
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్‌సీ) పథకం ఒకటి.
మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్‌సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
మహిళలకు ప్రత్యేకం
స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్‌సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
ఎంత వడ్డీ లభిస్తుంది?
దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్‌సీ స్కీమ్‌పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.
పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment