
హైదరాబాద్,సాక్షి: తీన్మార్ మల్లన్న ఖబడ్దార్. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి నోరు జారితే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. గత వారం నిర్వహించిన బీసీ చైతన్య సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలపై సోమవారం తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. సీఎం రేవంత్‌ను విమర్శించే స్థాయి తీర్మార్ మల్లన్నకు లేదన్నారు. దమ్ముంటే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) ఇంకా ఏమన్నారంటే.. 'తెలంగాణ రాజకీయ వ్యభిచారి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్నే. నేను రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల నాయకత్వం పెంపొందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఎన్నిసార్లు రేవంత్ కాళ్ళు మొక్కావో గుర్తులేదా. అధిష్టానం రాష్ట్ర రాజకీయ నాయకులను ఒప్పించి రేవంత్ నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు.
స్పీకర్ ఫార్మార్‌లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ దమ్ము ఏంటో నిరూపించుకో. ఎన్ని పార్టీలు మారావో గుర్తుందా. బీసీల ముసుగులో చిల్లర పనులు చేస్తూ బిసిలను ఇబ్బందులకు గురి చేయడానికి సిగ్గుండాలి. నీది నా కంటే దిగువ స్థాయి.. సీఎం రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా నీ స్థాయికి తగ్గట్లు మాట్లాడటం నేర్చుకో. బీజేపీ నేతలకు గులాంగిరి చేసుకో. ఉదయం బీజేపీ, సాయంత్రం బీఆర్ఎస్ భజన చేసుకో’ అని ధ్వజమెత్తారు.
చదవండి: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట