
మీరు అసహ్యకరంగా మాట్లాడినపుడు మాకు ఫ్యామిలీ లేదా?
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
సంబంధాలు అంటగట్టి మా పిల్లలను దూషించినపుడు విలువలు లేవా?
సాక్షి, హైదరాబాద్: ‘‘నైతిక విలువలపై అసెంబ్లీలో చిలుక పలుకులు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ సభలో బజారు భాష మాట్లాడారు. రాజ కీయాల్లో హద్దు దాటకూడదని ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించాం. మేం కూడా రేవంత్ బట్టలు విప్పితే.. ఆయన బయట తిరగలేడు. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల సంగతులు, సాగర్ సొసైటీలు, మైహోమ్ భుజ వ్యవహారాలను మేం మాట్లాడగలం.
ఢిల్లీలో ఆయన గోడలు దూకిన విషయాలు చెప్పగలం. రేవంత్ దాటిన ‘రేఖలు, వాణిలు, తార’ల గురించి.. ఎక్కువగా మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెట్టగలం..’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి తాము నోరు విప్పితే ఆయనకు ఇంట్లో తిండి కూడా పెట్టరని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ లాబీలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ విషయం అప్పుడు గుర్తుకురాలేదా?
తనపై 15 కేసులు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాస్వామ్య విలువలు, కుటుంబం ఇప్పుడు గుర్తుకువస్తున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మాపై అసహ్యకరమైన ఆరోపణలు చేసి సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లలను రాజకీయాల్లోకి లాగిన రోజు మాకు కుటుంబాలు లేవా? మీకు విలువలు లేవా? ప్రస్తుతం తన భార్యాబిడ్డల గురించి మాట్లాడుతున్న రేవంత్‌కు.. మాకు కూడా కుటుంబాలు ఉంటాయనే విషయం గుర్తుకురాలేదా?’’అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరేమిటో తెలుసని, బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
అందులో మూటల లెక్కలూ ఉన్నాయేమో!
‘‘ఈ ఏడాది రూ.70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ అప్రూవర్‌గా మారి నిజం ఒప్పుకున్నారు. ఎలాంటి ఆర్థిక మాంద్యం, కోవిడ్ సంక్షోభం వంటివేవీ ఇప్పుడు లేకున్నా సీఎం రేవంత్ విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్. రాష్ట్ర అప్పులపై రేవంత్ చెప్తున్న కాకి లెక్కల్లో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌లకు ఇచి్చన మూటల లెక్కలు కూడా ఉన్నాయేమో’’అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌కు గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదని మండిపడ్డారు. భూముల అమ్మకంపై సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
పాలన చేతకాదనే మాటలను నిజం చేస్తున్నారు..
‘‘తెలంగాణకు నాయకత్వ లక్షణాలు లేవు, పాలన చేతకాదనే సమైక్యాంధ్ర పాలకుల మాటలను రేవంత్ నిజం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలు విచక్షణతో మాకు పగ్గాలు అప్పగించారు. కాబట్టే పునాదులు గట్టిగా పడ్డాయి. లేదంటే తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోయేది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రహస్య మీటింగ్‌లపై కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని.. ఆ ఆరోపణలు అవాస్తవమైతే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు.
ఫార్ములా–ఈ రద్దుపై విచారణ జరిపిస్తాం..
ఫార్ములా–ఈ రేసును తప్పుబడుతున్న రేవంత్ ప్రభుత్వం.. రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు పెడుతోందని కేటీఆర్ నిలదీశారు. ‘‘ఫార్ములా–ఈ’ను ఏకపక్షంగా రద్దు చేయడంతో ప్రభుత్వానికి జరిగిన నష్టంపై మా ప్రభుత్వం వచి్చన తర్వాత విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడితే.. వారు జర్నలిస్టులే కాదంటూ, బట్టలు విప్పుతానంటూ సీఎం దూషణకు దిగుతున్నారు. గాడ్సే మూలాలు కలిగిన రేవంత్ జాతిపిత లాంటి కేసీఆర్‌పై చిల్లరగా మాట్లాడుతూ అభినవ గాడ్సేలా తయారయ్యారు’’అని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎంఐఎం విషయంలో తమ వైఖరిపై పునరాలోచించుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment