసి.. సినిమా పరిశ్రమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వారు ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించక, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. వాటిపై చర్చ జరపకుండా అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్ను తిట్టేందుకు గంటల కొద్దీ సమయం కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేవాల యం లాంటి చట్టసభలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులతో పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతుంటే ఎన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆదివారం రాత్రి సంజయ్ పరామర్శించారు. అనంతరం బాలుని తండ్రితో కొద్దిసేపు మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బండి వెంట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు ఉన్నారు. పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలుతీస్తాం పంజాగుట్ట (హైదరాబాద్): సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి స స్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి, తొక్కిసలాటలో మహిళ చనిపోయి, పసిపిల్లాడు ప్రాణాపాయస్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్లిపోయిన అల్లు అర్జున్‌కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్‌కు వెళ్ల్లలేకపోతున్నాననే ఆవేదనే తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు’’అని ఓ ప్రెస్మీట్లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటతో ఎవరికీ సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం: డీజీపీ ఆఫీసు డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. -
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్‌కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్‌లో చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్‌కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్‌కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్‌కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్‌కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్‌నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్‌ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్‌కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్‌గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్‌కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
రాహుల్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీని.. అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బూతులు తిట్టినా, అవమానించినా కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూనే ఉంటామని, తమకు పోరాటం కొత్తకాదని కేటీ రామారావు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్‌నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ గుర్తు చేశారు. ‘మీరు ఇచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల ప్రకటనను నమ్మి యువత కాంగ్రెస్‌కు ఓటు వేసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఉద్యోగాలు లేని కేలండర్‌ను జారీ చేశారు. మళ్లీ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచ్చి మీ హామీని ఎలా నెరవేరుస్తారో యువతకు చెప్పండి’.. అని కేటీఆర్ పోస్టు చేశారు. జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ అరెస్టయి బండ్లగూడ పోలీసు స్టేషన్లో ఉన్న 70 మంది యువతతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాట స్ఫూ ర్తిని చూపుతున్నారు. కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతాం’.. అని భరోసానిచ్చారు. -
రైతుకు వెన్నుపోటు.. పథకాలకు తూట్లు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని, రైతులను పొగుడుతున్నట్టుగా పొగుడుతూనే ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాల్లో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా చెప్పి రైతులను మోసం చేశారని, ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం గురువారం మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నైజాన్ని బయటపెట్టుకున్నది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పథకంపై స్పష్టత లేదు. గొర్రెల పథకం లేదు..దళితబంధు లేదు యాదవులకు ఇస్తున్న గొర్రెల పెంపకం పథకాన్ని మొత్తానికి మూసేసినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే యాదవులు చెల్లించిన డిపాజిట్లు కూడా వాసప్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. కొత్త విషయం ఏమీలేదు. అత్యంత బడుగువర్గాలకు మేలు చేస్తున్నట్టుగా చెబుతూనే గొంతు కోసింది. దళితవర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. ఇదీ చాలా దురదృష్టకరం. దళిత సమాజంపై ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అవసరం లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఏ ఒక్కవర్గానికి కూడా ఈ బడ్జెట్లో భరోసా లేదు. బడ్జెట్లో విశేషమేమిటంటే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క డబ్బుల గురించి చెప్పినప్పుడు ప్రతిమాటను ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీలేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా లేని పరిస్థితి వచ్చింది. మహిళల పట్ల కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ దీనిని కూడా లక్ష కోట్ల రుణాలు అంటూ వీళ్లేదో ఇస్తున్నట్టు చెప్పారు. ఉన్న స్కీంను చెప్పారే తప్ప..కొత్తగా ఏమీలేదు. వెరసి ఇది పాతదే. దురదృష్టం ఏమిటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఆరుమాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ, ఈ రోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీకి ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటికీ పాలసీ పార్ములేషన్ చేసేటట్టుగా కనిపిస్తలేదు. ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం..చెడగొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్ సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది’అని కేసీఆర్ అన్నారు. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం ‘ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి? ఏం లేదు వట్టిదే గ్యాస్..ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది తప్ప ఏం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి ? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేదవర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక్కదానిపై కూడా స్పష్టత లేదు. చిల్లరమల్లర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా.. నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు.. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం’అని కేసీఆర్ తేల్చి చెప్పారు. -
ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: హరీశ్‌రావు
రామచంద్రాపురం (పటాన్చెరు): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భారతీనగర్ కార్పొరేటర్ సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోమన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పారీ్టకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడతామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్‌కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఉంటే, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతున్నారన్నారు. ఆయన చెప్పిన మా టలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రావ డం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఐదేళ్లకు మించి ఏ రాష్ట్రంలో అధికారంలో లేద న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.హరీశ్.. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కండువాతో మాజీమంత్రి హరీశ్‌రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ కండువాతో హరీశ్ కనిపించడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందా? అని స్థానిక కార్యకర్తలు, స్థానికులు చర్చించుకుంటున్నారు. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన మేర సీట్లు రాలేదని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా కలసి రాలేదని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించేందుకు హైకమాండ్ పంపిన కురియన్ కమిటీకి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తోపాటు అస్సాం ఎమ్మెల్యే రకీబుల్ హుస్సేన్ గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. మూడు రోజుల షెడ్యూల్లో భాగంగా తొలి రోజు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులతో వీరిరువురూ భేటీ అయ్యారు. 17 మంది అభ్యర్థులకుగాను 16 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న కారణంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కమిటీ ముందుకు రాలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు కూడా కురియన్ కమిటీని మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తం సీన్ మారిపోయింది... తొలి రోజు షెడ్యూల్లో భాగంగా ఉదయమే గాం«దీభవన్‌లో కురియన్ కమిటీ ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, ఓడిపోయిన అభ్యర్థులు ఆత్రం సుగుణ, దానం నాగేందర్, సఫీవుల్లా, సునీతా మహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెల్చాల రాజేందర్రావు, చల్లా వంశీచందర్‌రెడ్డి, నీలం మధు, జీవన్‌రెడ్డిలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగిందని, కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా జరిగిందని వెల్లడించినట్టు తెలిసింది. ‘అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు లోక్‌సభ ఎన్నికల్లో లేవు. పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. బీఆర్ఎస్ బాహాటంగానే బీజేపీకి మద్దతిచ్చింది. తాము గెలవకపోయినా కాంగ్రెస్ గెలవొద్దని, బీజేపీని గెలిపించడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను రక్షించుకోవాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం’అని వెల్లడించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కురియన్ బీజేపీ అంటే బీఆర్ఎస్కు కోపం ఉండాలి కదా... ఓట్లు వేసి సహకరించుకునే సాన్నిహిత్యం ఆ రెండు పార్టీల మధ్య ఉందా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మొదటి నుంచీ తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉండేదని, రాజకీయ క్షేత్రంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య వైరుధ్యం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంత ఉండేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం మారిపోయిందని చెప్పారు. కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ నేతలు బీజేపీకి సహకరించారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సహకరించలేదు... కొందరు ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమకు ఎన్నికల్లో సహకరించని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల పేర్లను కూడా కురియన్ కమిటీకి చెప్పారని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయామని, అక్కడ బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన డి.కె.అరుణ కాంగ్రెస్ నుంచి ఎదిగారని, దీంతో చాలా స్వల్పంగా అయినా కాంగ్రెస్ కేడర్ ఆమెకు సహకరించిందని, ఈ నియోజకవర్గంలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయలేదనే చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే మెదక్ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో సహకారం అందలేన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, వేణుగోపాలాచారి లాంటి నేతల చేరికలు పార్టీకి కలసి రాలేదని, వాళ్ల ఓట్లు కూడా పడలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వడం కూడా కొంత ప్రభావం చూపిందని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్ లాంటి స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం చివరి నిమిషం వరకు ఆగకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వెల్లడైనట్లు తెలిసింది. కాగా, శుక్రవారం కమిటీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జులు, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ భేటీ కానుంది. వారి అంతర్గత పొత్తుతోనే: ఎంపీ చామల కిరణ్ కురియన్ కమిటీతో భేటీ అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను కురియన్ కమిటీకి వివరించామని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 12–13 స్థానాలు వచ్చేవని, బీజేపీ–బీఆర్ఎస్ల అంతర్గత పొత్తు కారణంగానే ఎనిమిది సీట్లకు పడిపోయామని చెప్పారు. కొన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల స్థాయి కంటే తక్కువ ఓట్లను పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పొందిందని, పార్లమెంటు ఎన్నికల నాటికి సమీకరణాలు మారిపోయాయని చెప్పారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం పోరుబాట పట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడునెలలు దాటడంతో హామీల అమలుపై పట్టుబట్టేలా ఉద్యమకార్యాచరణకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 421 హామీలపై ప్రత్యక్ష ఆందోళనలతో వివిధవర్గాల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లేలా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకోసం పార్టీపరంగా ఉన్న యువజన, మహిళా, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆందోళనలను ఇప్పటికే ప్రారంభించింది. రైతాంగానికి ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ‘రైతు సత్యాగ్రహం’ నిర్వహించింది. రైతులకిచ్చిన హామీల అమలుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టకపోతే... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే పెద్దఎత్తున నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఇచ్చిన ప్రధాన హామీలైన రుణమాఫీ రూ.2 లక్షలు, రైతు భరోసా కింద రైతుకూలీల అకౌంట్లలో రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, ఫసల్ బీమా అమలు, రైతులకు క్వింటాల్ వరికి రూ.500 బోనస్ వంటివాటి అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనుంది. మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై.. ఎన్నికలకు ముందు మహిళా లోకానికి ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ మంగళవారం మహిళా మోర్చా నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఏడు నెలలు గడిచినా మహిళలకు ప్రతి నెలా రూ. 2 వేల సాయం అమలు కాకపోవడం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ లేకపోవడం, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందకపోవడంతో పాటు మహిళలకు రూ. 500కే వంట గ్యాస్, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానాలు ఏమయ్యాయని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లింపు డిమాండ్‌తో పాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ కాకపోవడం వంటి సమస్యలపై యువమోర్చా ఉద్యమబాట ఉధృతం చేయనుంది. అవినీతి, అక్రమాలపై ఆధారాల సేకరణ... రాష్ట్రంలో సివిల్ సప్లయిస్, ఇతర శాఖల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెలికి తీసిన నేపథ్యంలో...ఈ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నందున ఆయా అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం దృష్టికే తీసుకెళ్లాలని పార్టీనాయకులు భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు వస్తున్నందున, వాటిపై కేంద్రం విచారణ కోరేలా, ఆయా శాఖల్లో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి పూరిస్థాయిలోఆధారాలు సేకరించి అందజేయాలని నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల నాటికి పట్టు సాధించాలని.. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లోగా తొలుత గ్రామీణ (గ్రామపంచాయతీ, జిల్లా/మండల పరిషత్), వచ్చే ఏడాది ప్రథమార్థంలో పట్టణ (మున్సిపల్, కార్పొరేషన్) స్థానికసంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పోలింగ్‌బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యావత్ పార్టీ యంత్రాంగం నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందిస్తోంది. -
ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయస్థాయి పోరు
సాక్షి, హైదరాబాద్: పార్టీ బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లనుంది. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాల్లో పురోగతితోపాటు, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, వారిపై అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని బుధవారం కేసీఆర్‌తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. -
మళ్లీ ‘టీఆర్ఎస్’! బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్ఎస్గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘టీఆర్ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్‌మార్టమ్‌లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. -
కాంగ్రెస్ గేట్లు ఎందుకు ఎత్తింది?
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు అన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్న ప్రజా ప్రతినిధులపై బీఆర్ఎస్ నాయకులు గొంతు చించుకొని తప్పు పడుతున్నారు. అయితే వారంతా ఈ పరిణామాలపై 2014 నుంచి జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది.అంతే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎందుకు మాట్లాడలేదో మరి! కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ గడీ తలుపులు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం బంతి భోజనాలు చేస్తున్నారు. ఎవరూ పార్టీ మారొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు.ఇక అసలు విషయానికి వద్దాం. ‘గేట్లు ఎత్తేశాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెనుక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలి, మార్పు కావాలి’ అంటూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే రేవంత్ సర్కార్ కొలువుదీరిన కొద్ది రోజుల నుంచే... ‘ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంద’ంటూ ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నాయకులు పదేపదే మాట్లాడుతూ వచ్చారు. ఈ రెండు పార్టీలదీ ఒకే వాయిస్ కావడంతో దీని వెనుక ఏదన్నా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు చర్చకు దారితీశాయి. ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ పూనిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన చేయడం ఎంత ముఖ్యమో... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ జరగాలంటే ప్రత్యర్థి పార్టీల కుట్రల్ని ఛేదించడం కూడా ముఖ్యమే మరి. కారు, కమలం పార్టీల రాజకీయ కుట్రని ఛేదించేందుకే ‘కౌంటర్ పాలిటిక్స్’కు రేవంత్ రెడ్డి పదును పెట్టారనుకోవాలి. అందుకే గేట్లు ఎత్తే ఫార్ములాను అనుసరిస్తున్నారని చెప్పక తప్పదు. కానీ, ఇది జనం హర్షిస్తారా? – కోడూరు శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్ -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు హస్తం గూటికి చేరగా.. పార్టీ మారేందుకు మరికొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం.జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్‌స్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు బండ్ల సాకేత్ రెడ్డితో కలిసి నిన్న శనివారం కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సీఎం రేవంత్‌తో భేటీ అయినట్టు సమాచారం. మరో రెండు లేదా మూడు రోజుల్లో వీరిద్దరూ హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే వెంట అందరూ కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. -
బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా.. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.కాగా, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. ఇక, ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సరితా తిరుపతయ్యతో రేవంత్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్‌రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. -
సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం గిదో లెక్కా..!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన సమాజం భవిష్యత్‌లో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములకు అతీ తంగా తెలంగాణ సమాజం ఎల్లవేళలా బీఆర్ఎస్కు అండగా ఉందని, భవిష్యత్‌లోనూ ఉంటుందని ఆయన ప్రకటించారు. బుధవారం ఎర్రవెల్లిలోని నివాసానికి వచ్చిన మహబూబాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఉద్యమ చరిత్ర.. తెలంగాణ కోసం సాగించిన పోరును మరోసారి గుర్తు చేసుకున్నారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని చెప్పారు. తెలంగాణ సాధన కోసం నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పారీ్టకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఏ ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణ మరింతగా పొందుకుంటూ బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడ్డ దిక్కుమొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటునుంచి పదేళ్ల ప్రగతిపాలన దాకా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు, వారు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదన్నారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకోవడంతోపాటు తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్‌గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయ్యిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్లపాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ, అన్నితీర్లా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజాఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అని..ప్రజలు అనతికాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని కేసీఆర్ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్‌లైట్ పట్టుకొని వెతుక్కుంటూ జనం బీఆర్ఎస్ కోసం వస్తారని కేసీఆర్ అన్నారు. అప్పడిదాక ఓపిక ప్రజాసమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: కేటీఆర్
జగిత్యాల: ‘సీఎం రేవంత్‌రెడ్డి.. నీకు దమ్ముంటే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. వారిని మళ్లీ గెలిపించుకుంటేనే దమ్మున్నోడివి’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రస్తుత సీఎం ప్రయతి్నంచి రూ. 50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఆ పరిస్థితుల్లోనే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యవహరించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా రేవంత్‌రెడ్డే వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దయ్యేలా రాజ్యాంగ సవరణ చేస్తామంటూ స్వయంగా రాహుల్‌గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసింది కేసీఆరేనని.. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని స్పష్టం చేశారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, మళ్లీ పార్టీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ అనే యువకుడికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగ యువకులపై లాఠీచార్జి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే తమ పార్టీ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించే, నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది: బండి సంజయ్
కరీంనగర్ టౌన్: ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిధుల కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు. కరీంనగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ అభి వృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నా మని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే సహకరిస్తున్నా మని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులిచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కేంద్రం పార్టీలకఅతీతంగా ఎంపీలకు నిధులిస్తుందని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీని పై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టీ 20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని, 140 కోటమంది ఆనందంతో ఉన్నారని తెలిపారు. -
అలక వీడిన జీవన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యవహారంలో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. తనకు సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకో వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి అధిష్టానం హామీతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జీవన్‌రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో భేటీఅయి అరగంట పాటు మంతనాలు సాగించారు. అనంతరం 8 గంటలకు జీవన్‌రెడ్డిని తోడ్కొని దీపాదాస్, శ్రీధర్‌బాబులు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.అండగా నిలిచిన వారిని గుర్తిస్తామన్నారు: జీవన్రెడ్డిఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, కార్యకర్తల మనోభావాలు గుర్తించి, పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రాధాన్యమిచ్చి గుర్తిస్తామని కేసీ వేణుగోపాల్ చెప్పారని జీవన్‌రెడ్డి అన్నారు. వేణుగోపాల్‌తో భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీకైనా కేడర్ ఆత్మగౌరవమే ప్రధానం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. పార్టీకి అండగా నిలిచినవారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. వారి కృషికి ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందాను’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని, అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యతే అన్నారు. ఈ భేటీకి చొరవ తీసుకున్న దీపాదాస్ మున్షీ, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.తలుపులు తెరిచే ఉంటాయి: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. ‘కాంగ్రెస్‌లో ఇప్పటికే చాలామంది చేరారు. ఇంకా చాలామంది చేరబోతున్నారు. మా పార్టీలోని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కలిసి నడుస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా నడుస్తోంది’ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల నియామకం ఉంటుందా అనే ప్రశ్నకు.. ‘పిక్చర్ అభీ బాకీ హై (సినిమా ఇంకా ఉంది) త్వరలోనే ఉంటుంది. పీసీసీ అ«ధ్యక్షుడి ఎంపిక అధిష్టానం నిర్ణయం. అసెంబ్లీ, పార్లమెంటులాగా కాలవ్యవధి ఉండదు’ అని మున్షీ బదులిచ్చారు.దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: శ్రీధర్బాబుగత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని చీల్చి, నష్టపరిచి, బలహీనపరిచిన వారే పార్టీ చేరికలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, అయితే రాజీనామాలు చేసి రావాలన్న నిబంధనపై పార్టీ ఆలోచన ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు. -
ఒత్తిళ్లకు లొంగొద్దు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్ (అంబర్‌పేట), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), లక్ష్మారెడ్డి (ఉప్పల్)తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి పొరపాట్లు చేయొద్దని, బీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ ఉండదని గతంలో అనేక పర్యాయాలు నిరూపితమైందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజా జీవితంలో చెడ్డపేరు తెచ్చుకోవద్దని చెప్పినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కేసీఆర్ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చారని సమాచారం. ఎర్రవల్లికి తరలివస్తున్న నేతలు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతున్న నాయకులకు ఎర్రవల్లి నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎర్రవల్లికి వస్తున్నారు. అలాగే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా కేసీఆర్‌ను కలుస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారితో ఫోటోలు దిగుతున్నారు. త్వరలో జిల్లాల వారీగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని, స్థానికంగా బస చేసి కార్యకర్తలను కలుస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం పునర్వ్వస్థీకరణ, క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై త్వరలో కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. -
వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడంపై నేతలు దృష్టి సారించారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఈ అంశంతో పాటు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బుధవారం కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలతో జరిపిన భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్ మంత్రుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడు కోణాల్లో పరిశీలన: రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 స్థానాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలకు ప్రస్తుతం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రేసులో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచి్చన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు సైతం తాజాగా తెరపైకి వచి్చనట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎంతో రాష్ట్ర నేతల సమావేశాలు సుదర్శన్‌రెడ్డికి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు మద్దతిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ఇద్దరూ గడిచిన మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ ఇద్దరు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్‌గౌడ్, వాకాటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉండగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైందని అంటున్నారు. వీరిద్దరు కూడా మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. శ్రీహరి సైతం బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తన పేరు పరిశీలనకు విన్నవించినట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్‌మోహన్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. ఇక ఎస్సీ కోటాలో జి.వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రాతినిథ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలతో పాటు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు బిజీబిజీ మంత్రివర్గ విస్తరణపై రెండ్రోజుల కిందటే మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మరోమారు వారితో సమావేశమయ్యారు. విస్తరణ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోపక్క పదవుల పంపకంపై చర్చించేందుకు ఢిల్లీకి వచి్చన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్‌దాస్ మున్షీతో భేటీ అయ్యారు. కాగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, జూలై 1 లేదా 2న విస్తరణ జరగవచ్చని తెలిసింది. పీసీసీ రేసులో ముగ్గురు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా మూడు పేర్లపై హైకమాండ్ పెద్దల వద్ద చర్చలు జరిగినట్లు తెలిసింది. ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పీసీసీ పదవిని ఎస్టీకి ఇవ్వనందున బలరాం పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆయన పేరును కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్‌గౌడ్‌కు రేవంత్, ఇతర సీనియర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మహేశ్‌గౌడ్ కూడా హైకమాండ్ పెద్దలతో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లాబీయింగ్ చేస్తున్నారు. -
ఇంకా అలక వీడని జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్‌కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.