
మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతల సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి
జేబులు నింపుకొనేందుకు సీఎం, మంత్రుల పోటీ: కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్లను తలపిస్తోందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డో జర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడటం రేవంత్ మనస్తత్వానికి అద్దంపడుతోందని విమర్శించారు. ఇతర అంశాల్లోనూ రేవంత్ దూకుడు ఇదే తరహాలో ఉండ టాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తోందని, దానిని ఎవరూ రక్షించలేరని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలుసుకునే సీఎంతోపాటు మంత్రులు వీలైనంత త్వరగా సొంత జేబులు నింపుకొనేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా 20కిపైగా మంది ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు వెల్లడించాయి.
మోదీ పట్ల ఆర్‌ఎస్‌ఎస్ అసంతృప్తి..
‘‘దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడమే దీనికి సంకేతం. ఆర్‌ఎస్‌ఎస్ కూడా ప్రధాని మోదీ పనితీరు పట్ల సంతృప్తిగా లేదు. ఆయన ఒంటెద్దు పోకడల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవి కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ను దేబిరించాల్సిన పరిస్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో తొలి రెండు పర్యాయాలు ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిర్మాణాత్మకంగా దేశానికి చేసినది చెప్పుకునేందుకు ఏమీ లేదని.. దీంతో ప్రజలు మళ్లీ తమవైపు చూస్తున్నారని చెప్పారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ చేసిన పనితో ఇతర పార్టీల పనితీరును ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని.. రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం బీఆర్‌ఎస్ చేసిన పనులే ఇతర పార్టీల పనితీరుకు గీటు రాయిలా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
లక్షలాదిగా సభకు తరలిరావాలి..
ఏప్రిల్ 27న అన్ని గ్రామాల్లోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్ జెండా ఎగరవేసి వరంగల్ సభకు బయలుదేరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్‌కు దగ్గరలో ఉండే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం రెండు లక్షల మంది తరలివచ్చేలా వాహనాలు సమకూర్చుకోవాలని.. ఆర్టీసీ, ఇతర బస్సులను ఇప్పటి నుంచే సమీకరించడం ప్రారంభించాలని సూచించారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ప్రచార పోస్టర్ రూపకల్పనకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.