జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటం
– ప్రభుత్వ మెడలు వంచి ఆరోగ్య బీమాను తీసుకొచ్చాం
– వెనుకబడిన ప్రాంతాలాభివృద్ధిలో పాత్రికేయులదే ప్రథమ స్థానం
– కర్నూలు జిల్లాలో కోటి రూపాయలతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు
– ఏపీయూడబ్ల్యూజే ప్రాంతీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటాలు చేసేందుకు ఏపీయూడబ్ల్యూజే సిద్ధంగా ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు, బండపల్లి అక్కులప్ప పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను ప్రభుత్వం మెడలు వంచి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్టులకు అందుతున్న ప్రతి పథకం ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితమేనని చెప్పారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏపీయూడబ్ల్యూజే కర్నూలు, అనంతపురం ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతి–మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుతోపాటు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మహాలక్ష్మి కమ్యూనికేషన్ ఎండీ సత్య, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థి కేజేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..కర్నూలులోని జర్నలిస్టులకు హౌస్ ఫర్ ఆల్ స్కీంలో రేషన్‌కార్డు ఉన్నా లేకున్నా ఇళ్లు నిర్మించేందుకు కలెక్టర్, హౌసింగ్ పీడీలకు లేఖ రాశానని, వెంటనే జర్నలిస్టుల జాబితాను తనకు అందజేస్తే ఇళ్లు మంజూరుకు మార్గం సుగమం అవుతుందన్నారు. స్థలమున్న వారు ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కర్నూలులో పాత్రికేయుల కోసం రిక్రియేషన్ క్లబ్ నిర్మించాలని సీఎం కోరుతానని చెప్పారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న మాట్లడుతూ..పాత్రికేయుల కోసం కోటి రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూ సభ్యత్వం ఉన్న రిపోర్టర్ చనిపోయినా, ప్రమాదంలో గాయపడినా ఆదుకోవడానికి ఈ నిధి నుంచి సాయాన్ని అందిస్తామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను అమ్ముకుని దర్జాగా తిరుగుతున్న వారిపై పోరాటం తప్పదన్నారు. మరోవైపు వెనుకబడిన కర్నూలు, అనంతపురం జిల్లాల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, పాత్రికేయులు తమ కథనాలతో ప్రజలను మేల్కోపాలని సూచించారు. సదస్సుకు ముందు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ వరకు జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాజు, హుస్సేన్, కిశోర్, జమ్మన్న, శ్రీనివాసులుగౌడ్, శీను, శేఖర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు మౌలాలి, స్నేహాల్ తదితరులు పాల్గొన్నారు.