
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్‌లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ .75 ఛార్జీ ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర లేదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి.
ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలు
ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే, అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస రూ .2.5 లక్షలు, గరిష్టంగా రూ .7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు.
ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా, ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది.
గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా రూ.6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ మొత్తాన్ని సవరించి, కనీస చెల్లింపును రూ .2.5 లక్షలకు, గరిష్టంగా రూ .7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్‌తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment