మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్‌లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.
ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు.
క్లెయిమ్ ఎలా?
రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్‌మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.
ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?
అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం.
Comments
Please login to add a commentAdd a comment