అక్షర క్షిపణి | Alisetti Prabhakar birthday today | Sakshi
Sakshi News home page

అక్షర క్షిపణి

Published Sun, Jan 11 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

అక్షర క్షిపణి

అక్షర క్షిపణి

మనసొప్పు మాటలు..
చార్మినార్ హైదరాబాద్ ప్రతీక. నాలుగు బాహువులు చాచిన ఆ కట్టడం హైదరాబాద్‌ను కాపాడుతున్న ఒక చిహ్నం లాంటిది. ‘మత కల్లోలాలెన్ని చెలరేగినా మధ్యన చలించక నిలిచే/యోధానుయోధుడే/చార్మినార్’ అంటాడు అలిశెట్టి. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మీద కూడా ఆయన ఒక సిటీలైఫ్ రాశాడు. ‘ఏముందీ ఎగ్జిబిషన్‌లో/ రేట్లూ ఎక్కువ/ గేట్లూ ఎక్కువ’ అంతేకదా! అట్లాగే సిటీ పోకడలు, ఇక్కడి ఫ్యాషన్లు, సినిమా స్టైళ్లు..వాటిని ఎకసెక్కం చేసే ‘ఎంతటి బాబ్డ్ హెయిరయినా/ మళ్లీ కొప్పు/ మనసొప్పు’ అని ఒక వ్యాఖ్యానంలా ఆయన కవిత్వం ఉండేది. ‘ఎవరీ హైహీల్స్/ బంజారాహిల్స్’ రెండే పదాలు. బంజారాహిల్స్‌లాంటి సంపన్నులు నివసించే ప్రాంతం మీద ఇంత చిట్టి కవిత్వం. ఇంత సారం ఉన్న కవిత్వం మరొకటి ఉండదేమో.
 

 
 
అక్షరాలతో అగ్గిని పుట్టించిన కవుల నేపథ్యం కష్టాలే. సామాన్యుడి జీవనదారులను పెట్టుబడిదారులు కబ్జా చేస్తే.. ఆయుధమై మండే ఆకలికి ఆజ్యం పోసేది ఈ అక్షరాలే. ఈ కవితా కవనంలో క్షిపణులు పూయించిన యోధుడు అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాలలో కవ్వించిన ఈ కవిత.. పట్నం వీధుల్లో స్వైరవిహారం చేసింది. రెండు దశాబ్దాలకుపైగా సిటీలైఫ్‌తో ముడిపడిన జీవితం నిర్ద్వంద్వంగా, నిర్భయంగా సాగింది.
 
 
చిక్కడపల్లిలో 21 ఏళ్ల కిందటి దాకా అలిశెట్టి ప్రభాకర్ జీవించి ఉండేవాడు. పతంజలి ఒక గుడ్డివాడి పిల్లనగ్రోవి కథకు మూలమైన మూసీ వంతెన దాటాక, కుడివైపు సందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లే దారిలో, ఇరువైపులా కంకబొంగుల ఆర్చీల మధ్యన ఒకానొక చిన్న ఇంట్లో మేడ మీద రెండు గదుల్లో ఆయన నివాసం. ప్రభాకర్ కూడా అంతే. నిలువెత్తు శరీరంలో ఛటాక్ మాంసం కూడా లేని కట్టెబద్దలా ఊగులాడుతూ తిరుగాడేవాడు.
 
భాగ్య, ఇద్దరు పిల్లలు, దినాం ఇరవై నాలుగు గంటలూ ప్రవహించే దుమ్ము, గుమ్మం నుంచే పరుచుకుని ఉండే ఆయన చిత్రకళా సౌరభాలు, కవిత ్వం, పాత పుస్తకాలు, చెల్లాచెదురుగా పడి ఉండే బ్రష్షులూ, ఇంకులూ జీవితాంతం ఆయనను అంటిపెట్టుకుని ఉన్న దుమ్ము, ధూళి, దగ్గు, దమ్ము.. చివరి రోజుల్లో ప్రభాకర్ మరీ శిథిలమైన కాలమొకటి ఉండేది.

అప్పుడు అక్కడికి కూతవేటు దూరంలో ఉండే (సూర్యానగర్, చిక్కడపల్లి) జయధీర్ తిరుమలరావు, యూనివర్సిటీలో ఉండే ఘంటా చక్రపాణి, శ్రీనగర్ కాలనీలో ఉండే నేనూ.. చివరి రోజుల్లో ఆయనను బతిమాలి బామాలి నిజాం వెంకటే శం నుంచి వరవరరావు దాకా అన్ని ప్రయత్నాలు చేసి ప్రభాకర్ టీబీ మీద యుద్ధం ప్రకటించినా.. ఆయన  ఆ జబ్బుకు వెరవలేదు. కవిత్వం మీద తప్ప అన్నింటా నిర్లక్ష్యం, జీవన వైఫల్యం, లోపలి సంక్షోభం, జగిత్యాల వయా కరీంనగర్ హైదరాబాద్ వచ్చి చిక్కుల్లో పడ్డాననే అపరాధ భావన ఆయనను దేనికీ లొంగకుండా చేసింది.

మందులు వాడినా, ఆ మందులు పని చేయని కాలంలో కూడా ప్రభాకర్ మొండిగా ఉండేవాడు. అందరూ చేతులు వేలాడేసినపుడు జయధీర్, ఘంటా, నేనూ ఆయన కోసం మళ్లీ ఒక కొత్త ప్రయత్నం చేసి ఓడిపోయాం. ఆ తర్వాత అతనొక చరిత్ర మాత్రమే. కానీ ఇదే నగరాన్ని, దాన్ని ప్లాస్టిక్ మొహాన్ని, దాని కుహనా విలువలనీ ఎండగడ్తూ పత్రికలో రోజూ కవిత్వం రాసి, ఒకదశలో అదే ఆయన జీవితం గడిచే సాధనం కావడం కూడా ఒక చరిత్రే. రోజూ ఈ సిటీ జిలుగువెలుగుల నర్మగర్భాన్ని చిత్రించిన ఆయన కవిత్వమే ‘సిటీలైఫ్’.
 
అందరి అడ్డా..
పుట్టిన గడ్డనుంచి ఇక్కడికి రావడం పొరపాటైందని ప్రభాకర్ స్వీయ ప్రకటనలో రాసుకున్నారు. జగిత్యాలలో బతుకుదెరువు కోసం పెట్టుకున్న పూర్ణిమ ఫొటో స్టూడియో, కరీంనగర్‌లో ‘శిల్పి’ ఆయింది. జగిత్యాల కల్లోల పరిస్థితులు, కరీంనగర్‌లో కల్లోలాలతో కరచాలనం, సహవాసం ఆయన ను పుట్టిన గడ్డ మీద నిలువనీయలేదు. అనివార్యంగా హైదరాబాద్‌కు వచ్చి విద్యానగర్‌లో ‘చంద్రలేఖ’ అయ్యాడు ప్రభాకర్. యూనివర్సిటీకి వెళ్లే దారిలో, ఆంధ్ర మహిళాసభకు కొంత ముందు ఎదురుగా ప్రభాకర్ స్టూడియో ఉండేది.

జిల్లాల నుంచీ, యూనివర్సిటీ నుంచీ వచ్చే పిల్లలకు అది అడ్డా.  చాయ్‌లు, సమోసాలు, అన్నాలు. ప్రభాకర్‌ది గుంపు స్వభావం. మందిలో బతికాడు. ఇదే ఫొటో స్టూడియోతో అనుబంధం ఉన్న ‘వీరన్న’ ఆ తర్వాత ప్రభాకర్‌ని మించి క్రాస్‌రోడ్స్ దగ్గర ఒకానొక ఎదురుకాల్పులకు బలైపోయినవాడు. ప్రభాకర్ చుట్టూ మనుషులు వీళ్లు.
 
నిప్పు కణికలు
‘సిటీలైఫ్’ కోసం ప్రభాకర్ బంజారాహిల్స్‌కు వచ్చేవాడు. అక్కడ ఆంధ్రజ్యోతి. సన్నగా, గాలిలా ఊగులాడుతూ గంపెడు జుట్టు, హిప్పీ కటింగ్, వంపు తిరిగిన మీసం, ఆయన రాకకోసం ప్రేమగా ఎదురుచూసే వర్ధెల్లి మురళి, వి.శ్రీనివాస్, రాంమోహన్ నాయుడు, సురేంద్రరాజు, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ లాంటి పాత్రికేయులు. జన సంబంధాల్లో ఈ పాత్రికేయులే ప్రభాకర్‌కు చివరి అండ. ఈనాడు వెంకన్న, ఒక పాత్రికేయ సమూహం ఆయన ‘సిటీలైఫ్’ను మోసుకుని తిరిగేది. ఇదీ ప్రభాకర్ ఆవరణ. ఇదీ ప్రభాకర్ జీవితం.

చురకలు, మంటలు, జెండాలు, సిటీలైఫ్.. అసహ్యకరమైన,, బురదమయమైన, జీవితాల నగ్న చిత్రణే సిటీలైఫ్. ఈ జీవితంలో ఉండే కాపట్యం, విలువల పతనం, ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువలు, హింసా రాజకీయాలు, నెత్తురూ, కన్నీరూ కలిపి ప్రవహించే అతి సామాన్యుడి జీవితం, ఎంతకూ వెలగని నిప్పు కణికల గురించిన స్పృహ ఆయన చిట్టి చిట్టి పద్యాల నిండా ఉండేవి. ఏదో ఒక సందర్భమో, ఆ రోజుకి ఆయనను కలచి వేసిన దృశ్యమో, పరిణామమో, మూడు వందల  అరవైఐదు రోజులూ క్రమం తప్పకుండా ఆయనతో కవిత్వం రాయించింది.
 
అల్ప పదాల్లో అనంతసారం
‘ఏ దేశం శిరసు మీద/ మోపిన/ పాదాలైనా/ హోదాలైనా/ సామ్రాజ్యవాదాలే’ అంతే కవిత్వం అయిపోయింది. ఇక మీరు ఏమి ఆలోచించాలో ఆలోచించండి. సామ్రాజ్యవాదాన్ని ఇంత సులభంగా కవిత్వంలోకి తేవడం సాధ్యమేనా? ఈ సిటీలైఫ్ ఎప్పటిది? కనీసం రెండున్నర దశాబ్దాల కిందటిది. సామ్రాజ్యవాదం సారాన్ని ఈ నాలుగు మాటలు చెప్పినంత శక్తిమంతంగా మరెవరన్నా చెప్పగలిగారా? అదే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ సారం.

కావ్య లక్షణాలూ, ప్రమాణ పాండిత్యాలు, రూపశైలీ విన్యాసాలు జానేదేవ్. ఇంత సులభంగా అల్ప పదాల్లో అనంత సారం. పాట మీద నిర్బంధం సమయంలో ప్రభాకర్ ‘గొంతు కోస్తే/ పాట ఆగిపోదు/ అది ముక్తకంఠం/ గొలుసులేస్తే/ పోరు నిలిచిపోదు/ అది ప్రజాయుద్ధం’ అంటాడు.
 
సామాన్యుడి కవి..

హైదరాబాద్ ఇరవై ఏళ్ల కింద ఇప్పటిలా ఉండేది కాదు. ఇప్పుడు ప్రాభవంతో, మాల్స్‌తో, మైమరిపించే గాజు అద్దాల ఊదారంగు ఆఫీసుల్తో, నిత్య నరకంలా ఉండే కిక్కిరిసిన రోడ్లతో, కాంక్రీట్ జనారణ్యంలా అప్పటికింకా మారలేదు. కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్ మాత్రమే అప్పుడు పెద్ద వ్యాపార కేంద్రాలు. మంది తిరిగే ప్రాంతాలు. ‘సాయంత్రం/సుల్తాన్‌బజార్/ స్త్రీల సెలయేరు/ ఆ రంగురంగుల మెరిసే గులకరాళ్లే/ కలవారు’ అని సుల్తాన్ బజార్‌ను వర్ణిస్తాడు అలిశెట్టి. ‘ఎందుకురా కవీ/ గజిబిజి ఇమేజీ/ అస్పష్ట కవిత్వం కన్నా/ ఆల్జీబ్రా ఈజీ’ అని కవిత్వం సులభంగా, అర్థమయ్యేట్లుగా ఉండాలనే సామాన్యుడి కవి ప్రభాకర్.
 
పదునైన మాట.. పసందైన గీత..
కవిత్వం రాయడమే కాదు. ఆ కవిత్వాన్ని సామాన్యుల చెంతకు, యూనివర్సిటీలకు మోసుకువెళ్లి ప్రజల పరం చేయడానికి ఒంటిచేత్తో సాహసం చేసి గెలిచినవాడు కూడా ప్రభాకర్. అలిశెట్టి చిత్రకారుడు కూడా. తన చిట్టిపొట్టి కవితలకు తనే బొమ్మలేసుకుని, వాటిని ఫొటోస్టాట్ కాపీలు చేసి ఒక తాడుకు కట్టి ఆర్ట్స్ కాలేజీలో వేలాడదీసి  కవితా, కళా ప్రదర్శన పెట్టేవాడు. యూనివర్సిటీలు ఆయన కవితానామస్మరణ చేసేవి.

ఆర్ట్స్ కాలేజీలో ఒక ప్రదర్శన. అప్పుడు వాతావరణం కూడా అనుకూలమైన ఉద్యమ వాతావరణం. ఏ రాజకీయాలకు సంబంధం లేనివాళ్లు, ఏ అవగాహనలూ, ప్రాపంచిక దృక్పథాలు లేనివాళ్లు కూడా ప్రభాకర్ కవిత్వసారాన్ని మనసున పట్టించుకునే వాళ్లు. కవిత్వమంటేనే జోకులేసే కాలంలో ఆయన కవిత్వాన్ని మౌఖిక సాహిత్యం వలే ఊరూరా తిరిగి ప్రచారం చేయగలిగారు. ‘పేదవాడికి అందనివి/ చెందనివి/ మచ్చుకు రెండు/ జూబ్లీహిల్స్ రాయి/ కృష్ణా ఒబెరాయి’.. శ్రీమంతం కుప్పబోసి, కేంద్రీకృతమైన జూబ్లీహిల్స్, అప్పుడప్పుడే వెలుస్తున్న ఫైవ్‌స్టార్ సంస్కృతి మీద ఇది ఆయన పదునైన కవిత.

సోవియట్ రష్యా పతనం అవుతున్న క్రమంలో గోర్బచెవ్ తెచ్చిన ‘బాహాటత’ మీద ప్రభాకర్ సిటీలైఫ్ ఇది.. ‘ఇప్పుడిప్పుడే సోవియట్ అందాలు/ విరజిమ్ముతోంది/ గ్లాసు కోస్తు/ గోర్బచ్చేవా’అని రాశాడు ఆయన. సమకాలిక స్పృహ, సహజ స్వభావంగా వచ్చిన నగర కృత్రిమతల వ్యతిరేకత, ప్రాపంచిక దృక్పథం వీడని భావజాల ప్రపంచం, సిటీ మర్మాల మీద ఆయన ఝళిపించిన కొరడాయే ఆయన కవిత్వం. మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో కనిపిస్తే ఒక ఖాళీ (ఫ్రేమ్) చిత్రమేముంది మిత్రమా ఊహించుకో అది గాలి (టైటిల్) అని వెక్కిరిస్తాడు.
 
కోట్‌ల విలువ..
అలిశెట్టి ప్రభాకర్ జీవితమే కవిత్వంగా బతికినవాడు. సిద్ధార్థుడు వదిలివెళ్లిన ఈ రాజ్యం మీద నెత్తుటిధారలు కడిగేందుకు కవిత్వం ఆయనకు అవసరమైన ఆయుధమైంది. సిటీలైఫ్ ప్రభాకర్ సమగ్ర కవితా స్వరూపానికి కొలబద్ద కాదుగానీ, ఆయనను ఆదుకొని అన్నం పెట్టిన కవితారూపమైంది. ఫొటో స్టూడియోలు, చిత్రకళ ఆయనను బతికించలేదు. కవిత్వమే ఊపిరిగా బతికిన అలిశెట్టి ‘కోట్’ లేకుండా వార్తలు లేవు. వ్యాసాలు లేవు. ‘తాను శవమై/ తనువు వశమై/ తాను పుండై/ అందరికీ పండై’ అన్న కవితను ఎందరు ఎన్నిసార్లు వాడుకున్నారో లెక్కలేదు. గోడ మీద ఆయన కవిత్వ నినాదమయ్యాడు.

ఒక ప్రవాసిలాగా తప్పిపోయిన పిల్లవానిలాగా ఈ సిటీ వెలుగుల వెనుక చీకట్ల సారాన్ని ఒడిసిపట్టిన ‘సిటీలైఫ్’ కవి పుట్టినరోజు, వ ర్ధంతి రోజు ఇవ్వాళ. జనవరి 12. ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత కూడా ఆయన ప్రాసంగికుడే. ఒక నమూనాయే. తెలంగాణ జీవన నేపథ్యం, కల్లోలాల నుంచి ఎదిగివచ్చిన ప్రభాకర్ చివరిరోజు అదే చిక్కడపల్లి ఇంట్లో తెల్లారింది.

ఒకానొక రాత్రిపూట చాపమీద భారంగా పడుకుని ఉన్న ఆయన పార్ధివదేహం ముందు భాగ్య, పద్మ, వి.శ్రీనివాస్, నేనూ నిశ్శబ్దంగా ఆ రాత్రి గడిపిన విషాదక్షణాల యాది. తెల్లవారి ప్రభాకర్ కోసం ఒక జన సమూహం వచ్చింది. ఎర్రజెండా కప్పి చిక్కడపల్లి నుంచి అంబర్‌పేట దాకా పెద్ద ఊరేగింపు. గుండె ఉండాల్సిన చోట ఉంచుకొని బతికిన ప్రభాకర్‌ను తలుచుకున్నప్పుడల్లా గుండె
 తొలగుతున్న వర్తమానంలా మనాది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement