Health Insurance Plan
-
రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!
ఆరోగ్య బీమా సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్(Claim)లను అనుమతించలేదు. దాఖలు చేసిన మొత్తం క్లెయిమ్‌ల్లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సాధారణ, స్వతంత్ర ఆరోగ్య బీమా(Health Insurance) సంస్థలకు వచ్చిన మొత్తం రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో.. రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిగాయి. బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల (9.34 శాతం) క్లెయిమ్‌లను తిరస్కరించాయి. 2024 మార్చి నాటికి మొత్తం రూ.7,584.57 కోట్ల (6.48 శాతం) విలువైన క్లెయిమ్‌లు బకాయి ఉన్నాయి. 2023–24లో సుమారు 3.26 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు వచ్చి చేరాయి. వీటిలో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,086గా ఉంది.నగదు రహితం 66.16%.. సెటిల్ అయిన క్లెయిమ్‌ల సంఖ్య పరంగా 72 శాతం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ (TPA) ద్వారా, మిగిలిన 28 శాతం కంపెనీల అంతర్గత యంత్రాంగం ద్వారా పరిష్కారం అయ్యాయి. క్లెయిమ్‌ల సెటిల్మెంట్ విధానంలో 66.16 శాతం నగదు రహితంగా, మరో 39 శాతం రీయింబర్స్మెంట్ విధానంలో పరిష్కరించారు. 2023–24 సంవత్సరంలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మినహాయించి రూ.1,07,681 కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేశాయి. బీమా ప్రీమియం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 20.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్సనల్ యాక్సిడెంట్(Accident), ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా కింద జారీ చేసిన పాలసీలు మినహా సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు 2.68 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 57 కోట్ల మందికి కవరేజ్ ఇచ్చాయి.ఇదీ చదవండి: ‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’165.05 కోట్ల జీవితాలను..2024 మార్చి చివరి నాటికి 25 సాధారణ బీమా సంస్థలు, 8 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు సేవలు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పరిశ్రమ మొత్తం 165.05 కోట్ల జీవితాలను కవర్ చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ఈ–టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రయాణ బీమా కింద కవర్ చేయబడిన 90.10 కోట్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలైన న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాలలో ఆరోగ్య బీమా వ్యాపారం చేస్తున్నాయి. -
రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా?రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే ఇది మీకోసమే.. క్యాష్‌లెస్ బెనిఫిట్స్ ఇలా!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే హాస్పిటల్లో చికిత్సను నగదు రహితంగా పొందొచ్చనే. సొంతంగా సమకూర్చుకునేంత వెసులుబాటు అందరికీ ఉండదు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అంశాలలో క్యాష్‌లెస్ సదుపాయం కూడా ఒకటి. దాదాపు అన్ని బీమా సంస్థలు నగదు రహిత వైద్య సేవల సదుపాయాన్ని ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రక్రియ సాఫీగా సాగిపోవాలి. సంక్లిష్టంగా ఉండకూడదు. కనుక నగదు రహిత క్లెయిమ్‌ల విషయంలో ఇబ్బంది పడకూడదంటే పాలసీదారులు తమవంతుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలన్నీ వివరించే కథనం ఇది... నెట్వర్క్ హాస్పిటల్స్ హెల్త్ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల్లో హాస్పిటల్ నెట్వర్క్ జాబితా ఒకటి. సదరు బీమా సంస్థ నెట్ వర్క్ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంత అనుకూలమని అర్థం చేసుకోవచ్చు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో మొత్తం ఎన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయనే వివరాలను బీమా సంస్థ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆస్పత్రులు ఉండడం వల్ల సమీపంలోని ఆస్పత్రిలో చేరి నగదు రహిత వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు నగదు రహిత వైద్య సేవలు పొందే విషయంలో మరి కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాలసీ నియమ, నిబంధనలు, మినహాయింపులు, రూమ్ రెంట్ పరిమితులు గురించి కూడా తెలియాలి. డాక్యుమెంట్లు బీమా సంస్థలు జారీ చేసే హెల్త్ కార్డ్‌ను చికిత్స సమయంలో వెంట తీసుకెళ్లాలి. ఫిజికల్ కార్డు లేకపోయినా పాలసీ సాఫ్ట్ కాపీ తీసుకెళ్లినా చాలు. ఆధార్, పాన్ కూడా వెంట ఉంచుకోవాలి. లేదంటే చిరునామా ధ్రువీకరణ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో వెంట హెల్త్‌కార్డ్ ఉండేలా చూసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ప్రమాదానికి గురైనా వెంట ఉండే వారు ఆ కార్డ్ ఆధారంగా ఆస్పత్రిలో చేర్పించడం సులభతరం అవుతుంది. మినహాయింపులు/కోపే హాస్పిటల్లో అయిన అన్ని ఖర్చులనూ బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుందని అనుకోవద్దు. డిస్పోజబుల్స్ లేదా కన్జ్యూమబుల్స్ (గ్లోవ్‌లు, కాటన్, సిరంజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు)కు ఎక్కువ శాతం ప్లాన్లు చెల్లింపులు చేయవు. అలాగే, చికిత్సలో భాగంగా రోగి అదనపు సేవలను పొందితే వాటికి అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ లేదా సర్వీస్ చార్జీలకు కూడా చెల్లింపులు రావు. కేర్, మ్యాక్స్ బూపా, డిజిట్, టాటా ఏఐజీ కన్జ్యూమబుల్ రైడర్లను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాయి. హెల్త్ ప్లాన్‌కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకుంటే, కన్జ్యూమబుల్స్కు అయ్యే చార్జీలకు కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. హెల్త్ ప్లాన్‌లో కోపే ఆప్షన్ ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. కోపే అంటే క్లెయిమ్ మొత్తంలో నిర్ణీత శాతం (ఉదాహరణకు 10–20 శాతం) పాలసీదారుడే చెల్లించుకోవడం. దీన్ని ఎంపిక చేసుకుంటే పాలసీ ప్రీమియం తగ్గుతుంది. కానీ, ఆస్పత్రిలో చెల్లించే భారం పడుతుంది. కొన్ని ప్లాన్లలో వ్యాధుల వారీ కోపే ఆప్షన్ ఉంటుంది. ఆయా చికిత్సలకు సంబంధించి మాత్రమే కోపే నిబంధన అమలవుతుంది. ఇవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కోపే ఆప్షన్ ఎంచుకుంటే తనవంతు చెల్లింపులకు వీలుగా అత్యవసర వైద్య నిధి సమకూర్చుకోవడం అవసరం. రూమ్ రెంట్ పరిమితులు ఆరోగ్య బీమా పాలసీల్లో రూమ్ రెంట్ పరిమితులు ఉండడం సహజం. పాలసీ తీసుకునే సమయంలోనే పరిమితులు లేకుండా ‘ఎనీ రూమ్ టైప్’ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, దీనికి కొంచెం ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనికి బదులు సింగిల్ ప్రైవేటు రూమ్, షేర్డ్ రూమ్ పరిమితులు ఎంపిక చేసుకుంటే, ప్రీమియం కొంత తగ్గుతుంది. పాలసీదారులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తమ హెల్త్ ప్లాన్ రూమ్ రెంట్ పరిమితి గురించి తప్పకుండా అవగాహనతో ఉండాలి. అప్పుడే హాస్పిటల్లో చేరినప్పుడు పాలసీ అనుమతించిన రూమ్‌లోనే చేరడానికి వీలుంటుంది. ఒకవేళ పాలసీలో చెప్పినదానికి భిన్నమైన రూమ్ సేవలను పొందితే అప్పుడు పాలసీదారుపై చెల్లింపుల భారం పడుతుంది. కొన్ని ప్లాన్లు రూమ్ రెంట్‌ను సమ్ అష్యూరెన్స్‌లో ఒక శాతానికి పరిమితం చేస్తుంటాయి. అంటే రూ.5 లక్షల ప్లాన్‌లో రూ.5,000, రూ.10 లక్షల ప్లాన్‌లో రూ.10,000 చార్జీ (రోజుకు) మించని రూమ్‌లోనే చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు అయిన యనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీల ప్లాన్లలో ఇలాంటి పరిమితులు ఉంటాయి. ఆస్పత్రుల్లో రూమ్‌ను బట్టి రోగికి అందించే చికిత్సలు, సేవల చార్జీలు మారిపోతుంటాయి. ప్రీమియం రూమ్ సేవలు పొందడం వల్ల బిల్లు భారీగా అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే బీమా సంస్థలు రూమ్ రెంట్ పరిమితి నిబంధనలు పెడుతుంటాయి. ఉదాహరణకు రూ.5,000 రూమ్ రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుని.. రోజుకు రూ.10 వేలు చార్జీ చేసే రూమ్‌లో చేరారని అనుకుందాం. అప్పుడు మిగిలిన రూమ్ రెంట్ రూ.5,000ను పాలసీదారుడే భరించాలి. అంతేకాదు, రూమ్‌లో చికిత్సలకు అయిన వ్యయా ల్లోనూ సగం పాలసీదారుడే చెల్లించాలి. కనుక రూమ్‌రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుంటే, ఆ పరిధిలోని రూమ్‌లోనే చేరడం మర్చిపోవద్దు. లేదంటే రూమ్ రెంట్ పరిమితి లేని ప్లాన్‌కు మారిపోవడం లేదా, రూమ్‌రెంట్ వైవర్ రైడర్ తీసుకోవాలి. ముందుగా తెలియజేయాలి.. ఏదైనా ప్రమాదం లేదంటే మరో అత్యవసర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. దగ్గర్లోని నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచి నిర్ణయం అవుతుంది. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్ మరీ దూరంలో ఉండి, రోగి పరిస్థితి సీరియస్‌గా ఉంటే సమీపంలోని ఏదో ఒక ఆస్పత్రికి వెళ్లాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వేరే మార్గం ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని రకాల చికిత్సలు ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునేవి ఉంటాయి. ఉదాహరణకు మోకాలి శస్త్రచికిత్స, హెర్నియా ఆపరేషన్, క్యాటరాక్ట్ సర్జరీ ఇవన్నీ ముందు అనుకుని తీసుకునే చికిత్సలు. ఇలాంటి వాటికి బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ/బీమా మధ్యవర్తి) నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. హాస్పిటల్లో చేరడానికి వారం ముందు అనుమతి కోరొచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇతర ఆధారాలను టీపీఏ లేదా బీమా కంపెనీ కస్టమర్ కేర్‌కు మెయిల్ చేయాలి. కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఇందుకు సంబంధించి వివరాలు పొందొచ్చు. వారు అడిగిన అన్ని వివరాలు, పత్రాలు ఇస్తే అనుమతి మంజూరు అవుతుంది. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలకు అనుమతి విషయమై హాస్పిటల్‌లోని ఇన్సూరెన్స్ విభాగం సిబ్బంది సాయాన్ని తీసుకోవచ్చు. బీమా సంస్థ లేదా టీపీఏ నుంచి నగదు రహిత వైద్య సేవల కోసం అనుమతి లేఖను తీసుకోవాలి. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అడ్మిషన్ డెస్క్‌కు ఈ లేఖ సమర్పిస్తే సరిపోతుంది. అత్యవసరంగా చేరినట్టయితే బీమా సంస్థ లేదా టీపీఏకి 24 గంటల్లోపు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్‌కు హెల్త్ ప్లాన్ వివరాలు ఇస్తే వారే బీమా కంపెనీకి సమాచారం ఇస్తారు. దూరం బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. ఒక ఆస్పత్రిని తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకునే ముందు బీమా కంపెనీలు ఎన్నో అంశాలను చూస్తుంటాయి. ప్రభుత్వ గుర్తింపు, చికిత్సల చార్జీలు, సేవల నాణ్యత తదితర అంశాలను పరిగణణలోకి తీసుకుంటాయి. మీ నివాసానికి సమీపంలో ఏఏ ఆసుపత్రి బీమా సంస్థ నెట్వర్క్ పరిధిలో ఉందనే వివరాలను సంబంధిత బీమా కంపెనీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. బీమా సంస్థ కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి అడిగినా వివరాలు అందిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఈ జాబితా మారుతుంటుంది. కొన్ని ఆసుపత్రులు జాబితా నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్తవి చేరుతుంటాయి. బీమా సంస్థల పోర్టళ్లలో అప్డేటెడ్ వివరాలు అందుబాటులో ఉంటాయి. నెట్వర్క్ జాబితాలో ఉన్నాయంటే సదరు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పొందొచ్చని అర్థం చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌ను హాస్పిటల్లో చేరే సమయంలో చూపిస్తు చాలు. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ చికిత్స వ్యయాలకు బీమా సంస్థ నుంచి ఆమోదం తీసుకుంటుంది. బీమా కంపెనీ నుంచి ప్రాథమిక ఆమోదం వస్తే చాలు. రోగి నగదు చెల్లించే అవసరం ఏర్పడదు. బీమా సంస్థలే తుది బిల్లును కూడా సెటిల్ చేస్తాయి. పాలసీ నిబంధనల మేరకు కవరేజీ పరిధిలోకి రాని వాటికి మినహాయించి, మిగిలిన బిల్లును పరిష్కరిస్తాయి. అప్పుడు రోగి మిగిలిన మొత్తాన్ని తన వంతుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు హాస్పిటల్ పంపించిన రికార్డుల ఆధారంగా నగదు రహిత సేవలకు అనుమతి ఇవ్వవు. కస్టమర్‌ను రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలంటూ సమాచారం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. నగదు రహిత సేవల నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల.. బిల్లులు, రీయింబర్స్మెంట్ పత్రాలతో హాస్పిటల్, బీమా కంపెనీల చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సిన శ్రమ తప్పుతుంది. -
కేవలం నెలకు రూ. 85 చెల్లిస్తే 5 లక్షల ఆరోగ్య బీమా మీ సొంతం..! వివరాలు ఇవే..!
అతి తక్కువ ప్రీమియంతో అదిరిపోయే హెల్త్ బీమా పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య బీమా ప్లాట్‌ఫాం ప్లమ్ ప్రారంభించింది. కేవలం నెలకు రూ. 85 ప్రీమియం చెల్లిస్తే రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను పొందవచ్చును. డిసెంబర్ 21 న ఈ కొత్త పాలసీను ప్లమ్ ప్రకటించింది. ఎవరికీ వర్తిస్తుందంటే..! చిన్న తరహా స్టార్టప్స్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులు, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే వారు ఈ ఆరోగ్య బీమాను పొందవచ్చును. ఈ బీమాతో ఆయా పాలసీదారులు అపరిమితంగా వైద్యుల అపాయింట్మెంట్స్, వారానికోసారి వెల్నెస్ సెషన్స్, డెంటల్, కళ్ల పరీక్షలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్ కన్సల్టేషన్స్, కోవిడ్-19 చికిత్స మొదలైన వాటికి క్లెయిమ్ చేసుకోనే వీలు ఉంటుంది. అప్పుడే మొదలైన స్టార్టప్స్‌కు చేయూత..! దేశవ్యాప్తంగా సుమారు 6.3 కోట్ల స్మాల్మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. వీటితో పాటుగా భారత్‌లో 1 కోటి 15 లక్షలకు పైగా గిగ్ వర్కర్స్ (కాంట్రాక్టు పద్దతిలో పనిచేసేవారు) ఉన్నారు. వీరికి ఎటువంటి బీమా సౌకర్యాలు లేనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ప్రారంభ దశలో మొదలైన స్టార్టప్స్‌కు ప్లమ్ బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడనుంది. ఆయా స్టార్టప్స్‌లో ఇద్దరు సభ్యుల కంటే తక్కువ టీమ్‌లను కలిగి ఉన్న కంపెనీలకు, స్టార్టప్స్లోని ఉద్యోగులను బీమా కవర్ అందివచ్చును. హెల్త్ బెనిఫిట్స్ అందరికీ ఇవ్వడమే మా లక్ష్యం..! అప్పుడే మొదలైన చిన్న స్టార్టప్స్‌కు, గిగ్ వర్కర్స్కు హెల్త్ బీమాను అందించడమే మా ముఖ్య లక్ష్యమని ప్లమ్ కో-ఫౌండర్, సీఈవో అభిషేక్ పొద్దార్ అన్నారు. ఆయా కార్యాలయాల్లో వెల్నెస్ ప్రవర్తనను సృష్టించాలనే లక్ష్యంతో ఈ బీమాను ప్రారంభించినట్లు తెలిపారు. 2024 నాటికి సుమారు ఒక కోటి మందికి బీమా చేయాలనే ప్లమ్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
ఎలాంటి హెల్త్ రిపోర్ట్స్ అవసరం లేదు..! రూ. 999కే ఆరోగ్య బీమా..!
కరోనా రాకతో ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన అందరిలో వస్తోంది. ఊహించకుండా ఏదైనా పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లులను కడుతూ ఆర్థికంగా కుదేలవ్వకుండా ఆరోగ్య బీమాతో కాస్త ఉపశమనం పొందవచ్చును. బీమా కంపెనీలకు పోటీగా డిజిటల్ చెల్లింపుల యాప్స్ కూడా పలు ఆరోగ్య బీమాలను యూజర్లకు అందిస్తోన్నాయి. తాజాగా ఫోన్‌పే యూజర్ల కోసం సరికొత్త ఆరోగ్యబీమాను మొదలుపెట్టింది. బీమా వివరాలు ఇలా ఉన్నాయి... ఆరోగ్య బీమాను అందించే మొదటి డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే . బీమా పొందడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్ష లేదా రిపోర్టు చూపించాల్సిన అవసరం లేదు. పేరు, లింగం, వయసు, ఈమెయిల్ లాంటి వివరాలను ఫిల్ చేయడంతో సులభంగా బీమా సౌకర్యాన్ని పొందవచ్చును. ఫోన్‌పే కేవలం రూ. 999 చెల్లిస్తే కస్టమర్లకు ఏడాది గాను రూ. 1,00,000 వరకు బీమా రక్షణ వస్తోంది. అయితే మీరు బీమా కవర్ మొత్తాన్ని పెంచాలనుకుంటే...రూ. 2,00,000 ఆరోగ్య బీమా ప్లాన్‌కు రూ. 1999, రూ. 3,00,000 ప్లాన్‌కు రూ. 2649 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆయా వ్యక్తుల వయసును బట్టి ఆరోగ్యబీమా ప్రీమియం మారుతూ ఉంటుంది. రూ.999 బీమాలో వచ్చే కవరేజ్ ఇవే.. రూ. 999 బీమా పథకంతో లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ దక్కుతుంది. ఐసీయూ చికిత్స, డేకేర్ , అంబులెన్స్ ఛార్జీలు, ఆయుష్ చికిత్సతో సహా ఈ బీమాలో పొందవచ్చును. ఇతర ప్రీమియంలో కూడా ఇవే బెనిఫిట్స్ రానున్నాయి. ఈ ఆరోగ్య బీమా సుమారు దేశంలోని 7600 ఆసుపత్రులలో అందుబాటులో ఉంది. ఫోన్‌పే నుంచి ఆరోగ్య బీమాను ఇలా పొందండి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఒపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై ఉన్న బీమా ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు Health@999 ప్లాన్‌పై నొక్కండి. ఆ తరువాత వయసు, ఆరోగ్య బీమా ప్రీమియంను ఎంచుకోండి. దీని తర్వాత మీ పేరు, లింగం, పుట్టిన తేదీ , ఈ-మెయిల్ ఐడిని నమోదుచేయాలి. అన్ని వివరాలను ఫిల్ చేసిన తర్వాత...మీరు ఆయా పాలసీను సబ్‌స్రైబ్ చేసుకున్నట్లు మెసేజ్ వస్తోంది. గమనిక: ఈ ఆరోగ్యబీమాపై జీఎస్టీ వర్తిస్తుంది. చివరిగా చెల్లించే మొత్తం విలువ మారుతుంది. -
కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి!
ఈ మధ్య కంపెనీలు కరోనా మహమ్మారి కారణంగా తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. చాలా కంపెనీలు గ్రూపు హెల్త్ ఇన్స్యూరెన్స్ కింద ఉద్యోగులను కవర్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనుక ఆ ఫార్మాలిటీస్ సరిగ్గా నింపనట్లయితే మీకు అవసరమైన సమయంలో మీరు చేసుకున్న క్లెయిం చెల్లకపోవచ్చు. అందుకే బీమా ప్రయోజనాలు పొందడానికి, గ్రూపు హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిం కొరకు ఫైలింగ్ చేయడానికి ముందు మీరు క్రింది విషయాలు తెలుసుకుంటే మంచిది. మీరు ఉద్యోగి ఐడీ అందుకున్న తర్వాత కంపెనీ పోర్టల్ లో మీ కుటుంబం సమాచారాన్ని అప్ డేట్ చేయండి. బీమాకి సంబంధించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి లేకపోతే క్లెయిం చేయలేరు. మీ ఆరోగ్య బీమా పాలసీలో చేరిన తర్వాత మీకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(టీపీఏ) ఇచ్చిన కార్డును మీ యజమాని ఇస్తారు. ఒకవేళ మీరు ఆసుపత్రిలో క్యాష్ లెస్ ఫెసిలిటీని ఉపయోగించాలని అనుకున్నట్లయితే, ఈ కార్డు మీకు ఇస్తారు. మీరు ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ఈ కార్డుతో పాటు అదనంగా మీరు ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఆరోగ్య బీమా పాలసీలో చేరేటప్పుడు పాలసీ డాక్యుమెంట్ ఎల్లప్పుడూ క్షుణ్ణంగా చదవండి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడేకంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మీరు క్షుణ్ణంగా అందులో ఏమి ఏమి కవర్ చేశారు అనేది తెలుసుకోవాలి. సాధారణంగా, బీమా కంపెనీలు తమ ఖాతాదారులకు నగదు రహిత సేవలను అందించడానికి ఎంపిక చేసిన ఆసుపత్రుల బృందంతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ ఆసుపత్రులను ఎంప్యానెల్డ్ నెట్ వర్క్ ఆసుపత్రులుగా పేర్కొంటారు. పాలసీ డాక్యుమెంట్ చదివేటప్పుడు, ఈ ఆసుపత్రుల జాబితా గురుంచి తెలుసుకోండి. బీమా చేసిన వ్యక్తి మీ భీమా నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో బీమా చేసిన వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య బీమా పాలసీ, టీపీఏ ఈ-కార్డు వివరాలను ఆసుపత్రికి అందించాలి. బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. "మీ కుటుంబం ఆరోగ్య సంరక్షణ కోసం భీమా పాలసీకి సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మీరు పాలసీ సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడంతో పాటు వాటిని సులభంగా గుర్తించే ప్రదేశంలో ఉంచడం మంచిది" అని అన్నారు. మీరు నెట్ వర్క్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీ వైద్య బిల్లులకు సంబంధించి అన్ని ఖర్చులు ఆసుపత్రి ద్వారా బీమా ప్రొవైడర్ లేదా టీపీఏకు వెళ్తుంది. టీపీఏ ఖర్చులను మదింపు చేసిన తర్వాత బీమా కంపెనీ మీ క్లెయిం సెటిల్ చేస్తుంది. బీమా విషయం, క్లెయిం ప్రక్రియ, ఆమోదం, సెటిల్ మెంట్ కు సంబంధించి మీ యజమాని లేదా టీపీఏ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కు మీరు తెలియజేయాలి. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్లు.. క్యాలరీలు కరిగిస్తే డిస్కౌంట్
ముంబై: ఆరోగ్యకరమైన, చురుకైన జీవనవిధానాన్ని అనుసరించే పాలసీదారులను ఆరోగ్య బీమా కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల రెన్యువల్‌పై 80 నుంచి 100 శాతం వరకు తగ్గింపుతోపాటు ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరానికి రెన్యువల్‌పై 25 శాతం నుంచి 50 శాతం వరకు సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను పెంచే ఆప్షన్‌ను ఇస్తుంటాయి. కానీ, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యాక్టివ్ హెల్త్’ ప్లాన్‌లో వరుసగా రెండేళ్ల పాటు ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మూడో ఏడాది రెన్యువల్ సమయంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. మూడో ఏడాది ప్రీమియం చెల్లింపుల్లో దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. తగినన్ని యాక్టివ్ డేజ్‌ను సమకూర్చుకున్న కస్టమర్లకే ఆదిత్య బిర్లా ఈ ఆఫర్ ఇస్తోంది. ఒక యాక్టివ్డే అంటే రోజులో 10,000 అడుగులు వేయడం (300 క్యాలరీలను కరిగించుకోవడం). అంటే క్రమం తప్పకుండా నడు స్తూ, ఆరోగ్య రక్షణ చర్యలను తీసుకున్న వారికి రివార్డులతో ప్రతిఫలాన్ని అందిస్తోంది. యాక్టివ్ హెల్త్ యాప్ ద్వారా కస్టమర్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని కంపెనీ నమోదు చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో క్లెయిమ్‌లు తగ్గుతాయి. కనుక బీమా సంస్థలపై ఆ మేరకు భారం తగ్గుతుంది. మొదటి అడుగు మాదే.. పాలసీదారులు చురుగ్గా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రోత్సహిస్తున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూ రెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. నూరు శాతం డిస్కౌంట్ ఇవ్వడం పరిశ్రమలో మొదటిసారిగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే రివార్డులను ప్రీమియం చెల్లింపు ల్లో సర్దుబాటు చేసుకోవడం లేదా మందుల కొనుగోలు లేదా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. లేదా వరుసగా రెండేళ్లపాటు క్లెయిమ్‌లు లేకపోతే మూడో ఏడాది నూరు శాతం బీమా కవరేజీని పెంచుకునే ఆప్షన్‌ను కూడా కంపెనీ ఇస్తోంది. ఫ్యూచర్ జనరాలి సైతం.. ఫ్యూచర్ జనరాలి సంస్థ ఈ నెలలోనే ఈ తరహా ఫీచర్‌తో ‘హెల్త్ సూపర్ సేవర్’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో 1ఎక్స్, 2ఎక్స్ పేరుతో రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1ఎక్స్‌లో క్రితం ఏడాది పాలసీదారు నుంచి ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంపై 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 2ఎక్స్‌లో క్రితం రెండు సంవత్సరాల్లోనూ క్లెయిమ్‌లే లేనట్టయితే.. తదుపరి రెండు సంవత్సరాల ప్రీమియంలో 80 శాతం తగ్గింపు ఇస్తోంది. -
బీమా చెల్లించకుంటే రాకండి
వాషింగ్టన్: అమెరికా వెళ్ళేందుకు సమాయత్తమౌతోన్న వేలాది మంది భారతీయుల ఆకాంక్షలపై ట్రంప్ తాజా ఆదేశాలు నీళ్ళు చల్లుతున్నాయి. ఆరోగ్యబీమా ఉన్నదని రుజువు చేసుకోలేని వారినీ, వైద్యఖర్చులను భరించలేని వారినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వీసానిరాకరణ నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆరోగ్యబీమా లేకుండా, వైద్యబిల్లులు చెల్లించే ఆర్థిక స్థోమత లేకుండా అమెరికాలోకి అడుగుపెట్టే వలసదారులను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారంతేల్చి చెప్పారు. అంతేకాకుండా అమెరికా ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం కాబోమని నిరూపించుకున్న వారినే అనుమతించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. అమెరికా పౌరుల్లోకంటే ఆరోగ్యబీమా లేని చట్టబద్దమైన ప్రవాసులు మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఆరోగ్యవ్యవస్థకీ, పన్నులు చెల్లిస్తోన్న అమెరికా పౌరులకువలసదారుల వల్ల ఖర్చు పెరగకూడదని ట్రంప్ భావిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించారు. -
బీమా నచ్చకుంటే మారిపోండి!
పోర్టబిలిటీతో పలు లాభాలు రెండేళ్ల క్రితం... ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకున్నాక అది నచ్చకపోతే సొమ్మో, ప్రయోజనాలో నష్టపోకుండా దాన్నుంచి బయటపడే మార్గం ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆరోగ్య బీమా పోర్టబిలిటీని బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ అమల్లోకి తెచ్చింది. దీంతో... ప్రయోజనాలను కోల్పోనవసరం లేకుండానే ఒక బీమా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే స్వేచ్ఛ పాలసీదారులకు లభించింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడమే కాకుండా ఒకే కంపెనీలోని ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారే వెసులుబాటు కూడా దక్కింది. పోర్టబిలిటీ ద్వారా ఖాతాదారులకు సమకూరిన హక్కులేంటంటే... 1) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో దేని నుంచి దేనికైనా పాలసీలను మార్చుకోవచ్చు. 2) వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ పాలసీలకు వర్తిస్తుంది. అయితే ఇలా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినపుడు, పాలసీ తీసుకున్నపుడు ఉండే 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను రద్దు చేస్తారు. దీనికి తోడు కొత్త కంపెనీలో బీమా చేసిన మొత్తం ఇంతకుముందు కంపెనీలో చేసిన మొత్తం కంటే తక్కువ ఉండకూడదు. చేయాల్సిందేమిటంటే... ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కంపెనీని మార్చినపుడు కొత్త పాలసీదారు మాదిరిగానే అండర్‌రైటింగ్ ప్రక్రియలన్నీ పూర్తిచేయాలి. అండర్‌రైటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఏ పాలసీనైనా తిరస్కరించే అధికారం కొత్త కంపెనీకి ఉంది. ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీ తీసుకున్నప్పటికీ మునుపటి ప్రయోజనాలన్నీ కొనసాగుతాయి. పోర్టబిలిటీ అంటే పాలసీని మధ్యలో ఆపేయడం కాదు, కొనసాగించడమే. అంతకుముందు ఉన్న వ్యాధులకు బీమా కవరేజీని నష్టపోవాల్సిన అవసరం లేదు. కొత్త కంపెనీల్లో ప్రీమియం చార్జీలు తక్కువగా ఉండడం, పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందడం, కొత్త ప్లానులు అందుబాటులోకి రావడం, మరింత పారదర్శకత వంటి అదనపు ప్రయోజనాలు పోర్టబిలిటీ ద్వారా సమకూరుతాయి. ప్రీమియం, బెనిఫిట్ల పరంగా తమకు అనుకూలమైన కొత్త ప్లాన్‌ను పాలసీదారులు ఎంచుకోగలుగుతారు. పోర్టబిలిటీని వినియోగించుకునే ముందు, ప్రస్తుత పాలసీతో పొందుతున్న ప్రయోజనాలను తాము మారదలుచుకున్న ప్లాన్‌తో వచ్చే లాభాలతో పోల్చిచూసుకోవడం ఎంతైనా అవసరం. సదరు ప్లాన్‌లోని ఫ్లెక్సిబిలిటీ, ధర, గరిష్ట వయోపరిమితి, వెయిటింగ్ పీరియడ్, వ్యాధుల కవరేజీ, పాలసీ తీసుకోవడానికి ముందునుంచే ఉన్న వ్యాధులకు సంబంధించిన నిబంధనలు, హాస్పిటల్ నెట్వర్క్ తదితర అంశాలను పరిశీలించడం ముఖ్యం.