health insurance
-
రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా?రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం. -
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో క్షీణత
న్యూఢిల్లీ: నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. నివేదికలోని వివరాలు..2023–24లో నెట్ ఇన్కర్డ్ (నికర) క్లెయిమ్‌లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి. పాలసీల సరెండర్లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది. -
హెల్త్ ఇన్సూరెన్స్ ‘పోర్టింగ్’.. తొందరొద్దు!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్ ఇన్సూరెన్స్. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్‌ప్లాన్ ఆకర్షించొచ్చు. అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్ పోర్టింగ్. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మొబైల్ నంబర్ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం పోర్ట్ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్‌లో చేరిపోవచ్చు. పోర్టింగ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్తమ కంపెనీ ప్లాన్‌లోకి ‘పోర్ట్’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్ ప్లాన్ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.‘‘పోర్ట్ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్‌లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్ ఆప్షన్‌ను పరిశీలించాలి. చేదు అనుభవం..కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. పాలసీని పోర్ట్ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్‌ను పోర్టింగ్‌తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు.అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్ పెట్టుకోవాలంటూ పాలసీబజార్ కస్టమర్ కేర్ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్ నిర్ణయం పట్ల కుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కుమార్ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను కుమార్ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్‌కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్‌తో నో క్లెయిమ్ బోనస్ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు. పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్‌తో కట్టించారు సదరు మార్కెటింగ్ సిబ్బంది. వారి సూచనతో సూపర్ టాపప్ ప్లాన్ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి. పోర్టింగ్ ప్రక్రియ ఇలా..పోర్టింగ్ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్‌కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్‌తో ఏ కంపెనీ ప్లాన్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.పోర్టింగ్ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్ క్లెయిమ్‌ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్‌ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.పోర్టింగ్ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు. ఆచరణ వేరు..ప్రస్తుత హెల్త్ ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్ బోనస్ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్‌కు అర్హులు. పోర్టింగ్‌తో వేరే కంపెనీ ప్లాన్‌లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్‌లో మాదిరే రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ కోల్పోయినట్టు అవుతుంది.పోర్టింగ్‌తో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ క్లాజ్ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్‌లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకునే ముందు సమ్ అష్యూరెన్స్ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...సమ్ అష్యూరెన్స్, నో క్లెయిమ్ బోనస్, నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్‌కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌తో, అన్ని వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.పోర్టింగ్ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్‌లో రూ.10 లక్షలకే వెయిటింగ్ పీరియడ్‌ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్ పీరియడ్లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.కుమార్ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ ఉన్నప్పటికీ.. పోర్ట్ తర్వాత రూ.10 లక్షలకే సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్ బోనస్ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది. పోర్టింగ్ ఏ సందర్భాల్లో..?ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్ కోసం పోర్టింగ్ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్ వెల్త్ సహ వ్యవస్థాపకుడు నిషాంత్ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. పోర్టింగ్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్‌కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్‌లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్‌ను పరిశీలించొచ్చు.అలాగే, ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్‌తో వెళ్లే ప్లాన్‌లో ఎలాంటి రూమ్ రెంట్ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్‌ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్ సర్వీస్ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్ సహేతుకమే. ఇవి తెలుసుకోవాలి..⇒ పోర్టింగ్‌తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. ⇒ పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్ తర్వాత కొత్త సంస్థ ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్‌ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్ పీరియడ్ కొసాగుతుంది. ⇒ పోర్టింగ్‌కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్‌్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి. ⇒ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి. ⇒ పోర్టింగ్ తర్వాత అధిక సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్ అష్యూరెన్స్ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి. ⇒ అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్ హెల్త్ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ⇒ పోర్టింగ్ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి. -
బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
ఆరోగ్యం, సంపద... ఏ మనిషి జీవితంలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశాలివి. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏమీ ప్రయోజనం ఉండదు. అదే... సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే చాలు... ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం అత్యంత ప్రధానం అన్న విషయం దీన్నిబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది.ఇవాళ్టి రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. కోవిడ్ మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో ఎరుకే.. అదీగాక... మారిన కాలమాన పరిస్థితుల్లో... ఎప్పుడు ఎలాంటి రోగాలు పుట్టుకొస్తాయి ఎవ్వరం చెప్పలేం. అప్పటిదాకా ఎంతో హాయిగా.. ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క అనారోగ్యం వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్ని తల్లకిందులు చేసేస్తోంది. అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే... లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.. చూస్తూ చూస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా... అంచేత అప్పో సొప్పో చేసి అయినా వైద్యం చేయిస్తాం.పల్లెలు పట్టణాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోతూ ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అవుతుందో... బయటకు వెళ్లిన మనిషి సురక్షితంగా వస్తాడో రాడో అంతుచిక్కని రోజులివి. ఇలా ఆకస్మికంగా తలెత్తే అనివార్య ఖర్చుల్ని తలెత్తుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటప్పుడే... మన చేతిలో ఆరోగ్య బీమా కార్డు ఉంటే... కొండంత ధైర్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లే. పైగా నేటి రోజుల్లో కుటుంబానికంతటికీ జీవిత బీమా తో పాటు, ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరంగా మారిపోయింది. ఈనేపథ్యంలో ఆరోగ్య బీమా స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం.మనదేశంలో ఆరోగ్య బీమాను అందించే ప్రముఖ కంపెనీలు ఇవి.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కేర్ హెల్త్ ఇన్సూరెన్స్హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ తదవనివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీఅకో జనరల్ ఇన్సూరెన్స్టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్వైద్యం ఖరీదైన అంశంగా మారిపోయిన ఈరోజుల్లో మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని వైద్య ఖర్చులనుంచి గట్టెక్కిస్తుంది.కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పాలసీ తీసుకోవచ్చు.వయోపరిమితిని బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. చిన్న వయసులో తక్కువ ప్రీమియం కే పెద్ద పాలసీ తీసుకోవచ్చు.ఏదైనా ఒక రోగంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఆ వైద్యానికయ్యే ఖర్చుల్ని మనం ఎలాంటి నగదు చెల్లించనక్కర్లేకుండా పొందవచ్చు. మనం పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.వీటిలో అత్యంత ప్రధానమైంది మనం బీమా తీసుకునే సంస్థ ఏయే హాస్పిటల్స్ తో అనుసంధానం అయివుందో తెలుసుకోవడం.అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్ తో పాటు, స్థానిక హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి వీలుగా కవరేజ్ కలిగి ఉండాలి.ఒక రోగానికి సంబంధించి హాస్పిటల్ లో జాయిన్ కావడానికి ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల పాటు వైద్య ఖర్చులు పొందే సౌలభ్యాన్ని వివిధ బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు వాటి వివరాలు తెలుసుకోవాలి.మనం తీసుకునే పాలసీ కి చెల్లించే ప్రీమియానికి కొంచెం అదనంగా చెల్లించడం ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.యాక్సిడెంట్ అయ్యి... ప్రాణాపాయం తప్పి శాశ్వత అంగ వైకల్యానికి లోనైతే... అడిషనల్ రైడర్స్ తీసుకోవడం వల్ల పెన్షన్ మాదిరి నెలనెలా (మన సమ్ అష్యురెడ్ ని బట్టి) సొమ్ములు పొందవచ్చు. సాధారణంగా వృద్ధాప్యానికి మరోపేరే అనారోగ్యం. కాబట్టి కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వయోపరిమితితో సంబంధం లేకుండా.. ఎంత వయసువారైనా బీమా పాలసీ లు తీసుకోవడానికి ఐఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. ఇది సీనియర్ సిటిజెన్లకు వరమనే చెప్పాలి. అలాగే ఒకే ప్రీమియం తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించే విధంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.పాలసీ తీసుకునే టైం కే రోగాలు ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తూ బీమా సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏయే బీమా సంస్థలు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ను పేర్కొంటున్నాయో తెలుసుకోవాలి.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డ్ కింద మనం కట్టే ప్రీమియానికి (షరతులకు లోబడి) రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సాధారణంగా 24 గంటలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే పాలసీ వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సంస్థలు అవుట్ పేషెంట్ గా చేయించుకునే వైద్యానికయ్యే ఖర్చులను కూడా బీమా కవరేజ్ లోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు... ప్రత్యేకించి ఓపీ చికిత్సల కోసమే ఉపయోగపడే విధంగా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.ఎలాంటి ఆరోగ్య సేవలు పొందవచ్చు, ప్రీమియంలు ఎలా ఉంటాయి ఇత్యాది అంశాలను మరోసారి చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్‌లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని: నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్ చేసుకుంటుంది. నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. టాప్–అప్, సూపర్ టాప్–అప్ ప్లాన్లు: బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్–అప్, సూపర్ టాప్–అప్ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. వెల్నెస్, ప్రివెంటివ్ కేర్: బీమా సంస్థలు వెల్నెస్, ప్రివెంటివ్ కేర్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్ చెకప్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, డైట్ కౌన్సిలింగ్ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది. -
3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ
పాలసీదారుల కీలక సమాచారం లీక్ కావడంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ తన భద్రతను పటిష్టం చేసుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ తరహా డేటా లీకేజీ ఘటన మరోసారి చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన డేటా లీకేజీ ఘటనలో 3.1 కోట్ల స్టార్ హెల్త్ కస్టమర్ల మొబైల్ ఫోన్, పాన్, చిరునామా తదితర సున్నిత సమాచారం బయటకు రావడం గమనార్హం. షెంజెన్ అనే హ్యాకర్ ఈ సమాచారాన్ని ఏకంగా ఒక పోర్టల్‌లో విక్రయానికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందే..‘ఒకరితో ఒకరు అనుసంధానమై పనిచేయాల్సిన ప్రపంచం ఇది. ఏజెంట్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు అన్ని అనుసంధానమై పని చేసే చోట తమ వంతు రక్షణలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బలహీన పాస్వర్డ్లు తదితర వాటిని హ్యాకర్లు సులభంగా గుర్తించగలరు. కేవలం అంతర్గతంగానే కాకుండా, స్వతంత్ర నిపుణుల సాయంతో మేము ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకున్నాం’ అని ఆనంద్‌రాయ్ వివరించారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయంటూ, బీమా కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..అసలేం జరిగింది..?స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి ఉంచినట్లు గతంలో గుర్తించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్ల అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం. మద్రాస్ హైకోర్ట్ ఆదేశాల మేరకు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్‌తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్‌కు ప్రయత్నించాలి.పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్‌ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.గమనించాల్సినవి..పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్వివరాలు అన్నీ తెలపాలి..కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు. -
‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.ఈ నిధి ఎందుకంటే..ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.చిన్నపాటి ఖర్చుల కోసం..అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!ఎంత ఉండాలంటే..ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
దివ్యాంగులకు ఆరోగ్య బీమా.. ఈ 5 తప్పిదాలు చేయొద్దు
సరైన ఆరోగ్య బీమా పథకమనేది దివ్యాంగులకు ఒక రక్షణ కవచంలాంటిది. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన పథకాన్ని తీసుకోగలిగితే ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే, సరైన బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. అర్థం కాని పరిభాష, పైకి కనిపించని నిబంధనలు, అనేకానేక ఆప్షన్లు మొదలైన వాటితో ఇదో గందరగోళ వ్యవహారంగా ఉంటుంది.ఒక్క చిన్న తప్పటడుగు వేసినా సరైన కవరేజీ లేకుండా పోవడమో, ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావడమో లేక అత్యవసర పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురుకావడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దివ్యాంగులు ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు నివారించతగిన తప్పిదాలపై అవగాహన కల్పించడం ఈ కథనం ఉద్దేశం. అవేమిటంటే..కీలక వివరాలను పట్టించుకోకపోవడం: ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు స్పష్టంగా కనిపించే కీలక విషయాలను కూడా అంతగా పట్టించుకోకపోవడమనేది సాధారణంగా చేసే తప్పిదాల్లో ఒకటిగా ఉంటుంది. దివ్యాంగుల విషయానికొస్తే, పాలసీలోని ప్రతి చిన్న అంశమూ ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుంది. కాబట్టి అన్ని నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, పరిమితులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి.నిర్దిష్ట అనారోగ్యాలు, చికిత్సలకు బీమా వర్తించకుండా మినహాయింపుల్లాంటివేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటి వివరాలను పట్టించుకోకపోతే ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావచ్చు లేదా క్లెయిమ్ పూర్తి మొత్తం చేతికి రాకపోవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.కేవలం ప్రీమియంనే ప్రాతిపదికగా ఎంచుకోవడం:ప్రీమియం అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే ఆలోచనతో పథకాన్ని ఎంచుకుంటే చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. సాధారణంగా ప్రీమియంలు తక్కువగా ఉంటే మన జేబు నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు.కవరేజీ పరిమితంగానే ఉండొచ్చు లేదా దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలకు బీమా ఉపయోగపడని విధంగా పరిమితుల్లాంటివి ఉండొచ్చు. ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ గణనీయంగా మెరుగైన కవరేజీని ఇచ్చే పథకాన్ని ఎంచుకుంటే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది.కో–పే, సబ్–లిమిట్స్ తెలుసుకోకపోవడం: క్లెయిమ్ చేసేటప్పుడు చేతికి వచ్చే మొత్తంపై కో–పే, సబ్–లిమిట్స్ అనే కీలకాంశాలు చాలా ప్రభావం చూపుతాయి. కో–పే అనేది క్లెయిమ్ సమయంలో పాలసీదారు తాను భరించేందుకు అంగీకరించే నిర్దిష్ట శాతాన్ని తెలియజేస్తుంది. కో–పే పరిమితులు ఎంత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ పేఅవుట్ అంత తక్కువవుతుంది.అలాగే, సబ్–లిమిట్స్ అనేవి నిర్దిష్ట అనారోగ్యాలు లేక చికిత్సలు, అంటే ఉదాహరణకు క్యాటరాక్ట్, మోకాలి మార్పిడి మొదలైన వాటికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒక స్థాయికి పరిమితం చేస్తాయి. ఈ పరిమితులను చూసుకోకపోతే జేబుకు గణనీయంగా చిల్లు పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం: కాలం గడిచే కొద్దీ ఆరోగ్య అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్‌ను ఎంచుకోవడం కీలకం. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి అదనపు సంరక్షణ లేక విభిన్నమైన చికిత్సలు అవసరమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు, ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో తలెత్తే అవకాశము న్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.వివిధ ఆప్షన్లను పరిశీలించకపోవడం: ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు కనిపించిన మొదటి పథకాన్ని తీసేసుకోకుండా వివిధ ప్లాన్లను పరిశీలించి చూసుకోవాలి. కవరేజీ, ఖర్చులు, ప్రొవైడర్ నెట్‌వర్క్‌లు, అదనపు ప్రయోజనాలపరంగా వివిధ పథకాల్లో మార్పులు ఉంటాయి. పలు ప్లాన్లను పోల్చి చూసుకునేందుకు కాస్త సమయం వెచ్చించాలి. దివ్యాంగులకు సంబంధించి ఒక్కో ప్లాన్‌లో కవరేజీ ఏ విధంగా ఉందనేది పరిశీలించి చూసుకోవాలి.ఇందుకోసం కంపారిజన్ వెబ్సైట్ల వంటి సాధనాలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే బీమా అడ్వైజర్ల సలహా తీసుకోవాలి. ప్లాన్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి విధానాన్ని పాటిస్తే అవసరాలకు తగినట్లుగా ఉండే సమగ్రమైన, చౌకైన పథకాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రీమియం మాత్రమే చూసుకోవద్దు. కవరేజీ పరిమితులను పరిశీలించుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవాలి. వివిధ ఆప్షన్లను పోల్చి చూసుకోవాలి. -
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్‌కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్‌ల గురించి తెలుసుకుని పార్ట్‌టైమ్‌గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్‌ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్‌పై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్‌కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
ఐదు కొత్త రైడర్లు.. 60కి పైగా ప్రయోజనాలు: టాటా ఏఐజీ
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల సమగ్రతను పెంచడమే లక్ష్యంగా భారతదేశపు అగ్రగామి సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. కొత్తగా 60 పైగా ప్రయోజనాలను అందించే అయిదు రైడర్లను ఆవిష్కరించింది. వైద్య ఖర్చులు పెరుగుతూ, ఆరోగ్య సంరక్షణ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఆరోగ్యం మీద తలెత్తుతున్న సరికొత్త ఆందోళనలు, జీవన విధానాల్లో మార్పుల సమస్యలను పరిష్కరించేలా ఈ రైడర్లు వ్యక్తిగత అవసరాలకు అనుగణంగా డిజైన్ చేశారు.కస్టమర్లకు వినూత్నమైన, సందర్భోచితమైన సొల్యూషన్స్ అందించడం ద్వారా ఆరోగ్య బీమా రంగంలో పురోగతి సాధించడంపై టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ ఆవిష్కరణలు నిదర్శనంగా నిలుస్తాయి. కంపెనీ ఆవిష్కరించిన కొత్త రైడర్లలో మెంటల్ వెల్బీయంగ్, ఎంపవర్హర్, ఓపీడీ కేర్, క్యాన్కేర్, ఫ్లెక్సీ షీల్డ్ ఉన్నాయి. ఇవి మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ కేర్ వంటి క్రిటికల్ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చేవిగా రూపొందాయి.ఎంపవర్హర్ రైడర్ అనేది మహిళల్లో వంధ్యత్వం, పీసీవోఎస్, ఇతరత్రా జననేంద్రియ సమస్యల్లాంటి వాటికి సమగ్రమైన పరిష్కారం అందించడం లక్ష్యంగా తయారైంది. ఇక మెంటల్ వెల్బీయింగ్ అనేది పరిశ్రమలోనే తొలిసారిగా మెంటల్ హెల్త్ ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ అండ్ రీహాబిలిటేషన్ కవరేజీని అందిస్తుంది. క్యాన్కేర్ రైడర్ అనేది క్యాన్సర్ సంబంధ రక్షణ కల్పిస్తుంది. పెరుగుతున్న వైద్య వ్యయాలు, రోజువారీ ఆరోగ్య ఖర్చుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించే విధంగా ఓపీడీ కేర్, ఫ్లెక్సీ షీల్డ్ అనేవి ఉంటాయి.మెరుగ్గా క్లెయిమ్స్ ప్రక్రియకస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి కీలకమైన క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియను టాటా ఏఐజి గణనీయంగా మెరుగుపరుచుకుంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.7 శాతంగా ఉన్న క్యాష్‌లెస్ క్లెయిమ్స్ వినియోగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 76.95 శాతానికి పెరిగింది. 96 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్స్ నాలుగు గంటల్లోనే ప్రాసెస్ చేస్తున్నారు. 85 శాతం రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లు అయిదు రోజుల వ్యవధిలోగానే సెటిల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతటా క్యాష్‌లెస్ విధానాన్ని 100% అమలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.కస్టమర్లకు సంతృప్తికరంగా సేవలు అందించడం, సమర్ధమైన పనితీరు విషయాల్లో పరిశ్రమలోనే కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ వేగవంతమైన, నిరాటంకమైన విధంగా సేవలు అందించడంలో టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ మెరుగుదలలు నిదర్శనంగా నిలుస్తాయి.నెట్వర్క్ విస్తరణదేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా ఏఐజి తన నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించింది.గడిచిన 18 నెలల్లో 64 శాతం మేర పెంచుకోవడం ద్వారా భారతదేశవ్యాప్తంగా 11,700 పైచిలుకు నెట్వర్క్ హాస్పిటల్స్‌తో టాటా ఏఐజీ తన కార్యకాలాపాలు విస్తరించింది. ముఖ్యంగా సేవలు అంతగా అందని ప్రాంతాల్లో కూడా సర్వీసులను విస్తరించేందుకు కట్టుబడి ఉంది. 5,000 మంది కంటే ఎక్కువ డాక్టర్లు, 3,000 పైగా డయాగ్నోస్టిక్ ప్రొవైడర్లు గల ఓపీడీ నెట్వర్క్ అనేది 10 పైగా భాషల్లో పటిష్టమైన టెలీకన్సల్టేషన్ సర్వీసు మద్దతుతో కస్టమరుకు మరింత సౌకర్యవంతంగా సమగ్రమైన హెల్త్‌కేర్ కవరేజీ అందేలా తోడ్పడుతోంది.ఆరోగ్య బీమా విభాగంలో వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా మా వ్యూహంలో భాగంగా ఈ రైడర్లు ఆవిష్కరించాము. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విస్తరించడంపై మేము మరింతగా దృష్టి పెడుతున్నాం. ఈ ప్రాంతాల్లో హెల్త్‌కేర్ యాక్సెస్, అవగాహన వేగంగా పెరుగుతోంది. మా శాఖల నెట్వర్క్, ఏజంట్లు, హాస్పిటల్ భాగస్వాముల సంఖ్యను పెంచుకోవడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత మందికి అందుబాటులోకి తేవాలని మేము నిర్దేశించుకున్నాం. ఆరోగ్య బీమా విభాగంలో ఇదే మా వృద్ధి అంచనాలకు తోడ్పడనుందని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్-ఏజెన్సీ ప్రతీక్ గుప్తా అన్నారు.220 ప్రాంతాల్లో, 11,700+ ఆస్పత్రుల నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూనే ఆరోగ్య బీమా రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు టాటా ఏఐజీ కట్టుబడి ఉంది.రైడర్ల ప్రత్యేకతలుఎంపవర్హర్: పీసీవోఎస్, వంధ్యత్వం, గైనకాలజీ అంశాలు, మహిళల్లో వచ్చే క్యాన్సర్లతో పాటు మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన కవరేజీనిచ్చే విధంగా ఈ రైడర్ తయారైంది. సర్వికల్ క్యాన్సర్ టీకాల్లాంటి ప్రివెంటివ్ కేర్ కవరేజీలను కూడా ఇది అందిస్తుంది.మెంటల్ వెల్బీయింగ్: ముందస్తుగానే గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడంలో తోడ్పడే విధంగా, పరిశ్రమలోనే తొలిసారిగా ప్రివెంటివ్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్, సైకలాజికల్ థెరపీ, రీహ్యాబిలిటేషన్ సర్వీసులు సహా మానసిక ఆరోగ్య సమస్యలకు కవరేజీని అందిస్తుంది.క్యాన్కేర్: నిర్దిష్ట తీవ్రత గల క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యపరీక్షల్లో వెల్లడైన పక్షంలో సమ్ ఇన్సూర్డ్‌ను ఏకమొత్తంగా చెల్లించే విధంగా విస్తృతమైన క్యాన్సర్ కవరేజీని అందిస్తుంది.ఓపీడీ కేర్: డాక్టర్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లులు, కంటి చూపు సంరక్షణ వంటి అవుట్పేషంట్ ఖర్చులకు కవరేజీనిస్తుంది. తద్వారా రోజువారీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడంలో తోడ్పాటు అందిస్తుంది.ఫ్లెక్సీ షీల్డ్: వైద్యపరమైన ద్రవ్యోల్బణం నుంచి పాలసీదార్లకు రక్షణ కల్పించే విధంగా డిజైన్ చేశారు. రిస్టోర్ ఇన్ఫినిటీ+ ద్వారా సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రిస్టోర్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ షీల్డ్ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపుదలతో పెరిగే వైద్య వ్యయాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్, ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధి/వ్యాధులకు డే 31 కవరేజీ, ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ క్యాష్తో పాటు మరెన్నో ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది. -
బీమాపై జీఎస్టీ కోతకు ఓకే!
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పట్ల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయం వచి్చంది. దీనిపై వచ్చే నెల చివర్లోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గల మంత్రుల బృందాన్ని (జీవోఎం) కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ నివేదిక అందిన తర్వాత దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో బీమా పాలసీలపై ప్రీమియం తగ్గింపు ప్రధానంగా చర్చకు వచి్చంది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండడంతో పన్ను రేటు తగ్గింపు పట్ల చాలా రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కలి్పంచనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సరీ్వస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. కేన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు: కొన్ని రకాల కేన్సర్ ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి.. కేదార్నాథ్ తదితర పర్యటనల కోసం వినియోగించుకునే హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చార్టర్ హెలీకాప్టర్లపై ఎప్పటి మాదిరే 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. ఆన్లైన్ గేమింగ్‌పై 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్టీని అమలు చేయడం వల్ల ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. -
జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్ కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్కీన్ స్నాక్స్పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్‌పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.గత ఆరు నెలల్లో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు. -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్‌ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తేస్తారా?
వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశంలో బీమా రంగం, ప్రభుత్వ ఖజానాపై విస్తృత ప్రభావాలను కలిగించే ఒక ముఖ్యమైన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఆ ప్రధాన ప్రతిపాదన.దీని వల్ల ఏటా ప్రభుత్వ ఆదాయానికి రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.“జీఎస్టీ నుంచి ఆరోగ్య బీమాను పూర్తిగా మినహాయిస్తే, నష్టం దాదాపు రూ. 3,500 కోట్లు. సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో జీఎస్టీ నుండి ఆరోగ్య బీమా మినహాయింపును కౌన్సిల్ ఆమోదిస్తే భారీ ఆదాయ నష్టం కలిగిస్తుంది” అని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.కమిటీ సిఫార్సులే కీలకంప్రస్తుతం అన్ని రకాల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ పన్ను నుండి ఆరోగ్య బీమాను మినహాయించాలనే ప్రతిపాదన రాష్ట్ర, కేంద్ర రెవెన్యూ అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ చర్చలో ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కౌన్సిల్‌కు సిఫార్సులు చేయడం కమిటీ బాధ్యత.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ మినహాయింపు ప్రభుత్వ రెవెన్యూపై ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందన్నది ఫిట్మెంట్ కమిటీ విశ్లేషించి సిఫార్సులు చేస్తుంది. వీటిపైనే కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. -
ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్య ఖర్చులకోసం ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటారు. అయితే పాలసీ తీసుకోవడం ముఖ్యం కాదు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే క్లెయిమ్ అయ్యేలా ఉండే బీమాను ఎంచుకోవడం అవసరం. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక భారం తప్పుతుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఎంత మొత్తం అవసరం..?ఏటా మెడికల్ బిల్లులు పెరుగుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 30-40 శాతం మేర మెడికల్ బిల్లులు అధికమవుతున్నాయి. అందుకు తగినట్లుగా మీ వయసు, మీపై ఆధారపడిన వారి పరిస్థితులకు అనుగుణంగా ఎంత మొత్తం పాలసీ కవర్ ఉండాలో నిర్ణయించుకోవాలి.క్లెయిమ్ సెటిల్మెంట్మార్కెట్లో ఆరోగ్య బీమా కంపెనీలు చాలానే ఉన్నాయి. తీవ్ర వ్యాధుల వైద్యానికి అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు రూ.లక్షల్లో ఉన్న క్లెయిమ్‌లు సెటిల్ చేయకుండా కొర్రీలు పెడుతున్నాయి. తక్కువ కవర్ ఉన్న పాలసీను క్లెయిమ్‌లు చేస్తూ సెటిల్మెంట్ రేషియోను పెంచుకుంటున్నాయి. అయితే ఈ వివరాలు ఐఆర్డీఏఐ అధికారిక వెబ్సైట్లో ఉంటాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. 90 శాతం కంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉండే కంపెనీలను ఎంచుకుంటే ఉత్తమం.రూమ్ లిమిట్మెడికల్ బిల్లులు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సదుపాయాలకు అయ్యే ఖర్చులు మొత్తంగా ఆసుపత్రి రూమ్ రెంట్‌పై ఆధారపడుతాయి. ఉదాహరణకు పాలసీలో సింగల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని సెలక్ట్ చేసుకుంటే దాని రెంట్‌కు అనుగుణంగానే ఇతర బిల్లులు చెల్లిస్తారు. అంతకుమించి ఖర్చు అయితే మాత్రం పాలసీదారులు భరించాల్సి రావొచ్చు. కాబట్టి రూమ్ రెంట్‌కు సంబంధించిన పరిమితులు ఉండకుండా చూసుకోవాలి.క్యాష్‌లెస్ ఆసుపత్రులుఉద్యోగ రీత్యా చాలామంది హైదరాబాద్, బెంగళూరు, ముంబయి.. వంటి నగరాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగం శాశ్వతం కాదు కదా. భవిష్యత్తులో సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా ఆసుపత్రులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు ప్రస్తుతం మీరు ఉంటున్న ప్రాంతాల్లో దగ్గర్లో ఎలాంటి నెట్వర్క్ ఆసుపత్రులున్నాయో తెలుసుకోండి. పాలసీ నెట్వర్క్ హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుంటే కవరేజీ పరిమితి వరకు బీమా కంపెనీలే భరిస్తాయి. ఒకవేళ ప్రమాదం జరిగిన చోట నెట్వర్క్ ఆసుపత్రి లేకపోయినా కంగారు పడకూడదు. వైద్యం తర్వాత సదరు ధ్రువపత్రాలతో ఆ డబ్బును తిరిగి పొందవచ్చు.కో-పే మంచిదేనా..?కో-పే అందిస్తున్న బీమా పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. అయితే వైద్యం తీసుకున్నాక కో-పే ప్రకారం బీమా కంపెనీ కొంత, పాలసీదారులు ఇంకొంత చెల్లించాలి. ఎలాంటి కో-పే లేకుండా కొంత ప్రీమియం ఎక్కువైనా మొత్తం డబ్బు బీమా కంపెనీలే చెల్లించే సదుపాయాన్ని ఎంచుకోవాలి.రిస్టోరేషన్ సౌకర్యంపాలసీదారులు తమతోపాటు కుటుంబం సభ్యులకు కలిపి ఫ్యామిలీ ఫ్లోటింగ్ పాలసీ తీసుకుంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగి పాలసీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నారనుకోండి. మళ్లీ ఇంట్లో ఇంకొకరికి ఆరోగ్య సమస్యలు వస్తే పరిస్థితి ఏంటీ? అందుకే ఏడాదిలో ఎన్నిసార్లైనా బీమా మొత్తం తిరిగి రిస్టోర్ అయ్యే పాలసీని తీసుకుంటే మేలు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!ఇవీ గమనించండి..డేకేర్ ట్రీట్మెంట్ అందించే పాలసీలు ఎంచుకోవాలి.ఏదైనా అత్యవసర సమయాల్లో ఇంటివద్దే వైద్యం అందిచేలా ఉండాలి.అంబులెన్స్ ఛార్జీలు కవర్ అవ్వాలి.ఫ్రిహెల్త్ చెకప్ సౌలభ్యం ఉండాలి.డాక్టర్‌కు సంబంధించిన ఆన్లైన్ కన్సల్టేషన్ ఛార్జీలు అందించాలి.ఇప్పటికే ఉన్న జబ్బులకు తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీ బెటర్.పిల్లలు కావాలనుకునే వారు మెటర్నిటీ వైద్య ఖర్చులు కవర్ అయ్యే పాలసీ ఎంచుకుంటే మేలు. -
బీమా సొమ్ముకు దోమ కాటు!
దేశంలో బీమా సొమ్మును దోమలు ఖాళీ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో దోమల కారణంగా వచ్చే వ్యాధులది మూడో స్థానమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దోమలతో వచ్చే రోగాల కేసులు అంతకంతకూ పెరుగుతుండగా.. అదే స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లూ రెట్టింపవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ పాలసీ బజార్ ఇటీవల క్లెయిమ్స్‌పై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దేశంలో హెల్త్ పాలసీలకు సంబంధించి ఏ ఏ వ్యా«ధులకు సంబంధించి క్లెయిమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే దానిపై చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బీమా సంస్థలు నమోదు చేసిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధులకే అవుతున్నాయని సర్వేలో తేలింది.వీటిలోనూ డెంగీ, మలేరియా తదితర సాంక్రమిత వ్యాధులదే అగ్రభాగంగా ఉంది. ప్రతి పది పాలసీల్లో 4 వరకూ దోమకాటుతో వచ్చే వ్యాధులవేనని పాలసీ బజార్ వెల్లడించింది. జూలై, ఆగస్ట్‌లలో ఎక్కువగా.. దోమకాటు కారణంగా క్లెయిమ్‌లు ఎక్కువగా రెండు నెలల్లోనే జరుగుతున్నాయి. జూలై, ఆగస్ట్‌లో వచ్చే క్లెయిమ్స్ దరఖాస్తుల్లో 60 శాతం వరకూ దోమకాటు వ్యాధులవే ఉన్నాయి. సెప్టెంబర్ లోనూ ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని సర్వేలో తేలింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దోమల బెడద ఎక్కువగా ఉందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. పాలసీ బజార్ ద్వారా నివేదించిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల అధ్యయనం ప్రకారం.. సీజనల్ వ్యాధుల క్లెయిమ్‌లలో డెంగీ, మలేరియా వంటి సాంక్రమిత వ్యాధులు 15 శాతం ఉన్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సాధారణంగా రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకూ ఖర్చవుతోంది. జీర్ణకోశ వ్యాధులదీ అదే దారి.. వర్షాకాలంలో వచ్చే మరో అనారోగ్య సమస్య స్టమక్ ఫ్లూ వంటి జీర్ణకోశ వ్యాధులకూ క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి మలేరియాతో సమానమైన చికిత్స ఖర్చులుంటాయి. సీజనల్ క్లెయిమ్‌లలో 18 శాతం ఈ వ్యాధికి సంబంధించినవే. కాలానుగుణ అనారోగ్య క్లెయిమ్‌లలో మరో 10 శాతం వివిధ అలెర్జీలకు సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా.. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, బ్రోన్కైటిస్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు 20 శాతం, సీజనల్ వ్యాధులకు మరో 12 శాతం క్లెయిమ్స్ జరుగుతున్నాయి. అయితే వీటి చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మాత్రమే. సీజనల్ వ్యాధులకే ఎక్కువగా క్లెయిమ్‌లు దేశంలో సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ వీటి బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారు. దీనివల్ల క్లెయిమ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు ఇళ్లల్లోనే చికిత్స పొందేవారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. క్లెయిమ్ చేసుకోవచ్చనే ధీమాతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు వస్తుండటం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. – సిద్ధార్థ్ సింఘాల్, పాలసీబజార్ ఇన్సూరెన్స్ హెడ్ -
ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. అందులోనూ క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటూంటారు. ఏదైన జబ్బుపడి ఆసుపత్రిలో చేరితేనే ఆ బీమా పరిహారం వస్తుంది. కానీ ట్రీట్మెంట్కు ముందు, తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడినపుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.క్రిటికల్ ఇల్నెస్ పాలసీలుక్యాన్సర్..లివర్..గుండెజబ్బు వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమికంగా గుర్తించినపుడే పరిహారం అందించే పాలసీలు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కేటగిరీలోకి వస్తాయి. ప్రమాదవశాత్తు ఏదైనా వ్యాధి బారిన పడినా పాలసీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. ఈ పాలసీలో భాగంగా బీమా సంస్థలు కనీసం రూ.5 లక్షల నుంచి బీమా అందిస్తున్నాయి. గరిష్ఠంగా ఎంత పాలసీ తీసుకోవాలనేది పాలసీదారుల ప్రత్యేక అవసరాలపై ఆధారపడుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే బీమా కంపెనీలు డబ్బు చెల్లిస్తాయి. కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చాక కూడా వైద్య ఖర్చులు భరించే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: క్రూడ్ దిగుమతులు 40 శాతం పెంపు.. అయినా భారత్‌కు మేలే!ఒక్కో ప్రాణాంతక వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలున్నాయి. కుటుంబంలో తీవ్ర వ్యాధులున్నవారికి ఎలాంటి పాలసీ నప్పుతుందో దాన్నే తీసుకోవచ్చు. ఈ రోగాలకు నిత్యం వైద్యం అవసరమవుతూనే ఉంటుంది. కాబట్టి చాలిచాలని జీతాలు, ఆదాయాల వల్ల కుటుంబం చితికిపోకుండా ఉండాలంటే ఈ పాలసీలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలసీ తీసుకునేముందు కచ్చితంగా అన్ని నిబంధనలు తెలుసుకోవాలంటున్నారు. -
ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు!.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్
లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం జీఎస్టీ తొలగించాలనే ఇండియా కూటమి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. జీఎస్టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ ఉండేది. ఇది కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇది ఉందని వెల్లడించారు.ఇక్కడ నిరసన తెలుపుతున్నవారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా? వారు తమ తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు దాని గురించి లేఖలు వ్రాసి, రాష్ట్రాలకు 2/3 వంతు ఉన్న GST కౌన్సిల్లో దానిని పెంచాలని కోరారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి డ్రామా అని నిర్మలా సీతారామన్ అన్నారు.జీవిత, వైద్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిని కోరుతూ నితిన్ గడ్కరీ మొదట లేఖ రాసారు. ఈ చర్య బీమా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకూండా.. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో కీలకమైన బీమా ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచుతుందని ఆయన అన్నారు.నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్.. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి నాకు మెమోరాండం సమర్పించింది. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్ అండ్ మెడికల్‌పై GST ఉపసంహరణకు సంబంధించినదని గడ్కరీ అన్నారు.Tax has been there on medical insurance even before GST was introduced. There was already a Service Tax on medical insurance, before the GST was introduced. This is not a new tax, it was already there in all the states. Those protesting here, did they discuss regarding the… pic.twitter.com/iPfSp8goRr— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) August 7, 2024 -
స్టార్ హెల్త్ నుంచి ‘హోమ్ హెల్త్‌కేర్’ సేవలు
చెన్నై: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. ‘హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్’ పేరుతో తీసుకొచి్చన ఈ సేవలను రానున్న రోజుల్లో మిగిలిన పట్టణాలకు సైతం విస్తరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల ఇంటివద్దే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు వీలుగా కేర్24, పోరి్టయా, కాల్హెల్త్, అతుల్య హోమ్‌కేర్, అర్గాలాతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కోయింబత్తూర్, పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఈ సేవలను పరీక్షించి చూశామని, ఆ తర్వాతే ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు ఆనంద్‌రాయ్ వెల్లడించారు. జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు 044–69006900 నంబర్‌కు లేదా స్టార్ హెల్త్ మొబైల్ అప్లికేషన్ నుంచి అభ్యర్థన పంపి, ఇంటి వద్దే వైద్య సేవలను అందుకోవచ్చు. కస్టమర్ నుంచి అభ్యర్థన వచి్చన వెంటనే వైద్య బృందం స్టార్ హెల్త్ కస్టమర్ ఇంటికి చేరుకుని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు సూచిస్తారు. ఐదు రోజుల చికిత్సకు (వైద్యులు, నర్సుల ఫీజులు సహా) ఒక్క రోగి రూ.7,000–7,500 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టార్ హెల్త్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిహర సూదన్ తెలిపారు. తదుపరి చికిత్స అవసరం పడితే సమీపంలోని హాస్పిటల్‌ను సూచిస్తామని చెప్పారు. -
ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదనలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే వార్షిక కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు కేటాయించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది.ఇదీ చదవండి: అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలిబడ్జెట్ రూపొందించడానికి ముందు ప్రభుత్వం వివిధ పరిశ్రమ వర్గాలను సంప్రదించింది. అందులో బడ్జెట్లో ఆర్థిక వనరులను పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వం తక్కువ ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశ జీడీపీలో 1.1 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్య సంక్షేమానికి కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. వీక్షిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పింది. పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి ప్రాధాన్యతా రంగంగా ఆరోగ్య రంగాన్ని మార్చాలని సూచించింది. -
రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా
బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది. 'అదితి' పేరుతో తీసుకొచ్చిన ఈ బీమా శస్త్రచికిత్సలకు రూ. 1 కోటి, వైద్య నిర్వహణ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు హామీతో కుటుంబానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది.తక్కువ ప్రీమియంకే సమగ్ర కవరేజీని అందించడం ద్వారా దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ ప్లాన్ లక్ష్యం అని డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్‌కేర్ మేజర్ పేర్కొంది. ఈ కొత్త బీమాను సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియంతో పొందవచ్చు. సాధారణంగా ఇలాంటి బీమాకు ప్రీమియం అధికంగా ఉంటుంది. గరిష్టంగా నలుగురు సభ్యులున్న కుటుంబం ఈ బీమా ప్లాన్ తీసుకునేందుకు అవకాశం ఉంది.నారాయణ హెల్త్ దేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి హాస్పిటల్ చైన్‌గా నిలిచింది. దేశం అంతటా దాదాపు 21 హాస్పిటల్ నెట్‌వర్క్‌లు, అనేక క్లినిక్‌లను కలిగి ఉంది. బెంగళూరులో ఇది దాదాపు 7 ఆసుపత్రులు, 3 క్లినిక్‌లను కలిగి ఉంది. ఎన్హెచ్ఐ వెంచర్ కింద ‘అదితి’ పైలట్ ప్లాన్ మొదట మైసూరు, బెంగళూరులో తర్వాత కోల్‌కతా, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడితో సహా శస్త్ర చికిత్సలకు కోటి రూపాయల వరకు, వైద్య చికిత్సల కోసం రూ. 5 లక్షల వరకు అదితి కవరేజీని అందజేస్తుంది.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి కార్డియాక్ సర్జన్. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.