భారత్‌ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్‌గాంధీ | Sakshi
Sakshi News home page

భారత్‌ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్‌గాంధీ

Published Fri, May 10 2024 5:33 AM

Congress Leader Rahul Gandhi Fires On BJP

నర్సాపూర్, సరూర్‌నగర్‌ సభల్లో రాహుల్‌గాంధీ ఫైర్‌

రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టం చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి 

భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు.. దేశ పేదల గొంతుక, వారి గుండె చప్పుడు 

అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు   

గత పదేళ్లలో మోదీ ఓ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు.. 

మేం అధికారంలోకి రాగానే పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు వేస్తాం.. పేదరికాన్ని రూపుమాపుతాం

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తాము గెలిస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని, ఖతం చేస్తామని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టంగా చెప్పాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు. దేశ పేదల గొంతుక, వారి గుండెచప్పుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు రాజ్యాంగంతోనే లభించాయి. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, మారుస్తామని అనడం ద్వారా బీజేపీ నేతలు పేద ప్రజలపైనే కాకుండా భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నారు..’ అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్, మహాత్మాగాం«దీ, నెహ్రూ లాంటి వారు పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, తమ రక్తం, చెమటను ధారపోశారు. 

ఆ మహానీయుల కర్మ ఫలాలకు నష్టం కలిగించాలని ఇప్పుడు బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ప్రపంచంలోని ఏ శక్తికీ సాధ్యం కాదు. కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాం«దీ, ఖర్గే, దేశ ప్రజలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు, కూలీలు కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..’ అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో పేదలు, వెనుకబడిన, దళిత, ఆదివాసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న పేదరికాన్ని రూపు మాపుతామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభల్లో ఆయన మాట్లాడారు.  

మేం కోట్లాదిమందిని లక్షాధికారుల్ని చేస్తాం 
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల రిజర్వేషన్లను తొలగించేందుకే మోదీ సర్కారు పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు తొలగించాలంటున్న వారికి.. రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్న వారికి మధ్య పోరు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఓ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ల కోసమే అన్నీ చేశారు. దేశ ప్రజలు, రైతులు, శ్రామికుల కోసం కొద్దిగా కూడా పని చేయలేదు. మోదీ 22–25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు. బీజేపీ సర్కారు 22 మందిని కుబేరుల్ని చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లాది మందిని లక్షలాధికారుల్ని చేస్తుంది.  

పేదల జాబితా తయారు చేస్తాం 
కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాందీ, ఖర్గే, నేను, రేవంత్‌ రెడ్డి, తెలంగాణ నేతలందరం ఓ నిర్ణయానికి వచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాగానే దేశంలోని పేద కుటుంబాల జాబితా తయారు చేస్తాం. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏటా రూ.లక్ష జమ చేస్తుంది. నెలకు మరో రూ.8,500 వేస్తుంది. ఈ డబ్బులతో దేశంలోని పేద కుటుంబాల జీవితాలు బాగుపడతాయి. విద్య, వైద్యం పొందుకోవడంతో పాటు పేదలు అనుకుంది ఏదైనా ఈ డబ్బులతో చేయగలుగుతారు. మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినప్పుడు నోరు విప్పని మీడియా, ఇప్పుడు మేము పేదలకు డబ్బులిస్తామంటే.. వారి అలవాట్లను చెడగొడుతున్నామని విమర్శిస్తోంది. అదానీ మనుషులూ.. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పేదల ఖాతాల్లో మేము రూ.కోట్లు వేయబోతున్నాం..’ అని రాహుల్‌ స్పష్టం చేశారు.  

రైతులకు చట్టబద్ధంగా మద్దతు 
‘దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము రైతుల కోసం జబర్దస్త్‌ పని చేయబోతున్నాం. మేనిఫెస్టోలో రెండు హామీలు పొందుపరిచాం. మా సర్కారు రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం. వారికి చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను అందిస్తాం. రైతుల కష్టానికి తగిన ఫలితం లభించని రోజులు ఇక ఉండవు.   

పక్కాగా తొలి కొలువు 
మోదీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను తయారు చేశారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, అగ్నివీర్‌ పథకాల ద్వారా నిరుద్యోగ్యాన్ని పెంచారు. నిరుద్యోగులకు అప్రెంటిస్‌íÙప్‌ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసినవారందరికీ ఈ హక్కుఇవ్వబోతున్నాం. దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 15లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. 

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. ఒక ఏడాది కాలం పక్కాగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉత్తమ శిక్షణ లభిస్తుంది. కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి రూ.లక్ష నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. నెలకు రూ.8,500 వేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. ఆశా, అంగన్‌వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..’ అని రాహుల్‌ ప్రకటించారు.  

కులగణనతో రాజకీయాల్లో శాశ్వత మార్పు 
‘నరేంద్ర మోదీ ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేశారు. మా ప్రభుత్వం పేద, బలహీన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తుంది. తెలంగాణ తరహాలో మేము దేశ వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలోని పేద, వెనుకబడిన, దళిత, గిరిజన, పేద ఉన్నత కులాలు, మైనారిటీలకు జనాభాలో వారి దామాషా తెలిసిపోతుంది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఈ విప్లవాత్మక చట్టం అమల్లోకి వచ్చాక దేశ రాజకీయాలు శాశ్వతంగా మారిపోతాయి..’ అని ఏఐసీసీ నేత అన్నారు.  

రేవంత్‌ బృందం బాగా పనిచేశారు 
‘రేవంత్, తెలంగాణ బృందం బాగా పనిచేశారు. 30 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. రూ.500కే గ్యాస్‌ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా ఈ పథకాలను అమలు చేస్తాం. మోదీ ఎంత డబ్బు కుబేరులకు ఇచ్చారో అంతే డబ్బును దేశ, తెలంగాణ పేదలకు ఇస్తాం. 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. నేను తెలంగాణ ప్రజల కోసం ఢిలీల్లో సైనికుడిలా పనిచేస్తా. తెలంగాణకు ఏది అవసరమైనా ఆ పని చేసేందుకు నేను ఢిల్లీలో సిద్ధంగా ఉంటా..’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ సభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, నేతలు మధుయాష్కీ, మహేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, రంజిత్‌ రెడ్డి, సునీతా మహేందర్‌ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement