
న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన నిర్మాణ రంగ మెటీరియల్స్ సొల్యూషన్స్ విభాగం బిర్లాన్యూ వచ్చే 3–4 ఏళ్లలో అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ. 1,200 కోట్లు – రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ అవంతి బిర్లా తెలిపారు. అలాగే, అధిక వృద్ధి సాధన దిశగా ఇతర సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు వివరించారు.
పైపులు, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాల వ్యాపార విభాగాలు కీలక వృద్ధి చోదకాలుగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంటీరియర్స్ బ్రాండ్ పారాడోర్ వ్యాపారం కూడా వచ్చే మూడు, నాలుగేళ్లలో రెట్టింపు కాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ గతేడాదే పైపులు, ఫిట్టింగ్స్ తయారీ సంస్థ క్రెస్టియా పాలిటెక్‌తో పాటు దాని నాలుగు అనుబంధ సంస్థలను రూ. 265 కోట్లకు కొనుగోలు చేసింది.
ఏజీఐ గ్రీన్‌ప్యాక్ రూ. 700 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటైనర్ గ్లాస్‌ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ సందీప్ సోమాని తెలిపారు. ఈ ప్లాంటు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 500 టన్నులుగా ఉంటుందని, దీనితో తమ తయారీ సామర్థ్యం సుమారు 25 శాతం పెరుగుతుందని వివరించారు. ఫార్మా, బెవరేజెస్ తదితర రంగాల కోసం ఉత్పత్తులు తయారు చేసే ఈ ప్లాంటు, 24 నెలల్లో అందుబాటులోకి రాగలదని చెప్పారు.