ఏప్రిల్ మొదటి వారంలో భారీ సభతో కాంగ్రెస్ ప్రచారం షురూ..
ఖర్గే, రాహుల్ హాజరయ్యే చాన్స్.. ఆ తర్వాత సీఎం రేవంత్ బస్సు యాత్ర?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలసివచ్చిన తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని సమాచారం. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని, మేనిఫెస్టో తెలుగు ప్రతులను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
కాగా, ఈ సభ నిర్వహణ కంటే ముందే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభ అనంతరం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఆయన బస్సులో ప్రచార యాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, బస్సు యాత్ర చేయాలా? అలా వెళ్తే ఎంత మంది నేతలు వెళ్లాలి? లేదా ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు పెట్టి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలా అన్న దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment