
మాతృమూర్తుల ప్రపంచం చాలా అసాధారణంగా, అద్భుతంగా ఉంటుంది. ఇల్లు, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలను మాతృమూర్తులు చక్కబెట్టే తీరును ఒకసారి పరిశీలిస్తే వారు ఎంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారనేది అర్థమవుతుంది. పరిమిత వనరులతోనే అన్ని అవసరాలను చక్కబెట్టడం నుంచి దీర్ఘకాలిక కోణంలో పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు వేసి, అమలు చేయడం వరకు అమ్మ ఎంతో ఓర్పుగా, క్రమశిక్షణగా అనుసరించే విధానం ఒక మాస్టర్‌క్లాస్‌గా ఉంటుంది. ఇన్వెస్టర్లకు కూడా ఇదే ఓరిమి, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథాలు ఉంటే సంపద సృష్టికి దోహదం చేస్తాయి. డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, మనకు ఎంతో ఇష్టమైన వారి జీవితాలను తీర్చిదిద్దే నిర్ణయాలకు ఎలా కట్టుబడి ఉండాలనే విషయాలకు సంబంధించి అమ్మ నుంచి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు.
ఓర్పు: ప్రక్రియను విశ్వసించడం
ఒకసారి చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకోండి. పిల్లలు మొదటి మాట పలకడం కావచ్చు, మొదటి అడుగు వేయడం కావచ్చు ప్రతీ దాని కోసం అమ్మ ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంది. తొందరపడదు. పిల్లలు తప్పకుండా సాధిస్తారు, వారిలో ఆ సామర్థ్యం ఉంది అని గట్టిగా నమ్ముతుంది. పెట్టుబడులు కూడా ఇందుకు భిన్నమైనవి కావు. మార్కెట్లు పెరుగుతాయి, పడతాయి. కానీ పెట్టుబడులను అలా కొనసాగించడం వల్ల కాంపౌండెడ్ ప్రభావంతో సంపద స్థిరంగా వృద్ధి చెందుతుంది. స్వల్పకాలిక ఒడిదుడుకుల ప్రభావాలకు మనం సులభంగా భయపడిపోవచ్చేమో. కానీ చిన్ననాటి మైలురాళ్లలాగే, ఆర్థిక మైలురాళ్లను సాధించడానికి కూడా సమయం పడుతుంది. నిలకడగా, చిన్న మొత్తాలను పెట్టుబడులు పెడుతూ సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్ద నిధిని సమకూర్చుకునేందుకు సిప్‌లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు) చక్కని సాధనాలుగా నిలుస్తాయి. రూపీ కాస్ట్ యావరేజింగ్, కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందుతూ కాలక్రమేణా సంపదను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయి.
క్రమశిక్షణ: చిన్న చిన్న పనులు, భారీ ఫలితాలు
అమ్మ రోజువారీ దినచర్యే మనకు క్రమశిక్షణ పాఠంగా నిలుస్తుంది. పేరెంటింగ్ కావచ్చు, ఇన్వెస్టింగ్ కావచ్చు క్రమం తప్పకుండా, తరచుగా చేసే పనులు చిన్నవిగానే కనిపించినా భవిష్యత్తును తీర్చిదిద్దే పెద్ద ఫలితాలనిస్తాయి. ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలిగే సామర్థ్యాలనిస్తాయి. మార్కెట్లు పతనమైనప్పుడైనా లేక వ్యక్తిగతంగా ఆటంకాలు ఏర్పడిన కష్ట పరిస్థితుల్లోనైనా సిప్‌ల ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడం వల్ల ఆర్థిక సామర్థ్యం బలపడుతుంది. సిప్‌ను మధ్య మధ్యలో మానేసినా ఫర్వాలేదని అప్పుడప్పుడు అనిపించినప్పటికీ, అలా చేయడం వల్ల, దీర్ఘకాలిక లక్ష్యాలకు హాని కలుగుతుంది. పేరెంటింగ్‌లాగే ప్రతి విషయంలోనూ నిలకడగా ఉండటం ముఖ్యం.
సిప్‌లు: అమ్మ స్టయిల్‌లో పెట్టుబడులు పెట్టడం
మాతృమూర్తులు కేవలం నేటి గురించే కాదు, భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా డబ్బు విలువ గురించి నేర్పించడం కావచ్చు, వారు నిలకడగా చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. సిప్‌లు కూడా ఇలాగే ఉంటాయి. ఆలోచనాత్మకంగా, నిలకడగా పని చేస్తాయి. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులే, అమ్మ కృషిలాగే, పెరిగి పెద్దయి, మంచి ఫలితాలనిస్తాయి. సత్వర లాభాల వెంటబడకుండా, అనిశ్చితుల్లోనూ పెట్టుబడులకు కట్టుబడాలి. ఫలితాలు వచ్చేందుకు తగిన సమయం ఇవ్వాలి. అమ్మలాగా పెట్టుబడి పెట్టడమంటే, సహన శక్తిపై నమ్మకం ఉంచడం. ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం. సురక్షితమైన, స్వతంత్రమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. ఇది స్మార్ట్ ఇన్వెస్టింగ్ మాత్రమే కాదు, దీర్ఘకాలిక దృక్పథంతో నెమ్మదిగా, అర్థవంతమైన విధంగా సంపదను పెంపొందించుకోవడం కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ స్కీములో క్రమం తప్పకుండా (సాధారణంగా నెలవారీగా), ఇంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు సిప్ ఉపయోగపడుతుంది. ఈ విధానంతో మూడు శక్తివంతమైన ప్రయోజనాలు ఉన్నాయి:
రూపీ–కాస్ట్ యావరేజింగ్: మార్కెట్ హెచ్చుతగ్గులను అధిగమించేందుకు సిప్‌లు ఆటోమేటిక్‌గా సహాయపడతాయి. మార్కెట్లు పడినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్లు పెరిగినప్పుడు కాస్త తక్కువ యూనిట్లు వస్తాయి. క్రమేణా కొనుగోలు ధర, నిర్దిష్ట సగటు స్థాయిలో ఉండటం వల్ల కాస్త అదనపు ప్రయోజనాలు చేకూరతాయి.
అలవాటు ఏర్పడటం: మాతృమూర్తుల దినచర్య ఎలాగైతే ఉంటుందో, సిప్‌లు కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ప్రతి నెలా సిప్ కట్టడమనేది ఒక అలవాటుగా మారుతుంది. దీర్ఘకాలిక పొదుపునకు దోహదపడుతుంది.
సరళత్వం: తక్కువ మొత్తాలతోనే పెట్టుబడులను పెట్టడాన్ని ప్రారంభించేందుకు సిప్‌లు ఉపయోగపడతాయి. యువ ఇన్వెస్టర్లకు లేదా వివిధ బాధ్యతలున్న కుటుంబాలకు ఇలాంటి విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల్లో మార్పులు, ఆదాయం పెరిగే కొద్దీ, పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు.
దీర్ఘకాలిక విజన్: భారీ లక్ష్యాలపై దృష్టి
మాతృమూర్తులు కేవలం ఇవాళ్టి గురించే ఆలోచించరు. రాబోయే రోజుల గురించి కూడా ముందు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. స్కూలు ఫీజుల కోసం పొదుపు చేయడం దగ్గర్నుంచి పిల్లల పెళ్ళిళ్ల ఖర్చుల వరకు ప్రతి విషయం గురించి ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ఆలోచిస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఈ దీర్ఘకాలిక విజన్ ఉండటం చాలా ముఖ్యం. సంపద సృష్టి అనేది కేవలం ట్రెండ్‌ల వెంట పరుగెత్తడం ద్వారా కాదు, ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది. పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు లేదా రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడం ఇలా లక్ష్యాల ఆధారితమైనదిగా ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి.
-రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ (రిటైల్ సేల్స్), యాక్సిస్ మ్యుచువల్ ఫండ్