Media Field
-
‘టీఎంటీ’ విభాగంలో ఏఐ ప్రభావం
దేశంలో టెక్నాలజీ, మీడియా, టెలికమ్యునికేషన్(టీఎంటీ) విభాగాల్లో కృత్రిమమేధ(ఏఐ) ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ కేపీఎంజీ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)2024లో ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని నివేదిక పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు(సీడీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లను సంప్రదించి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు కేపీఎంజీ ప్రతినిధులు తెలిపారు.నివేదికలోని వివరాల ప్రకారం..టీఎంటీ విభాగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికాం రంగంలో నెట్‌వర్క్‌ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా కంటెంట్‌ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది.55 శాతం టీఎంటీ సంస్థలు పూర్తిగా ఏఐను వినియోగిస్తున్నాయి.37 శాతం సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వాడేందుకు వివిధ దశల్లో పని చేస్తున్నాయి.40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరుగైన అంచనాను సాధించడానికి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఏఐను వాడుతున్నాయి.టెలికాం రంగంలో ఎక్కువగా ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.టెలికాం రంగంలో ఏఐ వల్ల 30 శాతం సేవల నాణ్యత మెరుగుపడుతుందని కంపెనీలు అనుకుంటున్నాయి. రాబడి వృద్ధి 26%, మోసాల నివారణ 32% పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవవనరులు లేవు.27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల్లోని వర్క్‌ఫోర్స్‌లో 30-50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు.టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని విధానాలు పాటించాలని కేపీఎంజీ సూచనలు చేసింది. ‘మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి. ఖర్చులను తగ్గించడానికి నెట్వర్క్ ఆటోమేషన్‌పై దృష్టి సారించాలి. 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్లను అందించాలి. అందుకు హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలి. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్లతో కలసి పని చేయాలి. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు’ అని తెలిపింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) పార్ట్నర్ అఖిలేష్ టుతేజా మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత మెరుగ్గా సేవలందిస్తోంది. కేవలం టీఎంటీ రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’ అన్నారు. -
నిజమైన పాత్రికేయులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నిజమైన పాత్రికేయులను అగౌరవపరిచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. వారికి అన్నివేళలా అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవస్థపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించిన 38 ఎకరాల భూపత్రాలను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాప్రభుత్వంలో పాత్రికేయులు’ కార్యక్రమంలో సొసైటీకి సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జేఎన్జే సొసైటీలో సభ్యులు కాని ఇతర జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సిటీ నిర్మాణంలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలని కోరారు. మీడియా అకాడమీకి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. పాత్రికేయులకు స్వేచ్ఛ యాజమాన్యాల విధానాలు ఏ విధంగా ఉన్నా, పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను అర్థం చేసుకొని, వారికి సంక్షేమం అందించడంలో ముందుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనేక ఆంక్షలుండేవని, తమ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, తమకు కష్టాన్ని తెచ్చేలా ఉండకూడదన్నారు. పత్రికా సమావేశాల్లో ఆ ట్యూబ్...ఈ ట్యూబ్ అంటూ నిజమైన పాత్రికేయులకన్నా వారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఏమన్నా అంటే పత్రికలపై దాడి అని అల్లరి చేస్తున్నారని, వారు ఏం అడుగుతారో.. ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఎవరిని జర్నలిస్ట్‌గా చూడాలో పాత్రికేయులే చెప్పాలన్నారు. పాత్రికేయుల ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త విధానాలు రూపొందించాలని మీడియా అకాడమీని సీఎం ఆదేశించారు. కొంతమంది పాత్రికేయులు విలువల్లేకుండా రాజకీయ పార్టీల యజమానులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నడుపుతున్న పత్రికల పోకడలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఉన్మాద ధోరణితో వెళుతున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని కోరారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల అప్పగింత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ విలేకరులకు కూడా స్థలాలు ఇవ్వాలన్నారు. అనంతరం మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం సీఎం రేవంత్‌రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జేఎన్జే నాయకులు కిరణ్‌కుమార్, రవికాంత్‌రెడ్డి, వంశీశ్రీనివాస్, రమణారావు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Bangladesh: పత్రికా కార్యాలయం ధ్వంసం.. మహిళా జర్నలిస్టుపై దాడి
బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్స్, కర్రలతో దాడి చేశారు. అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు 70 మంది బషుంధరా గ్రూప్‌నకు చెందిన ‘ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఒక మహిళా జర్నలిస్ట్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.కాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడి హిందువులు, వారి సంస్థలపై వరుస దాడులు జరుగుతున్నాయి. -
ఐఏఎన్ఎస్లో అదానీకి మెజార్టీ వాటాలు
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ .. మీడియా రంగంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ఇండియాలో 50.5 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ లావాదేవీ నిర్వహించింది. ఐఏఎన్ఎస్, అందులో వాటాదారు (ఎండీ, ఎడిటర్–ఇన్–చీఫ్) సందీప్ బమ్జాయ్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. అయితే, కొనుగోలు కోసం ఎంత వెచి్చంచినదీ మాత్రం వెల్లడించలేదు. ‘ఐఏఎన్ఎస్ నిర్వహణ నియంత్రణ అంతా ఏఎంఎన్ఎల్ చేతిలో ఉంటాయి. సంస్థలో డైరెక్టర్లను ఎంపిక చేసే అధికారాలు కూడా ఉంటాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. కొనుగోలు అనంతరం ఐఏఎన్ఎస్ ఇకపై ఏఎంఎన్ఎల్కు అనుబంధ సంస్థగా వ్యవహరిస్తుందని వివరించింది. మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను అనారోగ్యం బారిన పడినప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితులు మారాయని బమ్జాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌నకు వాటాలు విక్రయించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు భద్రత కలి్పంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మెజారిటీ వాటాలు విక్రయించేసినందున ఇకపై సంస్థ రోజువారీ నిర్వహణలో పాల్గొనబోనని పేర్కొన్నారు. ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ ఖాతాలో మొత్తం మూడు మీడియా సంస్థలు (ఎన్డీటీవీ, క్వింటిలియన్, ఐఏఎన్ఎస్) చేరినట్లయింది. ఐఏఎన్ఎస్ కథ ఇదీ.. ఐఏఎన్ఎస్ అనేది ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయుల అవసరాల కోసం 1986లో ఇండో–ఏíÙయన్ న్యూస్ సర్వీస్‌గా ప్రారంభమైంది. అటు తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా భారత్, దక్షిణాసియాపై ప్రధానంగా దృష్టి పెడుతూ పూర్తి స్థాయి వైర్ ఏజెన్సీగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 12 కోట్లు, అంతకు ముందు రూ. 9 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సంస్థలో 200 మంది పైచిలుకు ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా (ఉత్తర అమెరికా, యూరప్ మొదలైన ప్రాంతాల్లో) 350కి పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. బీక్యూ ప్రైమ్ అనే ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ గతేడాది మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్డీటీవీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. -
మీడియా, ఎంటర్టైన్మెంట్ ఆదాయం... రూ. 6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం భారీ వృద్ధిని చూడనుంది. 2027 నాటికి పరిశ్రమ ఆదాయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ 73.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని (రూ.6.03 లక్షల కోట్లు) పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది. వినియోగదారుల ప్రాధాన్యతలు పెరుగుతూ ఉండడం, ఇంటర్నెట్ విస్తరణ, కొత్త టెక్నాలజీల అవతరణ ఇవన్నీ కూడా మీడియా, వినోద పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమకు 2022ను కీలక మలుపుగా చెప్పుకోవాలి. 5.4 శాతం వృద్ధితో ఆదాయం 2.32 లక్షల డాలర్లకు (రూ.190 లక్షల కోట్లు) చేరింది. 2021లో వృద్ధి 10.6 శాతంతో పోలిస్తే సగం తగ్గింది. వినియోగదారులు చేసే ఖర్చు తగ్గడమే ఇందుకు కారణం’’అని నివేదిక తెలిపింది. మొత్తం ప్రకటనల ఆదాయంలో అతిపెద్ద విభాగంగా ఉన్న ఇంటర్నెట్ ప్రకటనల విభాగంలో వృద్ధి గతేడాది స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో ఆశావహం భారత్‌లో మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి ఆశావహ పరిస్థితులు నెలకొన్నట్టు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. 2022లో పరిశ్రమ ఆదాయం 15.9 శాతం వృద్ధి చెంది 46,207 మిలియన్ డాలర్లుగా (రూ.3.78 లక్షల కోట్లు) ఉన్నట్టు వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్, సంప్రదాయ టీవీ, ఇంటర్నెట్, అవుట్ ఆఫ్ హోమ్ ప్రకటనల దన్నుతో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు వివరించింది. ఇదీ చదవండి ➤ Economic Loss due to floods: కన్నీటి వరదలు.. ఎన్ని వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాయో తెలుసా? ఎస్బీఐ రిపోర్ట్ ముఖ్యంగా 2022లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించడం మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. నూతన ఆవిష్కరణలతో ఓటీటీ ఆదాయం 2022లో 1.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని, 2021లో 1.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో పోలిస్తే 25 శాతం అధికమని, 2018లో ఉన్న ఆదాయంతో పోలిస్తే ఆరు రెట్లు వృద్ధి చెందినట్టు వివరించింది. భారత్‌లో ఓటీటీ ఆదాయం ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, 2027 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వినియోగం విస్తృతం ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), మెటావర్స్ విస్తరణతో వినియోగం విస్తృతమైంది. ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగేందుకు రూపాంతర ఆవిష్కరణలపై కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా చీఫ్ డిజిటల్ ఆఫీసర్ మన్‌ప్రీత్ సింగ్ అహుజా తెలిపారు. మొబైల్ వినియోగం పెరగడం ప్రస్తుత చానళ్లపై ప్రభావం చూపిస్తుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ చానళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందున, సంప్రదాయ మీడియా, వినోద వ్యాపార సంస్థలు సరైన విధానాలను అవలంబించడం కీలకమని పేర్కొంది. భారత్ ఈ ఏడాది వేగంగా వృద్ధి సాధిస్తున్న వార్తా పత్రికల మార్కెట్‌గా ఉన్నట్టు తెలిపింది. ఓటీటీ, కనెక్టెడ్ టీవీ మార్కెట్‌కు భారత్‌లో భారీ వృద్ధి అవకాశాలున్నట్టు అంచనా వేసింది. -
అందమే అసూయ పడేలా ఉంది.. ఇంతకీ ఎవరీ సౌందర్య!
బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమలోనూ అడుగుపెడుతూ తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా ఏఐ (కృతిమ మేధస్సు) మీడియా రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో, కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందించిన 'లిసా' 'సనా' అనే ఇద్దరు వర్చువల్ న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ మీడియా సంస్థ వర్చువల్ న్యూస్ రీడర్ ప్రవేశపెట్టింది. హాయ్ నా పేరు సౌందర్య అంటూ ఆ రోబోట్ పాఠకులకు పరిచయం చేసుకుంది. అనంతరం తను మాట్లాడుతూ.. ‘ నాలో కొంతమంది సహచరులు (AI న్యూస్ ప్రజెంటర్లు) ఉత్తర భారతదేశంలోని కొన్ని ఛానెల్‌లలో వార్తలు అందిస్తున్నారు. నేను సౌందర్య, పవర్ టీవీ ద్వారా సౌత్ ఇండియా మొదటి రోబోటిక్ యాంకర్ అని తెలిపింది. ఈ ఛానెల్ ప్రస్తుతం రోబో న్యూస్ రీడర్‌తో వివిధ వార్తా కార్యక్రమాలతో కూడా ప్రయోగాలు చేస్తుంది. కేవలం వీళ్లే కాకుండా దేశంలోని కొన్ని ఇతర ఛానెల్‌లు కూడా తమ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ ప్రెజెంటర్లతో ముందుకు వస్తున్నాయి. ఇటీవల, OTV అనే ఒడియా ఛానెల్ రాష్ట్రం మొదటి AI న్యూస్ ప్రెజెంటర్ లిసాను ప్రారంభించింది. ఇంగ్లీష్, ఒడియా రెండింటిలోనూ దోషరహిత వార్తలు చదువుతూ చాలా మందిని ఆకట్టుకున్న తర్వాత లిసా ఇంటర్నెట్ను వైరల్‌గా మారింది. ఇంకా ముందుకు వెళితే, న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ కృత్రిమ మేధస్సును ఉపయోగించి తనకు భర్తను సృష్టించుకుని, అతనితో సంభాషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరుతోంది. భారతదేశంలోని ప్రముఖ మ్యాగజైన్ కంపెనీలలో ఒకటైన ఇండియా టుడే గ్రూప్ తన వార్తా సంస్థ ఆజ్ తక్ కోసం ఒక కృత్రిమ మేధస్సుతో కూడిన మహిళను సృష్టించింది. 'సనా'గా పిలవబడే ఈ మహిళ గత మార్చిలో ప్రపంచానికి పరిచయమైంది. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
ప్రజలే బుద్ధి చెప్పే రోజొస్తోంది
నగరంపాలెం (గుంటూరు): రాష్ట్రంలో ఒక వర్గం మీడియా ప్రజా వ్యతిరేక ధోరణులు, తప్పుడు కథనాల (ఫేక్ న్యూస్)పై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ, బెటర్ ఆంధ్రప్రదేశ్ (బాప్), నవ్యాంధ్ర ఇంటలెక్చ్యువల్స్ ఫోరం, ఎడిటర్స్ అసోసియేషన్, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై పాలించే ప్రభుత్వాలను కొన్ని పత్రికలు, చానళ్లు శాసించడం సరికాదని హితవు పలికారు. ఈ పరిస్థితి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానెళ్ల కుట్రను ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలో బుద్ధి చెప్పే రోజులొస్తాయని వ్యాఖ్యానించారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం గుంటూరు నగరంలోని మహాత్మాగాంధీ కళాశాల ఆవరణలో ‘ఆంధ్రప్రదేశ్ మీడియా–నిరాధార, పక్షపాత వార్తలు– పర్యావసానాలు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా అబద్ధపు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆ పత్రికలు, ఆ చానళ్లు చెప్పినట్టు ప్రజలు నడుచుకోవాలని చెప్పడం దుర్మార్గం. ఫేక్ న్యూస్‌పై యుద్ధం అనివార్యం. – డొక్కా మాణిక్య వరప్రసాదరావు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జర్నలిజం సిగ్గుపడుతోంది ప్రస్తుతం జర్నలిజం సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఫేక్‌న్యూస్ ప్రచారం చేయడం కోసం అనేక కుట్రలు చేస్తున్నారు. ఒక విషయం కరెక్టా కాదా అనేది నిర్ధారించుకోకుండానే ప్రసారం, ప్రచారం చేస్తున్నారు. పెత్తందారులకు, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడం సరైన పద్ధతికాదు. – చందన మధు, బెజవాడ మీడియా సెంటర్ అధ్యక్షుడు తప్పుడు సమాచారమిస్తే శిక్షించాలి ప్రస్తుతం మీడియా ప్రపంచంలో అసత్యమనేది ఎక్కువగా రాజ్యమేలుతోంది. నిజం తెలిసేలోగా ఫేక్ న్యూస్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ప్రభుత్వాలకు ఛాలెంజ్‌గా మారుతోంది. సోషల్ మీడియాలోని ఫేక్‌న్యూస్‌ను ప్రజలు గమనించాలి. తప్పుడు సమాచారం అందించే వారిని శిక్షించే రోజులు రావాలి. – చందు సాంబశివరావు, బీజేపీ నేత మీడియా వ్యాపారమైంది ప్రస్తుతం మీడియా రంగం వ్యాపార రంగంగా మారింది. దీని ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా ప్రభుత్వాన్ని వాడుకోవాలి, చివరికి కోరుకున్న వ్యక్తి సీఎంగా ఉండాలనేదే ప్రధానంగా మారింది. దీంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చర్చా వేదికలో వారికి కావాల్సిన వాళ్లను తీసుకొచ్చి కావాల్సినట్టు మాట్లాడిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు నిజాలు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. – రామరాజు శ్రీనివాస్, ఏపీ ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు హుందాతనమే లేదు మా చిన్నతనంలో మద్రాసు నుంచి ఒకట్రెండు పత్రికలొచ్చేవి. అందులో సినిమా వాళ్లపై అప్పుడప్పుడు ఫేక్ న్యూస్‌లు వచ్చేవి. వాటిని సరదాగా తీసుకునేవాళ్లం. ఈనాడు వచ్చాక పరిస్థితి మారింది. అవసరమైనప్పుడల్లా అబద్ధపు వార్తలతో ప్రజలను మభ్యపెట్టింది. ఆంధ్రజ్యోతి ఆ పరిస్థితిని మరింత దిగజార్చింది. డిబేట్లు నిర్వహించే వారు కూడా çహుందాతనాన్ని పక్కన పెట్టేశారు. అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఎప్పుడు ఏం చేయాలో వారే డిసైడ్ చేస్తారు. – డీఏఆర్ సుబ్రమణ్యం, నవ్యాంధ్ర ఇంటలెక్చ్యువల్ ఫోరం ఛైర్మన్ విష ప్రచారాన్ని ఆపాలి ఫేక్ న్యూస్‌ను అడ్డుకోలేకపోతే సమాజం కొట్టుకుపోతుంది. లక్షల కోట్లంటూ సీఎం జగన్‌పై ఎన్నో ఆరోపణలు చేశారు. అవేవీ నిజం కాదని అందరికీ తెలుస్తోంది. ఈ సమయంలో పనిగట్టుకొని మళ్లీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఆలోచించే అవకాశం లేకుండా గందరగోళపరుస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా కర్లపాలెం వద్ద ఓ వ్యక్తి ఉబ్బసంతో చనిపోతే, పనుల్లేక అంటూ ఓ పత్రిక విష ప్రచారం చేసింది. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీæ, గుంటూరు జిల్లా కన్వీనర్ ఫుల్స్టాప్ పడాల్సిందే ఫేక్ న్యూస్‌ను నిషేధించాల్సిన బాధ్యత వార్తా సంస్థలపై ఉంది. దీనిపై ఎక్కడో ఒకచోట ఫుల్స్టాప్ పడాలి. వ్యక్తిగత దూషణలతో మీడియా ఎటువెళ్తుందనేది అర్థం కావడం లేదు. – ఎం.కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్టీఆర్‌ను దింపిన రోజులు కావివి తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మీడియా అధిపతులు అర్ధ సత్యాలు, అసత్యాలతో ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ రాజకీయాలపై తప్పుడు డిబేట్లు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో గతంలో రామారావు ప్రభుత్వాన్ని గద్దెదింపిన రోజులు కావివి. డిబేట్ల తీరు మారాలని త్వరలో ఆయా యాజమాన్యాలకు లేఖలు రాస్తాం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
కాదేదీ బిజినెస్‌కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్‌లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్‌లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్‌తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్‌తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్‌కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్‌పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఇదే చివరిది.. ఐదో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ వ్యాపారవేత్త!
గతంలో పెళ్లికి వెళ్లిన బంధువులు, సన్నిహితులు వధూవరులను నిండు నూరేళ్లు కలిసి జీవించమని ఆశీర్వదించేవాళ్లు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం.. అలా చెప్పరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వివాహ మండపంలో జీవితాంతం చేయి వదలనన్న ప్రమాణాన్ని వధూవరులు మరుస్తున్నారు. ఏదో ఒక కారణంతో దాంపత్య జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి. తాజాగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఏకంగా తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. మరి అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే లాస్ట్ అనుకుంటా.. ప్రముఖ ఆస్ట్రేలినయన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మార్దొక్ మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారు. ఈయనకు వ్యాపారం రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 92 ఏళ్ల వ్యాపారవేత్త తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్ని నెలల కిందటే శాన్ ఫ్రాన్సిస్కో మాజీ పోలీసు చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్‌తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి విషయాన్ని స్మిత్‌కు చెప్పగా.. ఆమె కూడా అంగీకరించింది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, మార్దొక్ ఇదే తన చివరి వివాహమని పేర్కొన్నారు. వీళ్లిద్దరి వ్యక్తిగత విషయాలను చూస్తే.. స్మిత్ ఇంతకుముందు దేశీయ గాయకుడు, రేడియో టీవీ ఎగ్జిక్యూటివ్ చెస్టర్ స్మిత్‌ను వివాహం చేసుకుంది. అతను ఆగస్టు 2008లో మరణించాడు. ఇటీవలే ఆన్ లెస్లీ స్మిత్ కు రూపర్ట్ తో పరిచయం ఏర్పడి, అది కాస్త పెళ్లికి వరకు వెళ్లింది. ఇక రూపర్ట్ మార్దోక్కి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యి.. ఆరుగురు పిల్లలు ఉన్నారు. ముర్డోక్ తన నాల్గవ భార్య, మాజీ టాప్ మోడల్ అయిన జెర్రీ హాల్‌కు గతేడాది ఆగస్టులో విడాకులు ఇచ్చని సంగతి తెలిసిందే. మర్డోక్ వ్యాపార సామ్రాజ్యంపై ఓ లుక్కేస్తే.. యూఎస్‌లోని ఫాక్స్ న్యూస్, యూకేలోని రైట్‌వింగ్ టాబ్లాయిడ్ ది సన్ ఉన్నాయి. అతను న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, పబ్లిషింగ్ హౌస్ హార్పర్ కాలిన్స్లకు న్యూస్ కార్పొరేషన్ అధిపతిగా కొనసాగుతున్నాడు. -
విష ప్రచారం మానుకోండి
సాక్షి, అమరావతి: ప్రజా చైతన్యానికి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు దారి తప్పుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ స్వలాభం, వర్గ ప్రయోజనాల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విలువలను వదిలేసి విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కథనాలతో ఓ వర్గం మీడియా అంతిమంగా రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేదిగా మారుతోందన్నారు. నేడు నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ‘జర్నలిజం మౌలిక సూత్రాలు–ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర’ అంశంపై విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, పత్రికా సంపాదకుడు కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీ శాంత కుమారి పాల్గొన్నారు. కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియాది ప్రధాన పాత్ర. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అంశంఒక్కటే అయినా గత ప్రభుత్వంలో ఒప్పు అయింది.. ఈ ప్రభుత్వంలో తప్పు అయినట్టు కథనాలు ఉంటున్నాయి. విలువలను ఉల్లంఘించడమే సంప్రదాయంగా కొన్ని పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మారగానే వార్తల రూపం, స్వరూపం, ప్రాధాన్యం మారిపోతున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు విశాఖలో జీఐఎస్ సదస్సుకు ఎందరో పారిశ్రామికవేత్తలు వచ్చి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిపైనా కొన్ని పత్రికలు వక్రీకరించి కథనాలు ప్రచురించాయి. దీనివల్ల ఎవరికి లాభం?.. నష్టపోయేది ఎవరు? అనేది పాత్రికేయులు ఆలోచించాలి. సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలోని కలం ఒకటే. లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు మీడియాలో విలువలు దిగజారిపోతున్నాయి. ఇది సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు. తమకు వ్యక్తులపై ఉన్న కక్షను వ్యవస్థపై రుద్దేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ పత్రికలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. ప్రజాసంక్షేమం గిట్టదు. – పి.విజయబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆ రెండు పత్రికలకు మంచి కనిపించదు.. ఆ రెండు పత్రికలకు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు జరుగుతున్న మంచి కనిపించదు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అవి అదే ధోరణి అవలంబిస్తున్నాయి. –మల్లాది విష్ణు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు -
దళితుల ప్రాతినిధ్యంతోనే మీడియాలో సామాజిక మార్పు
సనత్‌నగర్ (హైదరాబాద్): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో 1920, జనవరి 31న మూక్‌నాయక్ పత్రిక స్థాపించిన సందర్భంగా మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో మొదటి ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ డేగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో సమానత్వం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రికేయుడిగానూ కొనసాగారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగ్గవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను టీవీ చానల్ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన కేంద్రాల్లో దళితులను, ఆదివాసీ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే 14 మందిని నియమించినట్లు వివరించారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో దళిత జర్నలిస్టులపై వివక్షత ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. -
మీడియా స్వేచ్ఛ హరించుకుపోతోంది
పటాన్చెరు టౌన్: దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ హరించుకుపోతోందని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా గొంతులు తప్ప మిగిలిన గొంతులు మూగబోయిన పరిస్థితి ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ మహాసభల ముగింపు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏది మాట్లాడినా అణచివేసే ధోరణి వచ్చిందని.. వర్గ శత్రువులతో ఉంటే జర్నలిస్టులను కూడా విధ్వంసకారులుగా పరిగణించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల ముగింపు సందర్భంగా ఐజేయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ జాతీయ అధ్యక్షుడిగా వినోద్ కోహ్లీ, ప్రధాన కార్యదర్శిగా సభా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ ఇస్మాయిల్(తెలంగాణ), కార్యదర్శులుగా నారాయణ పంచల్( మహారాష్ట్ర), రతుల్బోరా(అసోం), రాజమౌళిచారి(తెలంగాణ), ట్రెజరర్‌గా నతుముల్ శర్మ (ఛత్తీస్‌గఢ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నవీన్ శర్మ(చండీగఢ్), భాస్కర్(తెలంగాణ) సిమిజాన్ (కేరళ), బాబు థోమస్, అనిల్ బిశ్వాస్, తారక్ నాథ్‌రాయ్(వెస్ట్‌బెంగాల్), రవి (మహారాష్ట్ర), జుట్టు కలిత (అసోం)ను ఎన్నుకున్నారు. -
షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రమాదం ఉద్యోగులు మెడకు చుట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టెక్, ఐటీ దిగ్గజాలు ఉద్యోగులు ఉపాధిపై దెబ్బకొట్టాయి.ఆదాయాలు తగ్గిపోవడం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల కోత ఆందోళన కొన సాగు తుండగానే తాజాగా ఈ భారీ తొలగింపుల సీజన్ సెగ మీడియా బిజినెస్‌ను తాకింది.(జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యాజమాన్యంలోని సీఎన్ఎన్ ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు నెట్వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ లిచ్ట్ బుధవారం మొత్తం టీమ్‌కు అంతర్గత సందేశంలో ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధానంగా పెయిడ్ కాంట్రిబ్యూటర్స్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పొంచి ఉన్న మాంద్యం, పెరుగుతున్న స్ట్రీమింగ్ ఖర్చులను తగ్గించుకునేలా డిస్నీ ఉద్యోగుల తొలగింపులు, నియామక స్తంభన, ఇతర వ్యయాలను తగ్గించే కార్యక్రమాలను కూడా ప్రకటించింది. (వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు) ఆర్థికరంగ మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యయాలను నియంత్రించు కునేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, యాడ్ మార్కెట్ మందగింపుతో మీడియా వ్యాపారం కూడా దెబ్బతింటోంది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాలు నిలిపివేత లాంటి ఇతర ఖర్చు తగ్గించే చర్యలను మీడియా సంస్థలు ప్రకటించాయి. సీబీఎస్, ఎంటీవీ, వీహెచ్1 లాంటి అనేక ఇతర నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్న మరో మీడియా పవర్‌హౌస్, పారామౌంట్ గ్లోబల్ ఇటీవల ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. (శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు) CNN boss Chris Licht informs employees in an all-staff note that layoffs are underway. Licht says those being notified today are largely paid contributors and then tomorrow CNN "will notify impacted employees." Licht will then provide an update to staff afterward. pic.twitter.com/nD0pt9Ruwj — Oliver Darcy (@oliverdarcy) November 30, 2022 -
ఎన్డీటీవీకి అదానీ ఆఫర్ షురూ
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ ఎన్డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 294 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ నెల 22న ప్రారంభమై డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించింది. దశాబ్దంక్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. తద్వారా న్యూస్గ్రూప్ సంస్థలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఫలితంగా అక్టోబర్ 17న వాటాదారుల నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే సెబీ నుంచి అనుమతులు ఆలస్యంకావడంతో తాజాగా ఇందుకు తెరతీసింది. వెరసి షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల ఎన్డీటీవీ ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఆఫర్‌కు పూర్తి స్పందన లభిస్తే రూ. 492.81 కోట్లు వెచ్చించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ 23 శాతం తక్కువ! చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
మీడియా@65 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద (ఎంఅండ్‌ఈ) పరిశ్రమ 2030 నాటికి 55–65 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓటీటీ, గేమింగ్ విభాగాలు ఇందుకు ఊతంగా ఉండనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఎంఅండ్‌ఈ రంగం 2022లో 27–29 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ‘పటిష్టమైన వృద్ధి చోదకాలు ఉన్నందున 2030 నాటికి పరిశ్రమ 55–65 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 65–70 బిలియన్ డాలర్లకు కూడా చేరే సామర్థ్యాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్ విభాగాల వృద్ధి ఇందుకు తోడ్పడనుంది‘ అని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ధోరణుల్లో మార్పులతో మీడియాలోని కొన్ని విభాగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. పరిశ్రమ ‘బూమ్‘కు డిజిటల్ వీడియో, గేమింగ్ సెగ్మెంట్లు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీని ప్రకారం ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల జోరుతో 2022లో మొత్తం మీడియా వినియోగంలో వీటి వాటా 40%గా ఉంది. డిజిటల్.. డిజిటల్.. మిగతా సెగ్మెంట్ల కన్నా ఎక్కువగా డిజిటల్ వినియోగం వృద్ధి చెందుతోంది. 2020–2022 మధ్య కాలంలో భారత ఎంఅండ్‌ఈ పరిశ్రమ దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందగా, ఇందులో మూడింట రెండొంతుల వాటా డిజిటల్‌దే కావడం గమనార్హం. నివేదిక ప్రకారం సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్‌వీవోడీ) చందాలు 2022లో 8–9 కోట్ల మేర పెరగవచ్చు. ప్రస్తుతం ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్ కోసం చెల్లించడానికి యూజర్లలో మరింత సుముఖత పెరుగుతోంది. 2030 నాటికి మొత్తం ఓటీటీ ఆదాయంలో ఎస్‌వీవోడీ వాటా 55–60%గా ఉండనుంది. పరిశ్రమపై కొత్త ధోరణులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనున్నాయి. మెటావర్స్ మొదలైన టెక్నాలజీల వినియోగం .. గేమింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా రంగాల్లోకి గణనీయంగా విస్తరించనుంది. చదవండి: ‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది! -
మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమేదీ?
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రముఖ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు అనే అంశంపై రెండో రోజైన ఆదివారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని... కొందరు ఆంధ్ర పాలకులు అడ్డుపడినా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంపై మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిజంపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రజాప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ‘మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రజాప్రయోజనాలకు వాడాలి’అని కోరారు. గ్రామీణ, దళిత, మహిళా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చాం: అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారన్నారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు, దళిత జర్నలిస్టులకు, మహిళా పాత్రికేయులకు శిక్షణ ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండు రోజుల సదస్సుపై నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో టిశాట్ సీఈవో ఆర్. శైలేశ్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం–న్యూ మీడియా (బెంగళూరు) డీన్ డా. కంచన్ కౌర్, రాష్ట్ర ఐటీ (డిజిటల్ మీడియా) డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేష్ దుబ్బుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సుధాకర్‌రెడ్డి, ఉడుముల, సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, వర్సిటీ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన, ఓయూ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా, మాజీ సంపాదకుడు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. -
లక్ష కోట్లు దాటుతోంది.. ఇంకా లైట్ తీసుకుంటే ఎలా ?
న్యూఢిల్లీ: టీవీ, న్యూస్‌పేపర్, వెబ్సైట్, వీడియో కంటెంట్ సైట్ ఏదైనా సరే అడ్వెర్టైజ్మెంట్ కనిపించిందంటే చాలు వెంటనే ఛానల్ మార్చడంతో, పేపర్ తిప్పడంలో స్కిప్ బటన్ నొక్కడమో చేస్తాం. జనాలు పెద్దగా యాడ్స్‌పై దృష్టి పెట్టకున్నా ప్రకటనల విభాగం మాత్రం ఊహించని స్థాయి వృద్ధి కనబరుస్తోంది. మరో రెండేళ్లలో లక్ష కోట్ల మార్క్‌ను దాటేయనుంది. లక్ష కోట్లు ప్రకటనల రంగం దేశంలో 2024 నాటికి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని ఈవై–ఫిక్కీ నివేదిక వెల్లడించింది. వార్షిక వృద్ధి 12 శాతం నమోదవుతుందని తెలిపింది. ‘ప్రకటనల రంగ ఆదాయం 2019లో రూ.79,500 కోట్లు. పరిశ్రమ 2020లో 29 శాతం తిరోగమనం చెందింది. కోవిడ్–19 ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ రంగం తిరిగి పుంజుకుని 2021లో ఆదాయం 25 శాతం అధికమై రూ.74,600 కోట్లను దక్కించుకుంది. ఈ ఏడాది 16 శాతం వృద్ధితో రూ.86,500 కోట్లకు చేరనుంది. ఆ రెండు కలిపితే భారత మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం గతేడాది 16.4 శాతం పెరిగి రూ.1.61 లక్షల కోట్లు నమోదు చేసింది. ఈ ఏడాది 17 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లను తాకి మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంటుంది. 2024 నాటికి ఏటా 11 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లు నమోదు చేస్తుంది. నంబర్ వన్ టీవీనే టెలివిజన్ అతిపెద్ద సెగ్మెంట్‌గా మిగిలిపోయినప్పటికీ డిజిటల్ మీడియా బలమైన నంబర్–2గా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముద్రణ విభాగం పుంజుకుని మూడవ స్థానంలో నిలిచింది. డిజిటల్ మీడియా వాటా 2019లో 16 శాతం కాగా, గతేడాది 19 శాతానికి ఎగబాకింది. మీడియా, వినోద రంగంలో టీవీ, ప్రింట్, చిత్రీకరించిన వినోదం, ఔట్‌డోర్ ప్రకటనలు, సంగీతం, రేడియో వాటా 68 శాతముంది. 2019లో ఇది 75 శాతం నమోదైంది. సినిమా థియేటర్లలో ప్రకటనలు, టీవీ చందాలు మినహా మీడియా, వినోద పరిశ్రమలో 2021లో అన్ని విభాగాల ఆదాయాలు పెరిగాయి. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార మాధ్య మాలపై ఉందని, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ని ఎంసీహెచ్ఆర్డీలో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమన్నారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని అన్నారు. వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత మీడియాదేనని స్పష్టం చేశారు. సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావు గారికి ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వ రాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణాపత్రికకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ముట్నూరి కృష్ణారావు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం అయిందన్నారు. ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్ చైర్మన్ డా.వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్ ఎం.వి.ఆర్.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గేదేలే అంటున్న అదానీ.. ఈ రంగంలో కూడా ఎంట్రీ
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్ తాజాగా మీడియా వ్యాపారంలోకి ప్రవేశించింది. క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎం) మైనారిటీ వాటాను అదానీ కైవసం చేసుకుంది. ఎంత వాటా, చెల్లించిన మొత్తాన్ని కంపెనీ వెల్లడించలేదు. క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాలో వాటా కోసం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ అయిన క్వింట్ డిజిటల్ మీడియాతో అవగాహన ఒప్పందం కుదిరింది. బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ కంపెనీ అయిన క్యూబీఎం.. బిజినెస్ వార్తలను అందిస్తున్న డిజిటల్ వేదిక బ్లూమ్‌బర్గ్ క్వింట్‌ను బ్లూమ్‌బర్గ్‌తో కలిసి నిర్వహిస్తోంది. అదానీ ప్రవేశించిన వెంటనే యూఎస్‌కు చెందిన బ్లూమ్‌బర్గ్ మీడియా క్యూబీఎంను విడిచిపెట్టింది. భారతదేశంలో క్యూబీఎమ్తో ఈక్విటీ జాయింట్ వెంచర్‌ను ముగిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బ్లూమ్‌బర్గ్ వాటాను అదానీ కొనుగోలు చేసిందా అన్న అంశంలో స్పష్టత లేదు. క్యూబీఎంకు మాత్రమే ఈ డీల్ పరిమితమని, క్వింట్ డిజిటల్‌కు చెందిన ద క్వింట్, క్విన్టైప్ టెక్నాలజీస్, ద న్యూస్ మినిట్, యూత్ కీ ఆవాజ్‌కు సంబంధం లేదని అదానీ స్పష్టం చేసింది. మీడియాలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్.. తన మీడియా సంస్థకు సారథిగా ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్ పుగాలియాను నియమించుకుంది. క్వింట్ డిజిటల్ మీడియా ప్రెసిడెంట్ గా సంజయ్ గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన అదానీ మీడియా వెంచర్స్ సీఈవోగా ఉన్నారు. -
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు. -
ఇవాళ్టి అవసరం!
ఎవరైనా, ఏదైనా మారుతున్న కాలానికి తగ్గట్టు మారాల్సిందే. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకొని, దేశంలోని పత్రికా రంగాన్నీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ను గుర్తుచేసుకున్న పక్షం రోజులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమర్పించిన నివేదిక మారుతున్న మీడియా ప్రపంచంతో మారాల్సిన విధానాలను స్పష్టం చేసింది. పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ – ఇలా విస్తరించిన మీడియా అంతటినీ పర్యవేక్షించేలా ‘మీడియా కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అవ్యవస్థలకూ, అక్రమాలకూ అడ్డుకట్ట వేసేలా కౌన్సిల్‌కు చట్టబద్ధమైన అధికారాలు కట్టబెట్టాలంది. ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఉన్నా, దాని ప్రభావం పరిమితమే. అందుకే, వర్తమానానికి అవసరమైన మీడియా కౌన్సిల్ ఏర్పాటు కోసం నిపుణులతో ఓ కమిషన్ వేయాలంది. ప్రింట్ మీడియాకు ఎప్పటి నుంచో చట్టబద్ధమైన ప్రెస్ కౌన్సిల్ ఉంది. కానీ, టీవీకి అలాంటిది లేదు. సంస్థలుగా వృద్ధి చెందిన జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ ప్రమాణాల సంస్థ (ఎన్బీఎస్ఏ), న్యూస్ బ్రాడ్కాస్టర్ల అసోసియేషన్ (ఎన్బీఏ)లకేమో ప్రభుత్వ అధికారిక గుర్తింపు లేదు. మరోపక్క, మన దేశంలో ఎన్ని ఇంటర్నెట్ వెబ్సైట్లున్నాయో ఎలక్ట్రానిక్స్ – ఐటీ శాఖలో రికార్డు లేదు. ఓ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వెబ్‌సైట్లున్నాయి. వాటిలో కనీసం 20 కోట్ల సైట్లు చురుకుగా పనిచేస్తున్నాయి. మన దేశంలో 1.44 లక్షల వార్తాపత్రికలు, మేగజైన్లున్నాయి. 926 ఉపగ్రహ టీవీ ఛానళ్ళు (387 న్యూస్ ఛానళ్ళు, 539 నాన్–న్యూస్ ఛానళ్ళు), 36 దూరదర్శన్ ఛానళ్ళు, 495 ఆకాశవాణి ఎఫ్.ఎం. కేంద్రాలు, 384 ప్రైవేట్ ఎఫ్.ఎం. రేడియోలు ఉన్నట్టు లెక్క. ఇవి కాక నేటి సోషల్ మీడియా. అందుకే, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సారథ్యంలోని స్థాయీ సంఘం బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన ‘మీడియా కవరేజ్‌లో నైతిక ప్రమాణాలు’ నివేదికలోని అంశాలు కీలకం. నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తున్న రోజులివి. వాటితో కుస్తీ సాగుతుండగానే, మరోపక్క సామాజిక మాధ్యమ వేదికల వల్ల పత్రికా రచన పౌరుల చేతుల్లోకి వచ్చింది. కొన్ని లోపాలున్నా పౌర పాత్రికేయం మంచిదే. అయితే, వ్యాప్తి పెరుగుతున్న డిజిటల్ మీడియాలోనూ విశృంఖలత విజృంభిస్తోంది. అందుకే, డిజిటల్ మీడియాలో నిర్ణీత నైతిక నియమా వళిని పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంఘం సూచించింది. అది కావాల్సిన, రావాల్సిన మార్పు. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూ ఆ పని చేయాలంది. అది ఆమోద యోగ్య మార్గం. అలాగే, ఈ ఏడాదే ప్రకటించిన ‘ఐటీ రూల్స్ 2021’ డిజిటల్ మీడియా వేదికల్లో జవాబుదారీతనం తెస్తాయనీ, కంటెంట్ నియంత్రణలో ఉపకరిస్తాయనీ స్థాయీసంఘం ఆశిస్తోంది. ఇవాళ్టి డిజిటల్ యుగంలోనూ ప్రభుత్వాలు విధిస్తున్న నెట్ నిషేధాలూ చూస్తున్నాం. కానీ, దేశ భద్రత, సమైక్యత పేరిట ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్పై నిషేధంతో ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లుతుంది. ఆర్థిక పురోగతీ దెబ్బతింటుంది. అత్యవసర పరిస్థితులంటూ ఫోన్, నెట్ సేవలను నిషేధించడం వల్ల టెలికామ్ ఆపరేటర్లకు ప్రతి సర్కిల్ ఏరియాలో గంటకు రూ. 2.4 కోట్ల నష్టం వస్తుందని అంచనా. గంపగుత్తగా ఇలా నిషేధం పెట్టి నష్టపరిచే కన్నా, అవసరాన్ని బట్టి ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ లాంటి సర్వీసులను ఎంపిక చేసుకొని ఆ నిర్ణీత వేళ వాటిని నిషేధించే ఆలోచన చేయాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇదీ ఆచరణాత్మకమే అనిపిస్తోంది. 1995 నాటి కేబుల్ నెట్వర్క్స్ (నియంత్రణ) చట్టంలో మార్పులు తేవాలనీ స్థాయీ సంఘం అంటోంది. అలా చట్టాన్ని సవరిస్తే– ఫిర్యాదులపై పాలకుల ఇష్టారాజ్యపు కార్యనిర్వాహక ఉత్తర్వుల మేరకు కాక, చట్టప్రకారం వ్యవహరించవచ్చు. ఇక, ‘కేబుల్ నెట్వర్క్ రూల్స్–2014’లోని ‘జాతి వ్యతిరేక వైఖరి’ అనే పదాన్ని సమాచార ప్రసార శాఖ సరిగ్గా నిర్వచించాలన్న మాట స్వాగతనీయం. ప్రైవేట్ టీవీ ఛానళ్ళను అనవసరంగా వేధించడానికి ఆ పదం ఆయుధమవుతున్న సందర్భాలు న్నాయి. ఆ మధ్య కేరళలో రెండు టీవీ ఛానళ్ళకు అదే జరిగింది. ఇటీవల ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలూ ఊపందుకుంటున్నాయి. ఆన్లైన్లో, ఓటీటీ వేదికల్లో నియంత్రణ లేని అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉంటోంది. ఏ పరిధిలోకీ రాకుండా తప్పించుకుంటున్న వీటిపైనా ఈ స్థాయీ సంఘం దృష్టి పెట్టింది. అనియంత్రిత ఓటీటీ కంటెంట్ పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. అలాగని ఏది చూడాలి, ఏది వద్దనే వీక్షకుడి స్వేచ్ఛను ప్రభుత్వం కఠిన చర్యలతో కత్తిరించడమూ కరెక్ట్ కాదు. స్థాయీ సంఘం సైతం అంగీకరించిన వీటిని దృష్టిలో పెట్టుకొని నియమావళి చేయాలి. ప్రతిపాదిత ‘మీడియా కౌన్సిల్’ ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధనకు పనిచేసే నిపుణుల కమిషన్ ఆరు నెలల్లో తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఆపైన ప్రభుత్వం చొరవ చేస్తే, ప్రెస్ కౌన్సిల్‌కు భిన్నంగా అన్ని మీడియాలనూ పర్యవేక్షించే మీడియా కౌన్సిల్ వస్తుంది. డిజిటల్ మీడియాకూ నైతిక వర్తనా నియమావళిని చేశాక, అది అమలయ్యేలా చూడడం మరో ఎత్తు. అందుకు సమాచార, ఐటీ శాఖలు కలసి పనిచేయడం అవసరం. అదే సమయంలో కొత్త కౌన్సిల్, నియమావళి దుర్వినియోగం కాకుండా చూడడమూ అంతే అవసరం. పాలకులు తమ స్వార్థం, కక్ష సాధింపుల కోసం వాటిని వినియోగించుకొంటే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛకూ, మీడియాకూ అండనిచ్చిన 14, 19, 21వ రాజ్యాంగ అధికరణాలను ఉల్లంఘించకుండా అదుపాజ్ఞలూ కావాలి. అలాంటి సమగ్ర నియమావళి, సమర్థ మీడియా కౌన్సిల్ ఏర్పడితే మంచిదే! -
చట్టబద్ధమైన అధికారాలతో మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. -
పత్రికల్లో పాతతరం విలువలు రావాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, నెల్లూరు: ‘ ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రోతపుడుతున్నాయి. అలాగే పత్రికల్లోనూ విలువలు దిగజారిపోయి సంచలనాల కోసం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయి. అన్ని పత్రికలు చదివితే కానీ వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. పత్రికల్లో పాతతరం విలువలు రావాలి’ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగిన లాయర్ వారపత్రిక 40 వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు. రాను రాను పత్రికల విలువల్లో మార్పు వస్తోందని ఇది కొందరికే వర్తించే అంశమే అయినా ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని సూచించారు. పాలిటిక్స్, జర్నలి జం, మెడిసిన్ ఈ మూడు వ్యాపార ధోరణిలోకి పోకూడదని.. కానీ ఆ మూడు వ్యాపార దోరణీలోనే ఉన్నాయన్నారు. పాత్రికేయ రంగంలో నార్ల వెంకటేశ్వరరావు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. నెల్లూరులో పులిబొంగరాల న్నా... శెట్టెమ్మ దోశెలన్నా.. ట్రంకురోడ్డులో తెలిసిన వారితో తిరగాలన్నా.. తనకెంతో ఇష్టమని ఈ పదవుల వల్ల అక్కడికి వెళ్లి తినలేని పరిస్థితి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా సమయంలో అశువులు బాసిన జర్నలిస్టుల స్మృతికి నివాళులు అర్పించారు. డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. స్వప్నకు తుంగా అవార్డు తుంగా రాజగోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ జర్నలిస్టు స్వప్నను ఎంపిక చేసి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చారు. వీఆర్ కళాశాల పూర్వ అధ్యాపకుడు రామచంద్రరావును సన్మానించారు. పుస్తకావిష్కరణ.. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా ప్రభాత్‌రెడ్డి (ప్రభు) రచించిన ‘‘విజయపథంలో నెల్లూరీయులు’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.