- ప్రభుత్వానికి ఏపీయూడబ్ల్యూజే నేతల ప్రశ్న
- దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు (రాజ్‌విహార్): సమాజంలో జరిగే అంశాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడుల చేస్తే సహించబోమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు టి. అంబన్న హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొండేపిలో సాక్షి రిపోర్టర్, రాజమహేంద్రవరం (రాజమండ్రి) టీవీ-5 రిపోర్టర్లపై జరిగిన దాడులను నిరశిస్తూ శుక్రవారం కలెక్టరేట్ మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత్రికేయులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్నారు.
‘సాక్షి’ దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జీ కె.జి. రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రాజధాని పేరుతో అమరావతిలో జరుగుతున్న భూ కుంభకోణాన్ని ఎత్తి చూపుతూ కథనాలు రాస్తున్నప్పటి నుంచి దాడులు చేస్తున్నారన్నారు. వాస్తవాలు రాస్తున్న పాత్రికేయులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. వార్తా కథనాలపై విచారణ పేరుతో రిపోర్టర్లను పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారని, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ది హిందు దినపత్రిక ప్రతినిధి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
మీడియాపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తేవాలని టీవీ-9 జిల్లా కరస్పాండెంట్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు జర్నలిస్టులపై దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సాక్షి టీవీ జిల్లా కరస్పాండెంట్ లోకేష్ మండిపడ్డారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి హుసేన్, సహాయ కార్యదర్శి శేఖర్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హుసేన్, వీడియో జర్నలిస్టు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు స్నేహాల్, మౌలాలి, చాంద్, మధు, రిపోర్టర్లు ఎస్.పి. యూసుఫ్, గోపాలకృష్ణ, జమ్మన్న, శ్రీనివాసులు, రఫీ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
- జిల్లా వ్యాప్తంగా నిరసనలు..
జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరశిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు టి. అంబన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆలూరులో మోకాళ్లపై నిలిచి ఆందోళన చేయగా నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరులో రాస్తారోకో, హొళగుంద, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాయలం, పెద్దకడుబూరు, పాములపాడు, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆదోని, కొత్తపల్లి తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించినట్లు తెలిపారు.