
హీమోఫీలియా, మర్ఫాన్ సిండ్రోమ్ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.
భారత్ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.
50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం.
క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ అంటే..
సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్‌నెస్ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.
లూపస్ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు సీఐ ప్లాన్‌తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు.
కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది..
అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.
అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది.
అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక..
అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్ అప్ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.
రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే..
సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్ డిసీజ్ లేదా రెట్ సిండ్రోమ్‌లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్.. సపోర్టివ్ కేర్‌కి, జీవక్రియ సంబంధ గౌచర్ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.
అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్