
బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట.. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ (ఏపీలో) మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా? అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి.
తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వీరిపట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగినా జీవితకాలం దుఃఖం తప్పదు’అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘గోదావరి కన్నీటి గోస’పేరిట బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ల పాదయాత్ర శనివారం ముగిసింది.
ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎనిమిదేసి మంది ఎంపీలను గెలిపించినా ఏకాణా పని జరగడం లేదు. బీఆర్‌ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు సాధించుకునేవాళ్లం. ఈ దిశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి’అని సూచించారు.
వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు
‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. ఆ ఆవేదనతోనే వాళ్లను ఉద్యమ కాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను. అంతేతప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది? రామగుండం ఎమ్మెల్యేకు నీటి గోసపై మాట్లాడే అవకాశమున్నా మౌనంగా ఉంటే ఏమనాలి? బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అలుగు పారితే ఇప్పడు చెరువులు, కుంటలు అడుగంటాయి.
కొట్లాడి సాధించిన తెలంగాణను ఎంతో జాగ్రత్తగా నిలబెట్టినా ప్రజలు కొత్త ప్రభుత్వానికి తెచ్చుకున్నారు. అది వాళ్లిష్టం అయినా ఫలితాన్ని లోకం చూస్తోంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు చెన్నై వంటి నగరాల్లోనూ ఎంతో ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నారు. తెలంగాణలోనూ ఖర్చుకు వెనుకాడకుండా తాగు, సాగునీరు అందించాల్సిందే’అని కేసీఆర్ స్పష్టం చేశారు.
పేదల ఇండ్లను కూల్చుతున్నారు
‘పల్లెల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చిన పేదలకు మనం అండగా నిలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ఆవేదన చెందుతున్న ప్రజలు.. ‘కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవు.. రావే’అని పిలుస్తున్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయి.
తెలంగాణలో సమస్యలకు నాటి ప్రధాని నెహ్రూ మొదలుకొని సోనియాగాంధీ వరకు ప్రధాన శతృవు కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో మళ్లీ సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలను బాగుచేసే దిశగా ఆలోచించాలి. ప్రధాని మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే. బెల్లం ఉన్న దగ్గరకు ఈగలు వస్తాయి. అధికారం పోగానే కొందరు పార్టీకి దూరమవుతారు.
రాబోయే రోజుల్లో అధికారం బీఆర్‌ఎస్ పార్టీదే. సింగిల్‌గా అధికారంలోకి వస్తాం. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. ప్రతీ కార్యకర్త కేసీఆర్‌లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్‌కు పార్టీ నేత బొడ్డు రవీందర్ నాగలి బహూకరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పుట్ట మధు, పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, నారాయణదాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment