హైదరాబాద్(లక్డీకాపూల్): రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ(54) కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన లూపస్, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల కోవిడ్ సోకింది. దీంతో ఆమె 22 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీలోని ఇంద్రప్రస్థ అపార్ట్‌మెంట్ వద్ద ఉంచుతారు. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 12 గం.కు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో నిమ్స్‌లోని ఆమె భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెస్‌లు మూసివేయడంతో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చడమేగాక.. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తూ వచ్చారు.
సీఎం కేసీఆర్ సంతాపం..: అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నారాయణను ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మ మరణం పట్ల శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.
కాగా, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, టీయూడబ్లు్యజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పద్మ మృతి పట్ల సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment