
అసెంబ్లీలో సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు
ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. సవాళ్లు..ప్రతి సవాళ్లు
ద్రవ్య వినిమయ బిల్లుపై అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టుడికింది. బిల్లుపై చర్చ ప్రారంభంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.
ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ‘మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు.. జైల్లో ఉండేది’ అని సీఎం అంటే.. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు’ అంటూ కేటీఆర్ స్పందించారు. ‘ఏం చేసినా పెద్దాయన (కేసీఆర్) ఆయన సీటు ఇవ్వడు..’ అని ముఖ్యమంత్రి అంటే.. ‘రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణను బీఆర్‌ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయిలో సీఎంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అనేకసార్లు అడ్డుపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. కేటీఆర్, సీఎం పరస్పర వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. విపక్షం ఆరోపణలకు సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: రేవంత్
‘రైతుల రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.16,143 కోట్లే మాఫీ చేసింది. మొదటి ఐదేళ్లల్లో వడ్డీ తీసివేస్తే జరిగిన రుణమాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే. రెండోసారి నాలుగేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఆఖరి ఏడాది 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ.20,616,89 కోట్లు మాఫీ చేశాం.
ఎన్నికల నిబంధనతో వారు రైతుబంధు ఇవ్వకపోతే..మేము వచ్చాక ఇచ్చాం. వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పి, కేసీఆర్ కుటుంబసభ్యుల ఫామ్‌హౌస్‌ల్లో పండిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్‌కు అమ్ముకున్నారు. వారు పదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.
అప్పుల రాష్ట్రంగా మార్చారు..
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. 2014 నాటికి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.90,160 కోట్లయితే, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ. 6,69,257 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు పెట్టిన రూ.40,154 కోట్ల బకాయిలు కలిపితే, మొత్తం అప్పు రూ.7,19,151 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.1,53,359 కోట్లు చెల్లించాం. ఇవి తీసేస్తే మేము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే. విపక్షం అబద్ధాల పునాదులపై వెళ్తే లాభం లేదు. ఇప్పటికే కూలిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉండాలి..’ అని సీఎం ధ్వజమెత్తారు.
ఫాంహౌస్‌ల కోసం ప్రాజెక్టులు కట్టారు..
‘బీఆర్‌ఎస్ నేతల ఫాం హౌస్‌ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు కొన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాం హౌస్‌కు కాల్వలు తీసి నీళ్ళు తీసుకెళ్ళారా లేదా? చెప్పాలి. రంగనాయక సాగర్ దగ్గర హరీశ్‌రావుకు ఫాం హౌస్ ఉందా లేదా? దీనిపై కాంగ్రెసేతర శాసనసభ్యులతో కమిటీకి సిద్ధమా? మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కడితే కుప్పకూలిపోతుందని ఇంజనీర్లు చెప్పినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులను జైలుకు పంపుతాం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతాం. కాళేశ్వరం లేకున్నా వ్యవసాయానికి నీళ్శివచ్చు. లగచర్లలో అధికారులను చంపమని విపక్షం రెచ్చగొట్టింది..’ అని సీఎం ఆరోపించారు.
పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు..
‘పెద్దాయన (కేసీఆర్) సీటు కోసం కుటుంబంలోని ఇద్దరూ ఆశ పడుతున్నారు. కానీ పెద్దమనిషి వదిలేట్లు లేడు. వీపు చింతపండు అవుతుందని పెద్దాయనే చెప్పాడు. పెద్దమనిషి ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన వందేళ్ళు ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడి పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ‘ఈ సందర్భంగా నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబాన్ని ఏకే 47 తుపాకీతో కాల్చిన ఉదంతాన్ని ప్రస్తావించారు) మీరు జాతిపిత అని చెబుతున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో బండకేసి కొట్టారు..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఫాంహౌస్ ఫొటోలు పత్రికలకిచ్చానని కేసులు పెట్టారు
– తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే డిటెన్షన్ సెల్‌లో ఉంచారు: రేవంత్
‘కేటీఆర్ ఫాంహౌస్‌ను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించి నాకు ఫోటోలు ఇస్తే.. నేను వాటిని పత్రికలకు పంపిస్తే అక్రమ కేసులు పెట్టారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. నన్ను అరెస్టు చేసి నక్సల్స్, తీవ్రవాదులును నిర్బంధించే డిటెన్షన్ సెల్‌లో ఉంచారు. మరోఖైదీ కానీ, మరొక వ్యక్తి కానీ కనిపించని విధంగా కక్షసాధింపుగా ఆ గది కేటాయించారు. రాత్రిళ్లు పడుకోవడానికి కూడా సరిపోని గది అది. అందులోనే చిన్న బాత్‌రూమ్.
బయటకు కనపడేలా ఉంటుంది. రాత్రి ఎలాగోలా పడుకుందామని అనుకున్నా. లైట్ ఆఫ్ చేశారు కాదు. ఏమిటంటే పైనుంచి ఆర్డర్ అనేవారు. ఆ ట్యూబ్‌లైట్ చుట్టూ పురుగులు.. వాటి కోసం వచ్చే 30 బల్లులు. ప్రతిరోజూ నిద్ర లేకుండానే గడిపా. ఉదయం పూట బయటకు వదిలినప్పుడు చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు అలా నిర్బంధంలో ఉంచారు. నా కూతురు పెళ్లి పత్రిక రాసుకునే కార్యక్రమానికి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ ఢిల్లీ నుంచి లాయర్‌ను తీసుకునివచ్చి వాదించారు.
కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో నేరుగా కార్యక్రమానికి వెళ్లి తిరిగి జైలుకు వచ్చా. ఇప్పుడు ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. అంతకంతకు దేవుడే చూసుకుంటాడని అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజునే నాపై కక్ష చూపించిన వాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నేను అమలు చేయలేదు..’ అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
డ్రోన్ ఎగరేసి ఆడోళ్ల ఫొటోలు తీస్తారా
– మీ భార్యాపిల్లల ఫొటోలు తీస్తే ఊరుకుంటారా?: కేటీఆర్
‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీస్తామంటే ఊరుకుంటాడా? మీకే భార్యా పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టిం ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడుం నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?..’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను జైల్లో పెట్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మా ఇంటి మీదకు డ్రోన్ ఎగరేసి ఇంటివాళ్ల ఫొటోలు తీయటం సరైన పనేనా అన్నది సీఎం చెప్పాలి. రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం జైల్లో పెట్టలేదు. కోర్టులు రిమాండ్ చేశాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నా. అయినా రేవంత్‌రెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడాడా? ఏం గొప్ప పని చేసి జైలుకెళ్లాడు? ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు.
పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు. రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే.ం ఆయనకు తుపాకుల గురించి బాగా తెల్సుం. తెలంగాణపై గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి రేవంత్‌రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్‌రెడ్డే..’ అని కేటీఆర్ అన్నారు