
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!.
మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.
ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు.
👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి.
👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు.
ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.
👉వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే.
👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్‌సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్‌సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!.
👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది.
👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.
గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు.
ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్‌ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment