
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ పథకాల ద్వారా దేశంలోని ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) కింద ఏర్పాటైన నిబంధనలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ముందస్తు క్లెయిమ్‌లు, ఫ్యామిలీ అసిస్టెన్స్ అందించడం ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయి. అసలు ఈపీఎఫ్‌లో ఎలాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి.. వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
సూపర్ యాన్యుయేషన్ పెన్షన్
ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాలకు ఇది మూలస్తంభం. ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉంటే 58 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులు. ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకునేందుకు సభ్యులు 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకానికి కంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు. తద్వారా అధిక పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు.
ముందస్తు పెన్షన్ ఎంపికలు
అధికారిక పదవీ విరమణ వయస్సుకు ముందే ఆర్థిక సహాయం కోరుకునేవారికి, ఈపీఎస్ పథకం 50 సంవత్సరాల వయస్సు నుంచే ముందస్తు క్లెయిమ్‌లను అనుమతిస్తుంది. అయితే 58 ఏళ్ల లోపు ప్రతి ఏడాది పెన్షన్ మొత్తంలో 4 శాతం తగ్గుతుంది. ఇది ఫ్లెక్సీబిలిటీ అందిస్తున్నప్పటికీ, తగ్గిన పెన్షన్ చెల్లింపుల దీర్ఘకాలిక ప్రభావాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
వైకల్య పెన్షన్
సర్వీస్ సమయంలో శాశ్వత, సంపూర్ణ వైకల్యం సంభవించినప్పుడు, ఆర్థిక భద్రతను అందించడానికి ఈపీఎఫ్ఓ వైకల్య పింఛన్లను అందిస్తుంది. దివ్యాంగులైన ఉద్యోగులు, వారి కుటుంబాల తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి 10 సంవత్సరాల కనీస సర్వీస్ పీరియడ్ అనే తప్పనిసరి నిభందనతో పని లేకుండా ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
కుటుంబ ప్రయోజనాలు
ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ సభ్యుడి అకాల మరణం సమయంలో కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రయోజనాలలో ఇవి ఉన్నాయి:
వితంతు పింఛను: జీవిత భాగస్వామి నెలవారీ పింఛనుకు అర్హులు.
పిల్లల పెన్షన్: ఇద్దరు పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెన్షన్ లభిస్తుంది.
అనాథ పింఛన్: జీవిత భాగస్వామి లేకపోతే పింఛన్ ను అనాథలకు కేటాయిస్తారు.
వైకల్య పిల్లల పెన్షన్: దివ్యాంగులైన పిల్లలకు, అదనపు సహాయం కోసం జీవితకాల పెన్షన్ అందిస్తారు.
నామినీ పెన్షన్
కుటుంబం లేని సభ్యులకు, వారు మరణిస్తే పింఛను పొందే లబ్ధిదారుడి నామినేషన్‌ను ఈ పథకం అనుమతిస్తుంది.
ఉపసంహరణ ప్రయోజనాలు
పెన్షన్ అర్హతకు అవసరమైన 10 సంవత్సరాలు పూర్తి చేయకుండా సర్వీసు నుండి నిష్క్రమించిన సభ్యులు ఉపసంహరణ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని ద్వారా తక్కువ సర్వీస్ పీరియడ్ ఉన్నవారు కూడా పదవీ విరమణ లేదా శ్రామిక శక్తి నుండి నిష్క్రమించినప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది.
పెన్షన్ లెక్కింపు ఫార్ములా
పెన్షన్ మొత్తాన్ని నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ × పెన్షనబుల్ సర్వీస్) / 70 అనే ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. ఇక్కడ "పెన్షనబుల్ శాలరీ" అనేది గత 60 నెలల్లో సగటు నెలవారీ జీతం.
Comments
Please login to add a commentAdd a comment