
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పతనాన్ని మనం కోరుకోవొద్దు
భూముల అమ్మకంపై తిరుగుబాటు ఆహ్వానించదగినదే
రాష్ట్ర బీజేపీలో నాయకత్వ లేమి, నేతల కుమ్ములాటలు
ఎర్రవల్లిలో కరీంనగర్, ఆదిలాబాద్
బీఆర్‌ఎస్ నేతల భేటీలో మాజీ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనాన్ని మనం కోరుకోవొద్దు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగితేనే.. మనం చేసిన మంచి ఏమిటో వెలుగు చూస్తుంది. ఈ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు ఇప్పటికే విసిగివేసారిపోయారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో జనంలో తిరుగుబాటు మొదలైంది.
బీఆర్‌ఎస్ నేతలు అనునిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటే మన పట్ల సానుకూలత పెరుగుతుంది’అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలో గురువారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ, వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లపై ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ సర్కారుపై జనం తిరుగుబాటు
‘సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్ సర్కారుపై జనం తిరుగుబాటు ఆహ్వానించదగిన పరిణామం. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపయోగంగా ఉన్న వాటితోపాటు ఆక్రమణలకు గురవుతున్న భూములను కాపాడి వాటిని పారదర్శకంగా వేలం వేసి ఖజానాకు ఆదాయం సమకూర్చాం. కానీ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూముల విక్రయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తోంది’అని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర బీజేపీలో నాయకత్వలేమి
‘బీజేపీకి రాష్ట్రంలో సరైన నాయకుడు లేక నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీలోనూ అంతర్గతంగా నాయకుల నడుమ తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలతోపాటు ఏ ఇతర ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రతిఫలిస్తుంది’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
వరంగల్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేకించి మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి 2 లక్షలు, ఆదిలాబాద్ నుంచి లక్షన్నరకు తగ్గకుండా జన సమీకరణ చేయాలన్నారు.
బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హాజరు
కేసీఆర్‌తో జరిగిన భేటీలో మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకష్ణారావు (కరీంనగర్), తోట ఆగయ్య (సిరిసిల్ల ) జోగు రామన్న (ఆదిలాబాద్ ), బాల్క సుమన్ (మంచిర్యాల) పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్ , సుంకే రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు .
బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి
రజతోత్సవ సభ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూపొందించిన ‘బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి‘పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ అవతరణ నాటి నుంచి నేటి వరకు ప్రస్థానాన్ని గుర్తు చేసేలా పాటలు, కళారూపాలు రూపొందించాలని రసమయి బాలకిషన్‌కు కేసీఆర్ సూచించారు.