
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నెల్ పనులు ముందుకు కదలేదని రేవంత్ చేసిన ఆరోపణలనూ హరీష్ ఖండించారు.
బీఆర్‌ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. మా హయాంలో టన్నెల్ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం.. ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్ రావు అన్నారు.
అలాగే.. తన దుబాయ్‌పై పర్యటనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్‌లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్‌కి వెళ్లే.. 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆపై టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన.