కాంగ్రెస్‌ గేట్లు ఎందుకు ఎత్తింది? | Political Analyzes Of Party Defections Sakshi Guest Column News | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గేట్లు ఎందుకు ఎత్తింది?

Published Tue, Jul 9 2024 9:40 AM | Last Updated on Tue, Jul 9 2024 9:40 AM

Political Analyzes Of Party Defections Sakshi Guest Column News

తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు అన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్న ప్రజా ప్రతినిధులపై బీఆర్‌ఎస్‌ నాయకులు గొంతు చించుకొని తప్పు పడుతున్నారు. అయితే వారంతా ఈ పరిణామాలపై 2014 నుంచి జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది.

అంతే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎందుకు మాట్లాడలేదో మరి! కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎమ్మెల్యేల కోసం కేసీఆర్‌ గడీ తలుపులు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం బంతి భోజనాలు చేస్తున్నారు. ఎవరూ పార్టీ మారొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వద్దాం. ‘గేట్లు ఎత్తేశాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటన వెనుక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలి, మార్పు కావాలి’ అంటూ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అయితే రేవంత్‌ సర్కార్‌ కొలువుదీరిన కొద్ది రోజుల నుంచే... ‘ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంద’ంటూ ఒకవైపు బీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ నాయకులు పదేపదే మాట్లాడుతూ వచ్చారు. ఈ రెండు పార్టీలదీ ఒకే వాయిస్‌ కావడంతో దీని వెనుక ఏదన్నా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు చర్చకు దారితీశాయి. ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ పూనిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన చేయడం ఎంత ముఖ్యమో... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ జరగాలంటే ప్రత్యర్థి పార్టీల కుట్రల్ని ఛేదించడం కూడా ముఖ్యమే మరి. కారు, కమలం పార్టీల రాజకీయ కుట్రని ఛేదించేందుకే ‘కౌంటర్‌ పాలిటిక్స్‌’కు రేవంత్‌ రెడ్డి పదును పెట్టారనుకోవాలి. అందుకే గేట్లు ఎత్తే ఫార్ములాను అనుసరిస్తున్నారని చెప్పక తప్పదు. కానీ, ఇది జనం హర్షిస్తారా? – కోడూరు శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement