
ఎండిన ప్రతి ఎకరాకూ రూ. 25వేల పరిహారం ఇవ్వాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు కాంగ్రెస్ తెచ్చిందని.. రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎండిన ప్రతీ ఎకరాకు రూ. 25 వేల చొప్పున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ముంచుకొస్తున్న కరువు ముప్పుపై ముందే హెచ్చరించినా, తెలివిలేని కాంగ్రెస్ ప్రభుత్వం చెవికి ఎక్కలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చని పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ జరగక, పెట్టుబడి సాయం అందక ఇప్పటికే అల్లాడుతున్న రైతులకు పంటలు ఎండిపోవడం గోరు చుట్టు మీద రోకటి పోటులా ఉందన్నారు.
ఆర్థిక శక్తిని ఆగం చేస్తున్నారు
ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని, రాష్ట్రంలో పాలనకు బదులుగా పీడన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరిట వసూళ్లు, మూసీ సుందరీకరణ పేరిట పేదలపై పగ, ఫార్మాసిటీ పేరిట భూముల దందా జరుగుతోందన్నారు. ఫోర్త్‌సిటీ పేరిట ముఖ్యమంత్రి కుటుంబం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ట్రిపుల్‌ఆర్ పేరిట పేదల భూముల ఆక్రమణ జరుగుతోందన్నారు. గతంలో మద్యం వద్దు అంటూ నినదించిన రేవంత్...ఇప్పుడు ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment