allam narayana
-
ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గతంలో పత్రికా ఫొటోగ్రాఫర్లకు ఫొటో జర్నలిస్టుగా అక్రిడిటేషన్ ఉండేదని, కానీ నేడు ఫొటోగ్రాఫర్‌గా మార్పు చేయడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్‌రెడ్డి, ఠాకూర్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. హరీశ్ మాట్లాడుతూ దినపత్రికల్లో వార్త పూర్తిగా చదవకపోయినప్పటికీ ఫొటోను చూసి సారాంశం గ్రహించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం కేటాయించిందని, త్వరలో జర్నలిస్టు భవనం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్‌లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్‌లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్‌కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్‌రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల ప్రాతినిధ్యంతోనే మీడియాలో సామాజిక మార్పు
సనత్‌నగర్ (హైదరాబాద్): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో 1920, జనవరి 31న మూక్‌నాయక్ పత్రిక స్థాపించిన సందర్భంగా మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో మొదటి ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ డేగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో సమానత్వం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రికేయుడిగానూ కొనసాగారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగ్గవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను టీవీ చానల్ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన కేంద్రాల్లో దళితులను, ఆదివాసీ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే 14 మందిని నియమించినట్లు వివరించారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో దళిత జర్నలిస్టులపై వివక్షత ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. -
మీడియా స్వేచ్ఛ హరించుకుపోతోంది
పటాన్చెరు టౌన్: దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ హరించుకుపోతోందని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా గొంతులు తప్ప మిగిలిన గొంతులు మూగబోయిన పరిస్థితి ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ మహాసభల ముగింపు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏది మాట్లాడినా అణచివేసే ధోరణి వచ్చిందని.. వర్గ శత్రువులతో ఉంటే జర్నలిస్టులను కూడా విధ్వంసకారులుగా పరిగణించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల ముగింపు సందర్భంగా ఐజేయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ జాతీయ అధ్యక్షుడిగా వినోద్ కోహ్లీ, ప్రధాన కార్యదర్శిగా సభా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ ఇస్మాయిల్(తెలంగాణ), కార్యదర్శులుగా నారాయణ పంచల్( మహారాష్ట్ర), రతుల్బోరా(అసోం), రాజమౌళిచారి(తెలంగాణ), ట్రెజరర్‌గా నతుముల్ శర్మ (ఛత్తీస్‌గఢ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నవీన్ శర్మ(చండీగఢ్), భాస్కర్(తెలంగాణ) సిమిజాన్ (కేరళ), బాబు థోమస్, అనిల్ బిశ్వాస్, తారక్ నాథ్‌రాయ్(వెస్ట్‌బెంగాల్), రవి (మహారాష్ట్ర), జుట్టు కలిత (అసోం)ను ఎన్నుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్ల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో ఇరువురు సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అకాడమీల్లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పరస్పరం సహకరించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అల్లం నారాయణ వివరంగా ఆంధ్రప్రదేశ్ అకాడమీ చైర్మన్‌కి తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు ఇతర కార్యక్రమాలు తెలిపి, మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్ అందజేశారు. ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలువాతో సత్కరించారు. తెలంగాణ అకాడమీ సెక్రటరీ, నాగులాపల్లి వెంకటేశ్వర రావు, ఇరు అకాడమీల సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ('చంద్రబాబువి పచ్చి అబద్దాలు.. అవి టీడీపీ పుట్టక ముందునుంచే ఉన్నాయి') -
పెరికలకు ప్రత్యేక కన్సల్టెన్సీ
పంజగుట్ట (హైదరాబాద్): పెరిక కులస్తుల విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆదివారం సోమాజిగూ డ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ హైదరాబాద్ పెరిక కుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడు బత్తిని పరమేష్‌తో పాటు మిగిలిన కార్యవర్గంతో అల్లం నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ సంఘానికి అర ఎకరం స్థలం, రూ.50 లక్షల నిధుల మంజూరు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
జర్నలిస్టుల హెల్త్‌కార్డులు చెల్లుబాటయ్యేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రా వును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావును కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. హెల్త్ కార్డుల అమలులో ఎదురౌతు న్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, మీడియా అకాడమీ చైర్మన్‌తో పాటు, జర్నలిస్టు ప్రతినిధులను కూడా పిలిచి త్వరలో చర్చిస్తామన్నారు. జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు కూడా ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు అల్లం నారాయణ, చంటి క్రాంతి కిరణ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే నాయకులు సూరజ్ భరద్వాజ్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
దసరాలోగా మీడియా అకాడమీ భవనం
సాక్షి, హైదరాబాద్: మీడియా అకాడమీ భవనాన్ని దసరాలోగా త్వరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్‌తో ప్రారంభిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పురోగతిని ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్‌తో అల్లం నారాయణ సమీక్షించారు. సెప్టెంబర్ చివరి వారంలోగా భవనం పూర్తిచేసి అప్పగించేందుకు ప్రయత్ని స్తామని ఆర్అండ్బీ అధికారులు హామీ ఇచ్చా రని అల్లం స్పష్టం చేశారు. భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు, లైబ్రరీ, గ్రామీణ, డెస్క్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. -
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. అల్లం నారాయణ హామీ
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే జర్నలిస్ట్‌ల కోసం ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. మూడోసారి అకాడమీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బుధ వారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు అల్లం నారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. -
6 వేల మంది జర్నలిస్టులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9 జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహించామని, వీటి ద్వారా 6 వేల మంది జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరచుకున్నారని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు మీడియా అకాడమీ ప్రచురించి శిక్షణ తరగతుల్లో ఒక కిట్‌ను జర్నలిస్టులకు అందజేస్తుందని వెల్లడిం చారు. సీఎం కేసీఆర్ మీడియా అకాడమీకి రూ.100 కోట్ల నిధిని ప్రకటించి, ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.16 కోట్లను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అకాడమీ అందజేసిందని వివరించారు. -
‘పాపవినాశనం’పై ప్రముఖుల ప్రశంసలు
షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకొని స్టార్ట్స్‌గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.ఒక చక్కటి సందేశాన్ని షార్ట్ ఫిల్మ్ లో ఇమిడించి అందరిని మెప్పించడం అంటే గొప్ప విషయం. అలాంటి ఒక సందేశాత్మక లఘు చిత్రాన్ని తెరకెక్కించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దొంగరి మహేందర్ వర్మ. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమా పాపవినాశనం. శివాని, జోష్ రవి, జబర్దస్త్ అప్పారావు, సమ్మెట గాంధీ, దంచెనాల శ్రీనివాస్, ప్రియ, శివ, సాయి రెడ్డి ప్రముఖ పాత్రల్లో నటించారు. మాస్టర్ లిఖిత్ & అక్షిత్ సమర్పణలో ఇందిర దొంగరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో హైదరాబాద్ లో ప్రదర్శించారు. కాగా ఈ షో కి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ,కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ , కో ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్,సినీ హీరో ఉత్తేజ్ ,డా. దాచేపల్లి సుధీర్ కుమార్ ,మహేందర్ తదితరులు బంధుమిత్రులతో హాజరయ్యారు. -
మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 24(శని, ఆది) రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను తెలంగాణా ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట, ప్లాజా హోటల్లో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో తొలి రోజు మొదటి సెషన్‌కు జర్నలిసులు స్వేచ్ఛ, సుమబాల అధ్యక్షత వహించారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హాజరైనారు. తెలంగాణా ఏర్పడిన తరువాత తొలిసారి మహిళా జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇది సంతోషదాయక మని అల్లం నారాయణ వెల్లడించారు. మహిళా జర్నలిస్టుల అస్థిత్వం కోసం, వారికి ఒక స్పేస్‌ను కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. వివిధ అంశాలపై సీనియర్ పాత్రికేయుల ప్రసంగాలతోపాటు, మహిళలుగా మీడియాలో ఎదురవుతున్న కష్టనష్టాలను పంచుకునే కలబోత కార్యక్రమం కూడా ఉందని అల్లం నారాయణ వెల్లడించారు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే ఆయా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారంకోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు రాష్ట్ర మహొళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ తరపున 5 లక్షల రూపాయలను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ జర్నలిస్టులుగా రాణిస్తున్నవారికి, ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న వారిందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళా మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి ఈ సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టులను చూడటం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యంగా మీడియా, పోలీసు రంగంలో మరింత శ్రమించాల్సి ఉంటుందన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఇపుడు పునర్నిర్మాణంలో కూడా జర్నలిస్టుల పాత్ర అమోఘమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా మీడియాలో పురుషులతో సమానంగా ఎదగడం అంటే.. ఎంతో ఒత్తిడి ఉంటుంది, అయినా నిబద్ధతతో రాణిస్తున్నవారిని తాను చాలామందిని చూశానని, ఇది నిజంగా అభినందనీయమని సబితారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు . జర్నలిజం అంటే ఒక వినూత్నమైన రంగం. మీడియా రంగాన్ని కేవలం పురుషులకే పరిమితం కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా తాము ముందుండాలనే లక్ష్యంతో సాగుతున్న మహిళా పాత్రికేయులందరికీ హ్యాట్సాఫ్ అన్నారు. -
మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
మహిళా జర్నలిస్టులకు రెండ్రోజుల శిక్షణా తరగతులు
సాక్షి, హైదరాబాద్: మహిళా జర్నలిస్టుల కు ఈనెలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలనుకునే వారు మీడియా అకాడమీ మేనేజర్ వనజ (7702526489)కు ఫోన్ చేసి, పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారు ఆయా జిల్లాల పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిరోజు ‘మహిళా జర్నలిస్టులు– ప్రధాన స్రవంతి మీడియా– మహిళల పాత్ర’, ‘పాత్రికేయ రంగంలో మహిళలు– ప్రత్యేక సమస్యలు’అనే అంశంపై తరగతులు ఉంటాయని తెలిపారు. రెండో రోజు ‘మహిళా అస్తిత్వం–జెండర్ సెన్సిటైజేషన్’, ‘ఫీచర్ జర్నలిజం– మెళకువలు’అనే అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్టాతులైన వారి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. -
అల్లం నారాయణకు సతీ వియోగం
హైదరాబాద్(లక్డీకాపూల్): రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ(54) కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన లూపస్, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల కోవిడ్ సోకింది. దీంతో ఆమె 22 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీలోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వద్ద ఉంచుతారు. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 12 గం.కు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్‌లోని ఆమె భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెస్‌లు మూసివేయడంతో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చడమేగాక.. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ సంతాపం..: అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నారాయణను ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మ మరణం పట్ల శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, టీయూడబ్లు్యజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పద్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. -
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు. -
కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు
నాంపల్లి (హైదరాబాద్): సీనియర్ జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు కోవిడ్‌తో మృతి చెందారని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల రూపాయల పింఛన్ లభిస్తుందని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో పదవ తరగతి లోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5.15 కోట్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకుందని వివరించారు. మీడియా అకాడమీ ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10–2–1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపాలని కోరారు -
దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి విర్రవీగుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే (హెచ్–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరణించిన విలేకరుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 1,950 మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్ కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం... ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. తాము కూడా మోదీ, అమిత్‌షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. తాను, ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మోదీ ఒక్కో జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు, ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మరణించిన విలేకరుల కుటుంబాలకు కేటీఆర్ చెక్కులను అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళికి విశిష్ట పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సామాజిక ధృక్పథం కలిగిన జర్నలిస్టులు ప్రస్తుతం అరుదైపోతున్నారని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాల ప్రదాన కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళిని విశిష్ట పాత్రికేయ పురస్కారంతో సన్మానించారు. వారసత్వంగా అందిపుచ్చుకున్న వామపక్ష భావజాలంతో సామాజిక ధృక్పథం ఉన్న పాత్రికేయుడిగా ఆయన కొనసాగుతున్నారని పలువురు పాత్రికేయులు ఆయన్ను కొనియాడారు. అనంతరం మురళి మాట్లాడుతూ.. దివంగత పాత్రికేయుడు అరుణ్సా గర్ది, తనది కుటుంబ, రాజకీయ నేపథ్యాలు ఒకటేనన్నారు. ప్రత్యేకమైన ఆలోచనలు, రచనాశైలితో అరుణ్‌సాగర్ ఒక తరం ముందే పుట్టా రని కొనియాడారు. అటువంటి మిత్రుడి పేరుతో నెలకొల్పిన అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక విశిష్ట సాహితీ పురస్కారం అందుకున్న కవి, అధ్యాపకుడు ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ ఆదివాసీల జీవన వైవిధ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అరుణ్‌సాగర్ రాసిన కొన్ని కవితలను ఆయన చదివి వినిపించారు. తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, కవి, సరస్వతీ సమ్మాళ్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్, తెలంగాణ సమాచార కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సినీ దర్శకుడు శంకర్, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు అరుణ్సాగర్తో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా–ఫేక్ న్యూస్ అంశంపై న్యాయ నిపుణుడు, రిటైర్డ్ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న ఫేక్‌న్యూస్ అత్యంత ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన మీడియాలో పెయిడ్ న్యూస్ వంటి అవాంచిత ధోరణులు ఉంటుండగా.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ దాన్ని మించిన ప్రమాదకారిగా తయారైందని పేర్కొన్నారు. -
కరోనా బాధిత జర్నలిస్టులకు రూ.3 కోట్ల సాయం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన 1,603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మీడియా అకాడమీ చరిత్రలో ఇంత పెద్దఎత్తున సాయం అందించడం ఒక మైలు రాయిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సమాచార భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్, గుర్తింపు కార్డు, పాజిటివ్ వచ్చిన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలను పంపడంతో వారికి ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇంకా కరోనా బారిన పడిన జర్నలిస్టులు ఉంటే తమ వివరాలను పంపాలని, వివరాలకు 80966 77444, 96766 47807లను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో అకాడమీ కార్యదర్శి డీఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 442 మంది పాత్రికేయులకు రూ.80 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. వివరాలకు తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ నెంబర్ 8096677444 లేదా మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్‌కుమార్ సెల్ నెంబర్ 9676647807ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఆ ఇద్దరి అరెస్ట్ దారుణం..
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబే, జర్నలిస్ట్ గౌతమ్ నవ్లఖలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్(ఎఫ్ఎస్సీ) పేర్కొంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వీరిని నిర్బంధించారని ఆరోపించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఎఫ్ఎస్సీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కన్వీనర్ అల్లం నారాయణ, రమణి, భూమన్, సాంబమూర్తి, ఆర్.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, ఆశాలత, జిట్టా బాల్‌రెడ్డిలతో పాటు మరో 30 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రకాశ్ అంబేద్కర్, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల ఉపా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది. -
నిరంతర శ్రమతోనే గొప్ప లక్ష్యాలు సాధ్యం
సాక్షి, మెదక్: నిరంతర శ్రమతోనే గొప్పలక్ష్యాలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం మెదక్ రామాయంపేటలో స్నేహ కళాశాల విద్యార్థులకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి.. దేశం పేరును ఖండాంతరాలకు చాటాలని పిలుపునిచ్చారు. పత్రికలను ఆసక్తిగా చదివితే కొత్త పదాలు, భాషాభివృద్ధితో పాటు సామాజిక పోకడలు అవగతమవుతాయని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటే..భవిష్యత్తు ఉండదన్నారు. నూతన ఆవిష్కరణలు,కంప్యూటర్ల వినియోగంపై నైపుణ్యం సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా..అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలన్నారు.