మాట్లాడుతున్న అల్లం నారాయణ
సనత్‌నగర్ (హైదరాబాద్): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో 1920, జనవరి 31న మూక్‌నాయక్ పత్రిక స్థాపించిన సందర్భంగా మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో మొదటి ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ డేగా నిర్వహించారు.
ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్‌వర్క్ (ఐడీజేఎన్) కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.
ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో సమానత్వం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రికేయుడిగానూ కొనసాగారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగ్గవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను టీవీ చానల్ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన కేంద్రాల్లో దళితులను, ఆదివాసీ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే 14 మందిని నియమించినట్లు వివరించారు.
బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో దళిత జర్నలిస్టులపై వివక్షత ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment