
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కుల గణన జరగాలని రేవంత్ రెడ్డికి సూచించాను. అందుకే రేవంత్ నన్ను సస్పెండ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు అని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ కావాలనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కరీంనగర్ వెళ్లే సమయంలో కూడా నన్ను సస్పెండ్ చేయాలని పీసీసీకి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నేతలకు గట్టి మద్దతు లభించింది.. భవిష్యత్‌లో మరింత బలం గా పోరాడుతాం. నన్ను సస్పెండ్ చేయడం ద్వారా బీసీలు ప్రశ్నించరనే భ్రమ నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలి.
కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే సస్పెండ్ చేస్తారా?. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కుల గణన జరగాలని రేవంత్ రెడ్డికి సూచించాను. సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ పకడ్బందీగా నిర్వహించారు. చివరి రోజు రేవంత్ రెడ్డి కులగణన చేయించుకున్నారు. అగ్ర వర్గాలను ఎక్కువ చూపించారు.. బీసీలను తక్కువ చూపించారు. నేను చెప్పింది తప్పు అయితే.. మళ్ళీ ఎందుకు సర్వే చేశారు. EWS రిజర్వేషన్ల రక్షణ కోసమే బీసీ జనాభా తగ్గించారు. 90 ఏళ్ళ తర్వాత సర్వే చేసినా.. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు. కులగణన తప్పు అని నేను నిరుపిస్తా. తప్పు జరిగితే సరిదిద్దుకోండి.
కులగణన చేస్తారనే హామీ ఇచ్చారనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్ రెడ్డిపై నమ్మకంతో కాదు.. రాహుల్ గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్‌లో చేరాను. సీఎం పేరును మంత్రులు కూడా ఉచ్చరించడం లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక న్యాయం.. రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయమా?. అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకేనా?.. బలహీన వర్గాలకు లేదా?. కేసీఆర్‌పై పోరాటం చేసింది నేనే. నేను పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలంతా ఎక్కడ ఉన్నారు?. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నా పాత్ర ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసి ఉంటే ఇంకో 8 సీట్లు వచ్చేవి.
బీజేపీకి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. సంవత్సరంలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు?. ఆత్మపరిశీలన చేసుకోవాలి. వంశీ చందర్‌రెడ్డిని ఓడగొట్టింది మీరే. పార్టీ నేతలు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అలిగి పోతున్నారట. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌ను ఓడిస్తున్నాడు. 2028లో తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు. పిల్లి గాండ్రింపులకు భయపడేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో అన్ని బీసీ సంఘాలకు ఒకే ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తాం. అందరినీ ఏకం చేస్తాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెడుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదు. మండలిలో మాట్లాడేది చాలా ఉంది. ప్రధాని మోదీ నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అదే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించాలి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment