
హైదరాబాద్,సాక్షి: దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవుణ్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ(BRS Silver jubilee) సభను విజయంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. జీవో 58,59ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది. రైతు రుణమాఫీ, 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి.
13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రేవంత్ మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్,ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి.కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికాడు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్‌దే.

కేసీఆర్‌ది సాగు భాష..రేవంత్ రెడ్డిది చావు భాష.ఢిల్లిలో ధర్నా,సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాందీ రాలేదు.రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు.దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవున్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాళా తీశారు.
మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు.కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి.ఏడాది తిరగకుండానే లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. వరంగల్ జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి’ అని పిలుపు నిచ్చారు.